
విస్తృత జీఎస్టీ 2.0 సంస్కరణల కింద సిగరెట్లు, పాన్ మసాలా, ఇతర హానికర వస్తువులను కొత్త 40% పన్ను శ్లాబులోకి జీఎస్టీ కౌన్సిల్ తీసుకొచ్చింది. ఈ క్రమంలో జీఎస్టీ 2.0 సంస్కరణల ప్రభావం మద్యంపైనా ఉంటుందా.. ఆల్కహాల్ రేట్లు పెరుగుతాయా? అన్న సందేహం చాలా మందిలో ఉంది.
అనేక హానికర వస్తువులను అధిక పన్ను శ్లాబులోకి తీసుకొచ్చినప్పటికీ మద్యం ధరలపై దీనికి ప్రభావం ఉండదు. ఎందుకంటే మద్యం జీఎస్టీ పరిధిలో లేదు. మద్యంపై పన్ను రాష్ట్రాల నియంత్రణలోనే ఉంటుంది. తాజా జీఎస్టీ మార్పుల ప్రకారం.. సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు, గుట్కా వంటి హానికర వస్తువుల కేటగిరీలోకి వచ్చే ఉత్పత్తులపై 40% పన్ను విధిస్తారు. ఇది గతంలో 28% ఉండేది. అంటే 12% పెరిగింది. ఈ ఉత్పత్తులను ప్రజలు వినియోగించకుండా నిరుత్సాహపరచడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
నష్టపరిహార సెస్ లేకుండా..
ప్రభుత్వ వార్తా సంస్థ పీఐబీ జారీ చేసిన ఎఫ్ఏక్యూల ప్రకారం.. ప్రత్యేక రేటు కొన్ని ఎంపిక చేసిన వస్తువులకు ప్రధానంగా హానికర వస్తువులు, కొన్ని లగ్జరీ వస్తువులపై మాత్రమే వర్తిస్తుంది. అందువల్ల ఇది ప్రత్యేక రేటు. వీటిలో చాలా వస్తువులపై ప్రస్తుతం జీఎస్టీతో పాటు నష్టపరిహార సెస్ కూడా విధిస్తున్నారు. కానీ ఇప్పుడు పరిహార సెస్ రేటును జీఎస్టీలో విలీనం చేస్తున్నారు.
నేరుగా జీఎస్టీ లేకున్నా..
ఆల్కహాల్ పానీయాలు నేరుగా జీఎస్టీ పరిధిలోకి రానప్పటికీ, దానికి సంబంధించిన అనేక కార్యకలాపాలకు జీఎస్టీ వర్తిస్తుంది. బాటిలింగ్, ప్యాకేజింగ్, రవాణా, లాజిస్టిక్స్, పరికరాల కొనుగోలు, నిర్వహణ, అలాగే ప్రకటనలు, మార్కెటింగ్ వంటి సేవలన్నిటికీ జీఎస్టీ వర్తిస్తుంది. అంటే ఇది ద్వంద్వ పన్ను నిర్మాణాన్ని సూచిస్తుంది. మద్యంపై రాష్ట్రాలు పన్నులు విధిస్తాయి. కానీ దాని చుట్టూ ఉన్న వ్యాల్యూ చెయిన్‌లో చాలా భాగం జీఎస్టీ పరిధిలోకి వస్తుంది.
జీఎస్టీ 2.0 సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానుండటంతో వినియోగదారులు సిగరెట్లు, సోడాలు, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలపై విపరీతమైన ధరలను ఎదుర్కోనున్నారు. తాగడానికి వినియోగించే ప్యాకేజ్ చేసిన ఆల్కహాల్ మాత్రమే జీఎస్టీ పరిధిలోకి రాదు. అదే పారిశ్రామిక అవసరాల కోసం ఉపయోగించే ఆల్కహాల్ మాత్రం కొత్త జీఎస్టీ విధానం కిందకు వస్తుంది.
ఇదీ చదవండి: కొత్త జీఎస్టీతో పాప్‌కార్న్ వివాదానికి ఫుల్‌స్టాప్