సోషల్ మీడియా స్టార్, అన్‌స్టాపబుల్‌ టైకూన్‌ దిపాలీ: రతన్‌టాటా కంటే ఖరీదైన ఇల్లు

Who is Dipali Goenka the Unstoppable Tycoon social media star - Sakshi

వెల్స్పన్ ఇండియా సీఈవో సోషల్ మీడియా స్టార్ దిపాలి గోయెంకా ఎన్డీటీవీ స్వత్రంత్ర డైరెక్టర్‌గా నియమితులయ్యారు. సెబీ మాజీ ఛైర్మన్ యూకే సిన్హాతో పాటు మార్చి 27, 2023 నుండి రెండు సంవత్సరాల పాటు ఆ పదవిలో కొనసాగుతారు. నాన్-ఎగ్జిక్యూటివ్, స్వతంత్ర మహిళా డైరెక్టర్‌గా దిపాలి ఎంపిక కావడం విశేషంగా నిలిచింది. దీంతో ఫోర్బ్స్ ఆసియా అండ్‌ ఇండియాలో అత్యంత శక్తివంతమైన మహిళల్లో ఒకరిగా  గుర్తింపు పొందిన దిపాలి గోయెంకా ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. 


ఎవరీ దిపాలి గోయెంకా ?
ప్రపంచంలోని అతిపెద్ద గృహ వస్త్ర కంపెనీలలో ఒకటైన వెల్స్పన్ ఇండియా లిమిటెడ్  సీఎండీ టెక్స్‌టైల్ మాగ్నెట్ దిపాలి గోయెంకా సైకాలజీలో గ్రాడ్యుయేట్, హార్వర్డ్ పూర్వ విద్యార్థి. దిపాలి గోయెంకా భర్త బీకే గోయెంకా వెల్స్పన్ గ్రూప్ చైర్మన్. 18 సంవత్సరాల వయస్సులో  బీకే గోయెంకాను వివాహం చేసుకున్నారు దిపాలి.  బీకే గోయెంకా ఇటీవల ముంబైలో రూ.240 కోట్లతో ఒక లగ్జరీ ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు. రతన్ టాటా ఇంటి విలువ రూ.150 కోట్లు కావడంతో ఆ ఇంటి విలువ రతన్ టాటా ఇంటి కంటే ఖరీదైన ఇల్లుగా నిలిచింది.

రూ.19 వేల  కోట్ల  కంపెనీకి సీఎండీగా 
రూ. 19000 కోట్ల కంపెనీకి సారధి, అన్‌స్టాపబుల్‌ టైకూన్‌  దిపాలి గోయెంకా సోషల్ మీడియా స్టార్ కూడా. ఆమె ట్విటర్‌,  ఇన్‌స్టాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 191కే  ఫాలోవర్లు  ఉన్నారంటే ఆమె స్టార్‌ రేంజ్‌ను అర్థం చేసుకోవచ్చు. వెల్స్పన్ గ్రూప్‌లో 25వేల  ఉద్యోగులతో 2.3 బిలియన్ల  డాలర్ల ఆదాయంతో టాప్‌ టెక్స్‌టైల్‌ కంపెనీగా దూసుకుపోతోంది. 

ఇన్నోవేషన్, బ్రాండ్స్ అండ్‌ సస్టైనబిలిటీపై దృష్టి సారించి వెల్స్పన్ హోమ్ టెక్స్‌టైల్ వ్యాపారాన్ని బిలియన్ డాలర్లతో ప్రపంచస్థాయికి చేర్చడంలో ఆమెది కీలక పాత్ర. అసోచామ్ ఉమెన్స్ కౌన్సిల్ చైర్‌పర్సన్‌గా పనిచేసిన దిపాలీ ప్రస్తుతం వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో  ఉన్నారు.

 చిన్నతనంలోనే పెళ్లి 
సాంప్రదాయ మార్వాడీ నేపథ్యం నుండి  వచ్చిన  తనకు సాధారణంగానే  చిన్న వయస్సులో పెళ్లి అయిందని, అయినా మరింత నేర్చుకోవాలనే పట్టుదలతో దేన్నీ ఆపలేదని చెప్పారు. తన కుమార్తెలకు 10, 7 ఏళ్లు నిండిన తర్వాత తిరిగి కరియర్‌ మీద దృష్టిపెట్టినట్టు స్వయంగా దిపాలి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. డిజైన్ స్టూడియోతో ప్రారంభించి, 2003లో, దిపాలి గోయెంకా స్పేసెస్, ప్రీమియం బెడ్ అండ్‌ బాత్ బ్రాండ్‌ను ప్రారంభించారు. తనకెదురైన ప్రతీ చాలెంజ్‌ను  ఒక అవకాశంగా తీసుకొని ఎదిగారు.

 సీఈవో విత్‌ సోల్‌
2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం కారణంగా ఆమె వస్త్ర వ్యాపారంలోకి అడుగుపెట్టారు. 2016, ఆగస్టు ఒక పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంది. కంపెనీ సరఫరా చేసిన ప్రీమియం ఈజిప్షియన్ కాటన్ షీట్‌లు చౌకగా ఉన్నాయనే ఆరోపణలతో అమెరికన్ రిటైలర్ టార్గెట్ వెల్‌స్పన్ ఇండియాతో అన్ని డీల్స్‌ను ముగించింది. అపుడు వ్యాపారాన్ని తిరిగి గాడిలో పెట్టేలా సాహసంగా ముందుకు సాగారు. ప్రస్తుతం వెల్స్పన్ ఇండియా అమెరికాకు బెడ్ అండ్‌ బాత్, రగ్గు ఉత్పత్తుల అతిపెద్ద సరఫరాదారు. కస్టమర్-ఫస్ట్ అప్రోచ్ సూత్రాన్ని ఫాలో అయ్యే దిపాలి కూడా దాతృత్వంలో కూడా ముందే ఉన్నారు. అందుకే తన ప్రొఫైల్ బయోలో సీఈవో విత్‌ సోల్‌  రాసుకున్నారామె.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top