
ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ (ఐటీఆర్) దాఖలు చేయడానికి గడువు సమీపించింది. ట్యాక్స్ పేయర్స్ 2025 సెప్టెంబర్ 15 లోపల ఐటీఆర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ గడువును ఇప్పటికే 2025 జులై 31 నుంచి పొడిగించారు. ఇప్పుడు మళ్లీ పొడిగిస్తారా?, లేదా? అనేదానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటి వరకు వెలువడలేదు. గడువు తీరిన తరువాత కూడా ఐటీఆర్ ఫైల్ చేసుకోవచ్చు. కానీ ఫైన్ కట్టాల్సి ఉంటుంది.
గడువు తీరని తరువాత.. డిసెంబర్ 31, 2025 వరకు రూ. 5000 వరకు ఆలస్య రుసుము లేదా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. నికర ఆదాయం రూ. 5 లక్షల కంటే తక్కువ ఉన్నవారికి జరిమానా గరిష్టంగా రూ. 1000 ఉంటుంది.
ఇక్కడ ఫైన్ ఒక్కటే సమస్య కాదు. కొన్నిసార్లు చట్టపరమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందులో ప్రాసిక్యూషన్ కూడా ఉండవచ్చు. గత సంవత్సరం.. ఢిల్లీలోని ఒక మహిళ తన ఐటీఆర్ దాఖలు చేయనందుకు ఆమెకు జైలు శిక్ష విధించారు. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలంటే.. గడువు లోపలే ఐటీఆర్ ఫైల్ చేసుకోవడం ఉత్తమం.
ఐటీఆర్ దాఖలు చేయడంలో ఆలస్యం & ఎదుర్కోవాల్సిన ఇబ్బందులు
➤ఐటీఆర్ ఫైల్ ఆలస్యమైతే జరిమానాలు చెల్లించడం మాత్రమే కాకుండా.. 234ఏ, 234బీ, 234సీ సెకన్ల కింద పన్ను బకాయి రకాన్ని బట్టి వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. మీ ఆదాయం పన్ను పరిధిలోకి రాకుంటే.. ఫైన్ కట్టాల్సిన అవసరం లేదు.
➤ఐటీఆర్ ఫైలింగ్‌లో ఆలస్యం కారణంగా.. ప్రాసెసింగ్ ఆలస్యం కావొచ్చు. దీంతోపాటు రీఫండ్ కూడా ఆలస్యంగా వస్తుంది.
➤ఆలస్యంగా ఐటీఆర్ ఫైల్ చేయడం వల్ల.. మీ రిటర్న్స్‌ను ఇన్‌కమ్ ట్యాక్ డిపార్ట్మెంట్ మరింత క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం కూడా ఉంది.
➤ఆలస్యంగా అయినా ఐటీఆర్ ఫైల్ చేయడం మిస్సయితే.. ఐటీ శాఖ నేరుగా నోటీసులు పంపించే అవకాశం కూడా ఉంది. అప్పుడు ఐటీఆర్ దాఖలు చేయడకపోవడానికి కారణాన్ని గురించి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.