
చినతిరుమల.. కీలపట్ల!
● మే 5నుంచి కోనేటిరాయుని వార్షిక బ్రహ్మోత్సవాలు ● అంత్యంత చారిత్రక నేపధ్యం ఉన్న పురాతన ఆలయమిది ● ఇక్కడి మూలవిరాట్టు తిరుమల మూలమూర్తిని పోలిఉంది ● తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలలో కీలపట్ల ప్రస్థావన ● జిల్లానుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలనుంచి సైతం భక్తులు
పలమనేరు: ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని చారిత్రిక వైష్ణవాలయాల్లో తిరుమల వేంకటేశ్వరునితోపాటు పలమనేరు నియోజవర్గంలోని గంగవరం మండలం కీలపట్లలో వెలసిన కోనేటిరాయుని ఆలయానికి చినతిరుమలగా పేరుంది. తిరుమలకు వెళ్లలేని పేద భక్తులు కీలపట్ల ఆలయంలో స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. తిరుమలలోని మూలవిరాట్టు విగ్రహం ఎలా ఉందో ఇక్కడి ఆలయంలోనూ స్వామివారి మూలవిరాట్ అలాగే ఉంటారని, తిరుమల స్వామివారే ఇక్కడున్నారని భక్తుల నమ్మకం. తిరుమల తరహాలో ఇక్కడి ఆలయంలోనూ ఏటా స్వామివారికి టీటీడీ ఆధ్వర్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
ఇదీ ఆలయ చరిత్ర..
కీలపట్లలోని మూలవిరాట్టు కోనేటిరాయుని(శ్రీ వేంకటేశ్వరస్వామి) విగ్రహాన్ని భృగుమహర్షి ప్రతిష్టించారని చరిత్ర చెబుతోంది. ఆపై చోళులు, పల్లవులు, విజయనగర రాజుల ఏలుబడిలో విశేష పూజలందిచారని తెలుస్తోంది. అప్పట్లో మహ్మదీయుల దండయాత్రలకు భయపడిన గ్రామస్తులు స్వామివారి విగ్రహాన్ని కోనేటిలో దాచి ఉంచినందునే స్వామివారికి కోనేటిరాయునిగా పేరొచ్చినట్టు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. చంద్రగిరిని పాలించిన సామంతులు బోడికొండమ నాయుడుకి కలలో స్వామి వారు కనిపించి కోనేటిలోని విగ్రహాన్ని ఆలయంలో తిరిగి ప్రతిష్టించమని చెప్పినట్టు చరిత్రకారులు చెబుతున్నారు.
4 నుంచి కోనేటి రాయుడి ఉత్సవాలు
మే 4న సాయంత్రం సేనాధిపతి ఉత్సవంతో కోనేటిరాయుని బ్రహ్మోత్సవాల అంకురార్పణ జరుగుతుంది. మే 5న ధ్వజారోహణం, అదేరోజు సాయంత్రం పెద్దశేషవాహనం, 6న చిన్నశేషవాహనం, హంసవాహనం, మే 7న సింహవాహనం, ముత్యపుపందిరి, 8న కల్పవృక్ష వాహనం, 9న మోహినీ ఉత్సవం, సాయంత్రం శ్రీవారి కళ్యాణోత్సవం, గరుడవాహన సేవలు జరుగుతాయి. మే 10వ తేదీ ఉదయం హనుమంత వాహనసేవ, వసంతోత్సవం, గజవాహనసేవ, 11న సూర్యప్రభ, చంద్రప్రభ వాహన సేవలు, 12న స్వామివారి రథోత్సవం, ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
మూలవిరాట్‌లు ఒకేపోలిక
కీలపట్లలోని స్వామివారు, తిరుమలలోని స్వామివార్ల మూలవిరాట్‌లు ఒకే తరహాలో ఉంటారని ప్రతీతి. కోనేటి రాయుని విగ్రహంపై కటి వరద హస్తాలు, శంకు చక్రాలు, విగ్రహం చాతిపై శ్రీదేవి, భూదేవి ముద్రలతో అచ్చం తిరుమలలో స్వామివారిలాగే దర్శనమిస్తున్నారు.

చినతిరుమల.. కీలపట్ల!