ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన టెక్ దిగ్గజాల్లో ఒకరైన గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. సుమారు రూ.12,600 కోట్ల (సుమారు 1.5 బిలియన్ డాలర్లు) సంపదకు అధిపతి అయినప్పటికీ ఆయన అనుసరించే సరళమైన జీవనశైలి, క్రమశిక్షణ ఎంతోమందిని ఆశ్చర్యపరుస్తాయి. అత్యున్నత స్థాయి పదవిలో ఉన్న వ్యక్తులు తమ రోజును ఎలా ప్లాన్ చేసుకుంటారు? వారి ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయి? అనే అంశాలు ఎప్పుడూ ఆసక్తికరమే. ఆ కోణంలో సుందర్ పిచాయ్ దినచర్య ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
ఉదయాన్నే స్పష్టమైన ఆలోచనలు
చాలామంది మేల్కోగానే స్మార్ట్‌ఫోన్‌ల్లో నోటిఫికేషన్లను తనిఖీ చేస్తూ ఒత్తిడిని పెంచుకుంటారు. కానీ, పిచాయ్ శైలే వేరు. ఆయన రోజూ ఉదయం 6:30 గంటల నుంచి 7:00 గంటల మధ్య నిద్రలేస్తారు. ఉదయాన్నే హడావుడి లేకుండా ఉండడం ఆయనకు ఇష్టం. మేల్కొన్న వెంటనే ఆయన చేసే మొదటి పని వార్తాపత్రికలు చదవడం. ప్రపంచంలో ఏమి జరుగుతుందో తెలుసుకోవడం ద్వారా తన మేధస్సును పదును పెడుతుంటారు. ఈ అలవాటే ఆయనకు సమాచార విశ్లేషణలో, కీలక నిర్ణయాలు తీసుకోవడంలో ఎంతో సహాయపడుతుందని ఆయన స్వయంగా వెల్లడించారు.
పోషకాహారం
సుందర్ శాఖాహారానికి ప్రాధాన్యత ఇస్తారు. అయినప్పటికీ, తన రోజువారీ అల్పాహారంలో ప్రోటీన్ ఉండేలా జాగ్రత్త పడతారు. ఉదయం పూట తీసుకునే ప్రోటీన్ మెదడుకు, శరీరానికి రోజంతా కావాల్సిన శక్తిని ఇస్తుందని ఆయన నమ్ముతారు. ఆయన ఉదయం అల్పాహారంలో సాధారణంగా ఒక కప్పు టీ, ఆమ్లెట్, టోస్ట్ ఉంటాయి. ఇందులో ఆమ్లెట్ ప్రోటీన్ కోసం, టోస్ట్ కార్బోహైడ్రేట్ల కోసం దోహదపడతాయి. ఇది చాలా సాధారణంగా అనిపించినా పోషక విలువల పరంగా ఇది ఒక పరిపూర్ణమైన బ్రేక్‌ఫాస్ట్. భారతీయ మూలాలున్న పిచాయ్‌కు టీ అంటే ప్రత్యేకమైన ఇష్టం. ఉదయాన్నే వేడివేడి టీ తాగడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండి కొత్త ఉత్సాహంతో డే ప్రారంభించడానికి వీలవుతుందని ఆయన అభిప్రాయపడతారు.
విజయానికి అసలైన సూత్రం
సుందర్ పిచాయ్ జీవితం మనకు ఇచ్చే అతిపెద్ద సందేశం ఏమిటంటే.. విజయం అంటే సంక్లిష్టమైన పద్ధతులు పాటించడం కాదు, ఉన్న చిన్న అలవాట్లను క్రమశిక్షణతో ఆచరించడం.
ఉదయాన్నే ప్రశాంతంగా రోజును ప్రారంభించడం.
వార్తాపత్రికలు చదువుతూ లోకజ్ఞానాన్ని పెంచుకోవడం.
సరళమైన, పోషక విలువలున్న ఆహారం తీసుకోవడం.
రూ.12,600 కోట్ల ఆస్తులున్న ఒక వ్యక్తి తన దినచర్య పరంగా ఎంతో సాధారణంగా కనిపిస్తూనే ఆ క్రమశిక్షణను ఎలా కాపాడుకుంటున్నారో తెలుసుకోవడం యువతకు ఒక పాఠం. భవిష్యత్తుపై స్పష్టత, సమకాలీన అంశాలపై పట్టు ఉంటే ఎవరైనా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని సుందర్ పిచాయ్ జీవనశైలి నిరూపిస్తోంది.
ఇదీ చదవండి: కోర్టు గదిలో వాదోపవాదాలు పీక్స్!


