ఇసుమంతైనా భయం లేదు! | - | Sakshi
Sakshi News home page

ఇసుమంతైనా భయం లేదు!

Mar 20 2025 1:51 AM | Updated on Mar 20 2025 1:47 AM

అక్రమమా..సక్రమమా.. తరువాత సంగతి.. గాలి ఉన్నప్పుడే తూర్పార పట్టాలన్నట్టుంది ఇసుకాసురుల పరిస్థితి. ఇసుక పాలసీని అతిక్రమించి నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుపుతున్నారు. తాగునీటి బోర్లను సైతం తవ్వేస్తున్నారు. అడ్డుకోవడానికి వెళ్లిన అధికారులపైనా దౌర్జన్యం చేసి, అక్కడికి రానీయకుండా వారినీ అడ్డుకుంటున్నారు. ఇదీ కౌండిన్యలో సాగుతున్న ఇసుక దందా.

పలమనేరు: కౌండిన్య నదిలో నిత్యం జేసీబీలు, ట్రాక్టర్లను పెట్టి కావాల్సినంత తోడేస్తున్నారు. చివరకు మున్సిపల్‌ పంప్‌హౌస్‌ వద్ద బోర్లను సైతం ఇసుకాసురులు తోడేస్తుంటే చేసేదిలేక స్థానిక మున్సిపల్‌ అధికారులు బుధవారం అక్కడికి వెళ్లారు. నదిలో సాగుతున్న ఇసుక అక్రమ రవాణాను ఆపేందుకు మున్సిపల్‌ కమిషనర్‌, డీఈలు ప్రయత్నించగా వారిపైనే ఇసుకాసురులు దౌర్జన్యానికి దిగారు. దీంతో వారు పోలీసులకు ఫోన్‌ చేసి కొన్ని ట్రాక్టర్లను మాత్రం సీజ్‌ చేయించారు. అక్కడున్న జేసీబీలను డ్రైవర్ల అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు.

పంప్‌హౌస్‌ వద్ద బోర్లు నాశనం

పలమనేరు పట్టణానికి కౌండిన్య నదిలోని పంప్‌హౌస్‌ నుంచి మంచినీటి సరఫరా సాగుతోంది. అక్కడ మున్సిపల్‌ అధికారులు ఏడు బోర్లను డ్రిల్‌ చేశారు. వీటిల్లో ఇటీవల ఇసుకను తోడేయడంతో రెండుబోర్లలో నీరు రావడంలేదు. దీనిపై స్పందించిన మున్సిపల్‌ కమిషనర్‌ రమణారెడ్డి, సిబ్బందితో కలసి అక్కడికెళ్లి పరిశీలించారు. ఆయన ముందే పదులసంఖ్యలో ట్రాక్టర్లు, జేసీబీలను చూసి అక్కడికెళ్లి ఇసుక తోడకూదంటూ అడ్డుకున్నారు. దీనిపై ఇసుకాసురులు సైతం తగ్గేదేలేదంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో ఆయన పోలీసులను పిలిపించేలోపు అక్కడున్న ట్రాక్టర్లు జేసీబీలు వెళ్లిపోగా రెండు ట్రాక్టర్లను మాత్రం పోలీసులు తూతూ మంత్రంగా సీజ్‌ చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ఆయన గంగవరం, పలమనేరు తహసీల్దార్లకు తెలుపుతామని పేర్కొన్నారు.

ఎలాంటి ఇబ్బందులు లేకుండా...

నదిలో ఇసుకను తోడుతున్నవారిని అడిగితే ఇంటి నిర్మాణానికని చెబుతున్నారు. ఇంకొందరు ట్రాక్టర్లకు పచ్చ పెయింట్‌, డ్రైవర్‌కు పచ్చ కండువా, జేబులో చంద్రబాబు ఫొటో పెట్టుకుని అధికారులనే బెదిరిస్తున్నారు. నియోజకవర్గంలోని కొంగోళ్లపల్లి, ముసలిమొడుగు, కూర్మాయి, మొరం, ముదరంపల్లి, బైరెడ్డిపల్లి, గుండుగల్లు, చిన్నూరు తదితర గ్రామాల్లో ఇసుక రవాణా చేసే వారే పదులసంఖ్యలో ఉన్నారు. ఈ గ్రామాల్లో పది నుంచి ఇరవై ట్రాక్టర్లు, గ్రామానికి రెండు, మూడు జేసీబీలున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

అధికారులనే అడ్డుకున్న ఇసుక స్మగర్లు

కౌండిన్యలో ఆగని అక్రమరవాణా

మున్సిపల్‌ పంప్‌హౌస్‌ వద్ద భారీగా తవ్వకాలు

అడ్డుకున్న అధికారులపై దౌర్జన్యం

పగటి డంప్‌లకు.. రాత్రి కర్ణాటకకు..

గతంలో ఇక్కడి నుంచి ఇసుకను అక్రమంగా కర్ణాటకలోని హొసకోటకు తరలించేవారు. ఇప్పుడలా కాదు కర్ణాటక నుంచే టిప్పర్లు డంపుల వద్దకే వస్తున్నాయి. ఓ ట్రాక్టర్‌ ఇసుకను చెప్పిన చోటుకు తెచ్చి దింపితే రూ.2 వేలుగా నిర్ణయించారు. ఓ టెన్‌వీలర్‌ టిప్పర్‌కు 6 ట్రాక్టర్‌ లోడ్లు. అంటే డంపు వద్దకు చేరితే టిప్పర్‌ విలువ రూ.12 వేలు. తోడిన ఇసుకను రహస్యప్రదేశాల్లో డంప్‌ల్లో దింపుకుంటున్నారు. ఆపై రాత్రుల్లో కర్ణాటక నుంచి టిప్పర్లు రాగానే ఇసుకను లోడింగ్‌ చేస్తున్నారు. దీంతో అక్కడి వ్యాపారులు స్పాట్‌లోనే టిప్పర్‌కు రూ.24 వేలు చెల్లిస్తున్నారు. అంటే టిప్పర్‌ ఇసుకను అమ్మితే రూ.12 వేల గిట్టుబాటు.

ఇసుమంతైనా భయం లేదు! 1
1/2

ఇసుమంతైనా భయం లేదు!

ఇసుమంతైనా భయం లేదు! 2
2/2

ఇసుమంతైనా భయం లేదు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement