
కొత్త జీఎస్టీ రేట్లతో ఎప్పటి నుంచో ఉన్న పాప్‌కార్న్ వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. సాల్టెడ్ పాప్ కార్న్, కారామెల్ పాప్ కార్న్‌పై పన్ను విధించడానికి సంబంధించిన వివాదానికి జీఎస్టీ కౌన్సిల్ ఎట్టకేలకు ముగింపు పలికింది.
జీఎస్టీ 2.0 కింద, ఉప్పు, మసాలాలు కలిపిన పాప్‌కార్న్‌పై 5% జీఎస్టీ వర్తిస్తుంది. అది విడిగా విక్రయించినా లేదా ప్రీప్యాక్ చేసి లేబుల్ చేసినా సరే ఒకే రకమైన పన్ను విధిస్తారు. ప్రభుత్వం విడుదల చేసిన కొత్త జీఎస్టీ రేట్లతో కూడిన వస్తువుల జాబితా ప్రకారం.. కారామెల్ పాప్‌కార్న్ నాన్ ఎషన్షియల్ కేటగిరిలోని చక్కెర మిఠాయి వస్తువుల పరిధిలోకి వస్తుంది కాబట్టి 18% పన్ను వర్తిస్తుంది.
గతంలో, సాల్టెడ్ పాప్‌కార్న్‌ను వదులుగా అమ్మితే 5%, బ్రాండెడ్ ప్యాకేజింగ్‌లో అమ్మితే 12% పన్ను విధించేవారు. అదే కారామెల్ పాప్‌కార్న్ ప్యాకేజింగ్‌తో సంబంధం లేకుండా 18% జీఎస్టీ విధించేవారు.
చాన్నాళ్ల వివాదం
దేశంలో జీఎస్టీని మొదటిసారి ప్రవేశపెట్టినప్పుడు, ప్రాసెస్ చేసిన ఆహార వస్తువుగా పాప్‌కార్న్‌పై దాన్ని ఏ రూపంలో అమ్ముతారు అనేదాన్ని బట్టీ వేర్వేరు పన్ను స్లాబ్‌ల కింద జీఎస్టీ విధిస్తూ వచ్చారు. బ్రాండెడ్, ప్యాక్ చేసిన పాప్ కార్న్‌పై 12% జీఎస్టీ విధించగా, విడిగా విక్రయించే పాప్ కార్న్‌ను మాత్రం పూర్తిగా మినహాయించారు.
ఆ ద్వంద్వ నిర్మాణం చిన్న విక్రేతలకు, మల్టీప్లెక్స్‌లకు గందరగోళంగా ఉండేది. 2018లో, అధిక ధరలకు పాప్‌కార్న్‌ను విక్రయించిన మల్టీప్లెక్స్‌లు, సినిమా హాళ్లలో విక్రయించే చిరుతిండిని ప్యాక్ చేసిన వస్తువుగా (12% జీఎస్టీ) కాకుండా రెస్టారెంట్ సేవగా (5% జీఎస్టీ) పరిగణించాలని వాదించాయి. ఆ తర్వాత, జీఎస్టీ కౌన్సిల్ పాప్‌కార్న్‌ను స్నాక్స్‌గా నిర్వచించింది. సినిమా లేదా రెస్టారెంట్ తరహా కౌంటర్‌లో విక్రయించే పాప్‌కార్న్‌కు 5%, బ్రాండెడ్ పాప్‌కార్న్‌పై 12% పన్ను వర్తిస్తుందని తేల్చింది.
తర్వాత ఈ వర్గీకరణపైనా కోర్టులలో సవాళ్లు దాఖలయ్యాయి. 2022లో, మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పాప్‌కార్న్ "తాజాగా తయారు చేసేదని", ఎఫ్‌ఎంసీజీతో పోల్చదగినది కాదని పేర్కొంటూ, ఏకరీతి పన్ను కోసం లాబీయింగ్ చేసింది. 2023లో జీఎస్టీ కౌన్సిల్ మొదటిసారిగా హేతుబద్ధీకరణపై చర్చను ప్రారంభించినప్పుడు "పాప్‌కార్న్‌పై జీఎస్టీ" వివాదం మరోసారి బయటకువచ్చింది. 2024లో మల్టీప్లెక్స్‌లో స్నాక్స్ భారీ ధరకు విక్రయిస్తున్నట్లు వచ్చిన వార్తలతో సినిమా పాప్‌కార్న్ విలాసవంతమైన ఆహారమా లేదా ప్రాథమిక చిరుతిండా అనే చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది.
ఇదీ చదవండి: బిగ్ దివాలీ గిఫ్ట్.. మరిన్ని ప్లీజ్.. జీఎస్టీ బొనాంజాపై తలో మాట