చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని మండల ప్రత్యేకాధికారులు ఆకస్మిక తనిఖీలు చేయాలని కలెక్టర్ సు మిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో పలు శాఖల అధికారులతో వరుస సమీక్షలు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ మండల ప్రత్యేక అధికారులు తమ పరిధిలోని పీహెచ్‌సీ, అంగన్‌వాడీ కేంద్రాలు, వసతిగృహాలు, సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేయాలన్నారు. ప్రభుత్వ సేవలను పారదర్శకంగా ప్రజలకు అందే దిశగా అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తించాలన్నారు.
అభ్యసనా సామర్థ్యాలు పెంచాలి
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఐదో తరగతి విద్యార్థుల్లో అభ్యసనా సామర్థ్యాలను పెంచేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఈ విద్యా సంవత్సరం ఐదు నుంచి ఆరో తరగతికి వెళ్లే విద్యార్థులకు తెలుగు, గణితం, ఇంగ్లీషు, తదితర పాఠ్యాంశాలలో కనీస అభ్యసనా సామర్థ్యాలు ఉండేలా హెచ్‌ఎంలు, టీచర్లు కృషి చేయాలన్నారు.
ఎంపీ నిధుల పనులను త్వరితగతిన చేపట్టండి
ఎంపీ నిధులతో చేపడుతున్న పనులను త్వరతిగతిన నాణ్యతతో చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. పనుల్లో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పురోగతిలో ఉన్న పనులు వేగవంతంగా చేపట్టి బిల్లులను సకాలంలో అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. ఈ సమావేశాల్లో సీపీఓ సాంబశివారెడ్డి, డ్వామా పీడీ రవికుమార్, డీఆర్‌డీఏ పీడీ శ్రీదేవి, జెడ్పీ సీఈఓ రవికుమార్‌నాయుడు, సమగ్రశిక్ష ఏపీసీ వెంకటరమణ, తదితర అధికారులు పాల్గొన్నారు.