
తక్షణం పీఆర్సీ కమిషన్ వేయాలి
చిత్తూరు కలెక్టరేట్ : కూటమి ప్రభుత్వం వెంటనే 12వ పీఆర్సీ కమిషన్‌ను ప్రకటించాలని ఏపీటీఎఫ్ 1947 జిల్లా అధ్యక్షుడు గోపినాథ్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆ సంఘం నాయకులు తమ డిమాండ్ల సాధన కోసం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. అనంతరం జాయింట్ కలెక్టర్ విద్యాధరిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలన్నారు. జీఓ 117 కు ప్రత్యామ్నంగా తీసుకొచ్చిన 9 రకాల పాఠశాలలు గందరగోళంగా ఉన్నాయన్నారు. పాత విధానంలో 1 నుంచి 5 తరగతుల ప్రాథమిక పాఠశాలలు, 1 నుంచి 8 ప్రాథమికోన్నత పాఠశాలలు, 6 నుంచి 10 ఉన్నత పాఠశాలలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రధాన కార్యదర్శి ముక్తార్ అహ్మద్ మాట్లాడుతూ పీఆర్సీ, డీఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. 12 వ వేతన సవరణ కమిషన్ వెంటనే ఏర్పాటు చేసి, మధ్యంతర భృతి 30 శాతం ఇవ్వాలన్నారు. కూటమి ప్రభుత్వం టీచర్ల డిమాండ్లను పరిష్కరించకపోతే ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘ నాయకులు చంద్రశేఖర్‌నాయుడు, చంద్రన్, జగదీష్, మధు, తులసి, అప్జల్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.