
వడగండ్ల వాన.. పంటలకు నష్టం
● చిత్తూరులో వడగండ్లవాన ● పెనుగాలులకు నేలకూలిన విద్యుత్ స్తంభాలు ● రాలిన మామిడి కాయలు
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు నగరం, మండలంలో శుక్రవారం సాయంత్రం అర్ధగంటపాటు పెనుగాలులతో కూడిన వడగండ్లవాన బీభత్సం సృష్టించింది. దీంతో మండలంలో పలుచోట్ల కరెంటు స్తంభాలు నేల కూలిపోయాయి. అకాలవర్షం మామిడి పంటను దెబ్బతీసింది. ఈదుగాలులకు మామిడి చెట్లలో 30 నుంచి 50 శాతం వరకు కాయలు నేలరాలిపోయాయని రైతులు వాపోతున్నారు. సిద్ధంపల్లి, పెరుమాళ్లకండ్రిగ, గువ్వకల్లు, దిగువమాసాపల్లి, తాళంబేడు, చింతలగుంట తదితర ప్రాంతాల్లో అధిక శాతం చెట్లు కూలిపోయాయని రైతులు చెబుతున్నారు.
పెనుగాలులకు నేలవాలిన స్తంభాలు
చిత్తూరు కార్పొరేషన్: నగరంలో శుక్రవారం వీచిన పెనుగాలులకు పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలవాలాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఆకస్మాత్తుగా సాయంత్రం వాతవారణం చల్లబడింది. ఎక్కువగా గాలి వీయడంతో కొన్ని ప్రదేశాల్లో చెట్ల, కొమ్మలు లైన్‌పై పడి స్తంభాలు నేల కూలాయి. సిబ్బంది లైన్ పునరుద్ధరణకు చర్యలు చేపట్టే పనుల్లో నిమగ్నమయ్యారు. అలాగే పలు ప్రాంతాల్లో లైన్ ట్రిప్ప్ అవడంతో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. సత్యనారాయణపురం, బార్బర్‌కాలనీ, సాంబయ్యకండ్రిగ ప్రాంతాల్లో స్తంభాలు పడిపోయింది.