
తరగతులకు
మూకుమ్మడిగా రెమిడియల్ తరగతులకు టీచర్లు డుమ్మా
● కానరాని ‘పది’ సప్లిమెంటరీ విద్యార్థుల ప్రత్యేక తరగతులు ● రెమిడియల్ పేరుతో టీచర్లను వేదించడం సరికాదు ● రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులపై మండిపాటు ● ఉత్తర్వులు ఉప సంహరించుకోవాలని డిమాండ్
వేధింపులపై ఆగ్రహం
రెమిడియల్ తరగతుల పేరుతో టీచర్లను వేధించడం సరికాదని ఉపాధ్యాయ సంఘం నేతలు కూటమి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తీర్ణులు కానీ విద్యార్థుల కోసం రెమిడియల్ తరగతుల పేరుతో ఉత్తర్వులు జారీ చేయడంపై టీచర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ఉత్తర్వులు టీచర్ల వేసవి సెలవులను నిరోధించేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్ర అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండు వేసవిలో ప్రభుత్వ ఉపాధ్యాయులను వేధించేందుకు తీసుకున్న రెమిడియల్ తరగతుల ఉత్తర్వులను రద్దు చేయాలని ఉపాధ్యాయ సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు.
టాస్క్‌ఫోర్స్ : విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఉంటే జిల్లాలో మంచి ఫలితాలు సాధ్యపడేవి. అయితే జిల్లా విద్యాశాఖ అధికారులు మెరుగైన ఫలితాల సాధనకు ఎలాంటి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేయని పరిస్థితి నెలకొంది. దీంతో 2024–25 విద్యా సంవత్సరం ‘పది’ ఫలితాల్లో సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు రాష్ట్రంలో 24వ స్థానంకు దిగజారింది. ఈ ఫలితాలపై ఇటీవల జిల్లా స్థాయిలో నిర్వహించిన జెడ్పీ సర్వసభ్య సమావేశంలో జెడ్పీటీసీలు, ఎంపీపీలు విద్యాశాఖ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చేతులు కాలాక ఆకులు పట్టుకున్నారనే చందంగా పది పరీక్షల్లో విద్యార్థులు అధిక సంఖ్యలో ఫెయిల్ అయిన తర్వాత రెమిడియల్ తరగతులంటూ ఆర్భాటం చేస్తోంది. ఈ ఆర్భాటంలో భాగంగా జిల్లాలోని ప్రతి పాఠశాలలో పది ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం ఈనెల 2వ తేదీ నుంచి రెమిడియల్ తరగతులు నిర్వహించాలంటూ ఉత్తర్వులు జారీ చేశారు.
జిల్లాలో కనిపించని తరగతుల నిర్వహణ
కూటమి ప్రభుత్వం జారీచేసిన పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల రెమిడియల్ తరగతుల నిర్వహణ జిల్లాలో ఈనెల 3 వ తేదీ ఎక్కడా నిర్వహించ లేదు. ఈనెల 2వ తేదీ నుంచి 18వ తేదీ వరకు రెమిడియల్ తరగతులను ప్రతి ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. షెడ్యూల్ ప్రకారం ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రెమిడియల్ తరగతులు నిర్వహించాలని సూచించారు. అయితే జిల్లాలోని చిత్తూరు, పలమనేరు, కుప్పం, నగరి, పూతలపట్టు, జీడీ నెల్లూరు, పుంగనూరు నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా రెమిడియల్ తరగతుల నిర్వహణ జాడే కనిపించలేదు.
ఉత్తర్వులు హడావుడిగా రాత్రిపూట
రెమిడియల్ తరగతులు 2వ తేదీ నుంచి నిర్వహించాలని షెడ్యూల్ లో పేర్కొని ఉత్తర్వులేమో అదే తేదీ రాత్రికి రాష్ట్ర విద్యాశాఖ అధికారులు జారీ చేశారు. ఆ ఉత్తర్వుల్లో రెమిడియల్ తరగతుల నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఆ షెడ్యూల్‌లో ఈనెల 2వ తేదీ నుంచి తరగతులు ప్రారంభించాలని సూచించారు. అయితే ఉత్తర్వులు మాత్రం 2వ తేదీ రాత్రి విద్యాశాఖ అధికారులకు పంపించారు. ఇలాంటి ఆకస్మిక ఉత్తర్వుల జారీపై టీచర్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
మూకుమ్మడిగా బహిష్కరణ
జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల టీచర్లు మూకుమ్మడిగా రెమిడియల్ తరగతుల ఉత్తర్వులను పాటించకుండా బహిష్కరించారు. వేసవి సెలవుల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు విధులు ఎవరు నిర్వహిస్తారంటూ రెమిడియల్ తరగతులకు హాజరు కాకుండా డుమ్మా కొట్టారు. ముఖ్యంగా ఈ తరగతులను పర్యవేక్షించి పకడ్బందీగా అమలు చేయాల్సిన హెడ్‌మాస్టర్‌లే విధులకు డుమ్మా కొట్టారు. అయితే ఈ తరగతుల పర్యవేక్షణను ఎంఈఓలు, డీవైఈఓలు, డీఈవో సైతం పర్యవేక్షించని పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా ఈనెల 3వ తేదీన ఎన్ని పాఠశాలల్లో రెమిడియల్ తరగతులు నిర్వహించారో? ఎంత మంది విద్యార్థులు హాజరయ్యారో? ఎంత మంది టీచర్లు విధులకు హాజరయ్యారనే వివరాలు విద్యాశాఖ అధికారుల వద్దే లేని పరిస్థితి. ఈ తరగతుల నిర్వహణపై అయ్యోర్లు గుర్రుమంటుండంతో కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంటుంది.

తరగతులకు