చౌడేపల్లె: బోయకొండ గంగమ్మ దేవస్థానానికి వద్ద వివిధ రకాల వేలం పాటల లీజు ద్వారా రూ.2.96 కోట్ల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ ఏకాంబరం తెలిపారు. సోమవారం బోయకొండ ఆలయ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలో వేలం పాటలు జరిగాయి. ఈ వేలం పాటలకు రూ.5లక్షల ధరావత్తు చెల్లించిన 18 మంది పాటదారులు మాత్రమే పాల్గొన్నారు. బయట ప్రాంత వ్యక్తులు పాల్గొనకపోగా స్థానికులు మాత్రమే వేలం పాటలు, టెండర్లలో పాల్గొన్నారు. గతంలో వచ్చిన వేలం పాట ఆదాయంలో నామమాత్రపు ఆదాయాన్ని రెట్టింపు చేస్తూ ముందే నిర్ణయించిన మేరకు వేలం పాటలు ముగించేశారని ఆరోపణలు వచ్చాయి. కొండపైన కొబ్బరికాయలు, పూజాసామగ్రి విక్రయించుకునే హక్కు ద్వారా రూ.52.50లక్షలు శివకుమార్ సొంతం చేసుకున్నారు. కొండపై పూల హారాలు, నిమ్మకాయల హారాలు, వడిబాల సామగ్రి, చీరలు, జాకెట్ పీసులు విక్రయించుకునే హక్కు ద్వారా రూ.42 లక్షలు రాగా గణపతి దక్కించుకున్నారు. దేవస్థానం టోల్ గేటు నిర్వహణ హక్కును రూ.68.50 లక్షల హెచ్చుపాటతో రమణ కై వసం చేసుకున్నారు. పెద్దభోగం, చిన్న భోగం సేకరణ హక్కును రూ.86.15 లక్షలతో వెంకటేష్, భక్తులు సమర్పించే చీరలు, రవికలు, పావడా పీసులు సేకరణ హక్కును రూ.46.50లక్షలకు గంగులప్ప సొంతం చేసుకున్నారు. అలాగే భక్తులు సమర్పించు తలనీలాలు సేకరణ హక్కు, కొండపై క్లాక్ రూము నిర్వహణ హక్కులకు నిర్వహించిన వేలం పాటలు సరైన మద్దతురాని కారణంగా వాయిదా వేస్తున్నట్లు ఈఓ ప్రకటించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా సీఐ రాంభూపాల్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ నాగేశ్వరరావు బందోబస్తు నిర్వహించారు. సర్పంచ్ సోని, ఇన్‌స్పెక్టర్ శశిధర్ తదితరులు పాల్గొన్నారు.