నీ శరణిదే జొచ్చితిని! | - | Sakshi
Sakshi News home page

నీ శరణిదే జొచ్చితిని!

Mar 11 2025 1:22 AM | Updated on Mar 11 2025 1:20 AM

సంగీత తపస్వి గరిమెళ్ల
● అన్నమయ్య సంకీర్తనలే జీవితం ● రాగాలద్ది.. వైవిధ్యభరితంగా జనబాహుళ్యంలోకి ● భిన్నస్వరాలతో బాణీలు ● ఆయన లేని లోటు తీర్చలేనిదంటున్న సంగీత ప్రియులు

తిరుపతి కల్చరల్‌: సంగీత తపస్వి గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్‌. ఆయన ఆధ్యాత్మికత సుపరిమళ గుబాళింపుగా ప్రాశస్తి చెందిన అన్నమయ్య సంకీర్తనలనే జీవితంగా మలుచుకున్నారు. తన స్వర కీర్తనలతో అలరారింపజేశారు. రాగాలనద్ది, వైవిధ్యభరితంగా బాణీలు కట్టారు. భిన్నమైన స్వర ప్రయోగాలతో సాహిత్య అభిమానులను సంగీత సాగరంలో ముంచెత్తారు.

తుది శ్వాస వరకు..

గరిమెళ్ల భార్య రాధ. ఆయన కుమారులు అనిల్‌కుమార్‌, పవన్‌ కుమార్‌. నిత్య సంగీతార్చనతో తన ఆధ్యాత్మిక భక్తి పారవశాన్ని చాటుకున్నారు. తుది శ్వాస వరకు సంగీతోపాన్యాసం చేస్తూ నాద యోగిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

వైవిధ్య బాణీలు

రాగమే ధ్యాసగా.. ఆధ్యాత్మిక సంగీతమే జీవితంగా పయనిస్తూ వెయ్యికి పైగా అన్నమాచార్య సంకీర్తనలను పండిత పామర జనరంజకంగా శాసీ్త్రయ లలిత, జానపద బాణీలలో స్వరపరిచారు. అన్నమయ్య కీర్తనల సాహిత్య పరిమళలాలను విస్తరింపజేశారు. బహుళ ప్రచారంలో మోహన, హంసధ్వని, శంకరాభరణం, తోడి, కల్యాణి, మాయామాళవగౌళ రాగాలను సరళమైన పద్ధతిలో స్వరపరిచారు. అన్నమాచార్య సంకీర్తనలను భావయుక్తంగా తన గళంలో పలికించేందుకు వీలుగా ఆయా సంకీర్తనలలోని సాహిత్యాన్ని కూలంకషంగా అధ్యయనం చేసి దానికి తగిన రాగాలను స్వరబాణీలను సమకూర్చారు. అంతేగాక రతిపతిప్రియ, వరం, నటహిందోళం, శివరంజని, పాడి, మిశ్రవకుళాభరణం వంటి రాగాల్లో ఆయన స్వర పరిచన సంకీర్తనలు అలరింపజేశాయి. సుందరంజని, సుమశ్రీసుకామవర్థని, సుమగంధి, సునాదనంది, సత్యప్రియ, సంజీవి, సింధుప్రియ, శ్యామకాంభోజి ,వాణీప్రియ, చిత్రకల్యాణి, నిషాది, ప్రసూన, కోమలి వంటి సుమారు 20 అపూర్వ రాగాలను సృష్టించి అందులో కీర్తనలను రచించి పుస్తకాలుగా, ఆడియో రూపంలో తీసుకువచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా సప్తగిరి సంకీర్తనల గోష్టిగానాన్ని ప్రచారం చేసిన ఘనత గరిమెళ్లకే దక్కింది.

స్వర మాధుర్యం..ప్రతిభ అపారం

సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి శిష్యరికంతో గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్‌ మరింత రాటుతేలారు. శాసీ్త్రయ, ఆధ్యాత్మిక గాయకుడుగా గరిమెళ్ల 1978లో అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుడుగా ప్రవేశించారు. అపార ప్రతిభతో టీటీడీ ఆస్థాన విద్యాంసుడుగా ఎదిగారు. టీటీడీ ఆస్థాన పండితుడుగా అన్నమయ్య కీర్తనలను స్వపరపరిచి ఆలపించారు. తిరుమల శ్రీవేంకటేశ్వరునికి సంకీర్తన నైవైద్యాన్ని సమర్పించారు. రాజమండ్రిలో 1946 నవంబర్‌ 9వ తేదీన కృష్ణవేణి, నరసింహరావు దంపతులకు జన్మించారు. ఆయన తండ్రి నరసింహరావు విద్యాంసుడు. ప్రముఖ సినీ గాయని జానకి స్వయాన పిన్నమ్మ కావడంతో చిన్నప్పటి నుంచి ఆయన సంగీతం పట్ల ఆసక్తితో అంచెలంచెలుగా ఎదిగారు. చివరి దశలో తిరుపతిలో స్థిరపడ్డారు.

కళా నీరాజనం

గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్‌కు పలువురు ప్రముఖులు, కళాకారులు సోమవారం నివాళి అర్పించారు. ఇందులో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కేంద్ర మాజీ మంత్రి డాక్టర్‌ చింతామోహన్‌, బ్రాహ్మణ సమాజం ప్రతినిధులు, రాయలసీమ రంగస్థలి కళాకారులు, టీటీడీ అన్నదానం డెప్యూటీ ఈవో రాజేంద్రకుమార్‌, డీపీపీ కార్యదర్శి, అన్నమయ్య వంశీయులు హరినారాయణదాస, ఎస్వీ సంగీత కళాశాల అధ్యాపకులు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ఉన్నారు.

విశేష పురస్కారాలు

గరిమెళ్ల చేసిన సంగీత యజ్ఞ ప్రతిభకు విశేష పురస్కారాలు వరించాయి. అన్నమాచార్య సంకీర్తన మహతి, హరికీర్తనాచార్యులతో పాటు ప్రభుత్వ, ప్రయివేటు ఆధ్యాతిక సంస్థల పురస్కార సత్కారాలు అందుకున్నారు. శ్రీపద్మావతి మహిళా వర్సిటీ నుంచి డాక్టరేట్‌ డిగ్రీ అందుకున్నారు. శ్రీపొట్టి శ్రీరాముల తెలుగు వర్సిటీ నుంచి విశిష్ట పుస్కారంతో పాటు రాష్ట్రపతి చేతుల మీదుగా కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం అందుకున్నారు.

నీ శరణిదే జొచ్చితిని!1
1/4

నీ శరణిదే జొచ్చితిని!

నీ శరణిదే జొచ్చితిని!2
2/4

నీ శరణిదే జొచ్చితిని!

నీ శరణిదే జొచ్చితిని!3
3/4

నీ శరణిదే జొచ్చితిని!

నీ శరణిదే జొచ్చితిని!4
4/4

నీ శరణిదే జొచ్చితిని!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement