
కథ కంచికి.. మరి ఖాకీలు..?
● చిత్తూరులో దొంగా–పోలీస్ ఆట ముగిసినట్టేనా..! ● ఇన్‌స్పెక్టర్‌ను వీఆర్‌కు పంపడంతో సరిపెట్టేశారు ● ఎస్‌ఐతో పాటు ముగ్గురు పీసీల పాత్రపై సందేహాలు ● క్లీన్‌చిట్ ఇస్తారా.. తప్పు చేసినట్టు నిర్ధారించారా? ● ఇంతకూ విచారణలో ఏం తేల్చారో!
చిత్తూరు అర్బన్: చిత్తూరు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్. ఇటీవల వివాదాలకు, పలు ఆరోపణలకు కేంద్ర బిందువుగా మారింది. ఇక్కడ పనిచేసే ఒకరిద్దరు ఖాకీలు చేసే తప్పుడు పనుల కారణంగా.. నిజాయితీగా ఉంటున్న మిగిలిన పోలీసులూ నిందలు మోయాల్సిన పరిస్థితి. ఇటీవల ఇక్కడ పని చేసిన ఇన్‌స్పెక్టర్ (సీఐ)ను అవినీతి ఆరోపణలపై వీఆర్ (వేకెంట్ రిజర్వు)కు పంపించారు. ఇది శిక్షా? శిక్ష నుంచి తప్పించడమో? తెలియడంలేదు. ఇదే సమయంలో ఆరోపణలున్న మరో నలుగురిని ఇక్కడే కొనసాగిస్తుండడం పలు అనుమానాలకు తావిస్తోంది.
ఒక్కొక్కరికీ ఒక్కో‘లా’..
పలమనేరు అధికార పార్టీ ఎమ్మెల్యే చల్లిన బురదను కడుక్కోవడానికి జిల్లాలో ఏకంగా 250 మందికి పైగా సిబ్బందిని ఇష్టానుసారంగా బదిలీ చేసిన జిల్లా పోలీసు యంత్రాంగం.. అవినీతి ఆరోపణలు వచ్చిన ఖాకీలపై ఉదాసీన వైఖరి ప్రదర్శిస్తోంది. నిందితుడి భార్య, బంధువుల నుంచి రూ.12.50 లక్షలు ఖాకీలు కొట్టేసినట్లు ఆరోపణలు వచ్చాయి. చిత్తూరులోని ఓ కానిస్టేబుల్ తన ఫోన్‌పేకు రూ.3 లక్షలు వేసుకోవడం, ఓ అధికారి రూ.3 లక్షలు, మరో అధికారి రూ.6 లక్షలకు పైగా తీసుకుని అందులో కొంత మొత్తం వెచ్చించి స్టేషన్‌కు రంగులు వేయించడం, సిబ్బందికి, అధికారులకు యూనిఫామ్ కొనిచ్చారనే ఆరోపణలు పోలీసుశాఖను కుదిపేశాయి. అనంతపురం డీఐజీ నుంచి చిత్తూరు ఎస్పీ వరకు దీనిపై ఆరా తీశారు. చివరకు చిత్తూరు ఏఎస్పీ రాజశేఖర్‌రాజును ప్రత్యేక అధికారిగా నియమిస్తూ, జరిగిన ఘటనపై విచారణకు ఆదేశిస్తున్నట్లు మీడియాకు ప్రకటించారు. సుదీర్ఘ విచారణ తరువాత గతనెల 8న చిత్తూరు వన్‌టౌన్ సీఐగా పనిచేస్తున్న జయరామయ్యను వీఆర్‌కు పంపుతూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇందులో కీలక పాత్ర పోషించిన ఓ ఎస్‌ఐ, ముగ్గురు కానిస్టేబుళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా సీఐను వీఆర్‌కు పంపడం అతడిని శిక్షించినట్టా..? కాపాడినట్టా..? అంటూ పోలీసుశాఖలోని అధికారులే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రూ.500 లంచం తీసుకున్నారనే ఆరోపణలతో కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసిన అధికారులు, రూ.12.50 లక్షలు దొంగ నుంచే కొట్టేసిన అధికారుల విషయంలో మిన్నకుండడం విమర్శలకు దారితీస్తోంది. పైగా ఆరో పణలున్న ఎస్‌ఐ చేతిలో తప్పులు చేసేవాళ్లపై కేసులు నమోదు చేసే బాధ్యతను పెట్టడం సమాజానికి ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారని సామాన్యులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు విచారణలో ఏం నిర్ధారించారు..? తప్పు చేయకపోతే సీఐను మాత్రం ఎలా వీఆర్‌కు పంపుతారు..? ఎస్‌ఐ, మరో ముగ్గురి పాత్ర లేదా..? అనే సందేహాలు బేతాళ ప్రశ్నలుగా మిగిలిపోయాయి. విచారణ విషయాలు బయటపెట్టకపోవడానికి ఇది దేశ సార్వభౌమత్వం, సమగ్రత, రక్షణ రంగానికి సంబంధించిన సున్నితమైన అంశాలు కావు. అసలు దొంగ–పోలీస్ ఆటను విచారించిన అధికారులు వాస్తవాలను ప్రజలకు చెప్పాలిన అవసరం ఉందనే వాదన బలంగా వినిపిస్తోంది.
ఇదీ జరిగింది..
సంపత్. విద్యుత్‌శాఖలో రిటైర్డ్ ఉద్యోగి. ఈ ఏడాది జనవరిలో చిత్తూరులోని ఇతని ఇంట్లో చోరీ జరిగింది. భారీ మొత్తంలో బంగారు ఆభరణాలు, నగదు చోరీకి గురయ్యాయి. పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. అసలు అన్ని నగలు ఇంట్లో ఎందుకు పెట్టుకున్నావ్..? నీకు ఎక్కడి నుంచి వచ్చాయ్..? డబ్బులు ఎలా వచ్చాయి..? అని పలు ప్రశ్నలతో విసుగెత్తించి, ఆలస్యంగా కేసు నమోదు చేశారు. అదే నెల 30వ తేదీన ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు 238.5 గ్రాముల బంగారు ఆభరణాలు, 65 గ్రాముల వెండి, మూడు సెల్‌ఫోన్లు, ఓ వాచీ, రూ.4.06 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇంత వరకు బాగానే కథ నడిచింది. రాయచోటిలో జరిగిన ఓ చోరీ కేసులో పట్టుబడిన దొంగ, ఇక్కడ చోరీ సొమ్ము నుంచి రూ.12.50 లక్షలు చిత్తూరు పోలీసులకు లంచంగా ఇచ్చినట్లు చెప్పడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. ఆ మొత్తా న్ని తమకు ఇచ్చేస్తే దొంగ చోరీ చేసిన సొత్తుగా చూపించి, బాధితులకు ఇచ్చేస్తామని రాయచోటి పోలీసులు అడిగితే చిత్తూరు పోలీసులు అందుకు నిరాకరించడంతో విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి చేరవేశారు.