
నా వద్దనున్న పెట్టుబడుల్లో 60% బ్యాంకు ఎఫ్‌డీలలో ఇన్వెస్ట్ చేశాను. మిగిలిన 40% ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టాను. ఇప్పుడు ఈక్విటీ పెట్టుబడుల విలువ బాగా పెరిగింది. ఇలాంటి సందర్భాల్లో నేను ఏం చేయాలి? – మనోజ్ సిన్హా
మీరు ఈక్విటీకి 60 శాతం, డెట్‌కు 40 శాతం కేటాయింపులతో అస్సెట్ అలోకేషన్ విధానాన్ని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు మీ మొత్తం పెట్టుబడుల్లో ఈక్విటీ వాటా 80%కి చేరి డెట్ పెట్టుబడులు 20%గా ఉన్నాయని అనుకుంటే.. పోర్ట్‌ఫోలియో పరంగా రిస్క్ పెరిగినట్టు అవుతుంది. ఎందుకంటే ఎక్కువ పెట్టుబడులు ఈక్విటీల్లో ఉండడంతో మార్కెట్ల ఆటుపోట్ల ప్రభావం పెట్టుబడుల విలువపై అధికంగా పడుతుంది. దీంతో మానసిక ప్రశాంతత కోల్పోవచ్చు.
రిస్క్ ఎక్కువగా తీసుకోకూడదన్నది మీ అభిప్రాయం అయితే.. ఈక్విటీ పెట్టుబడులను తిరిగి 60%కి తగ్గించుకుని, డెట్ పెట్టుబడులను 40%కి పెంచుకోవాలి. దీన్నే అస్సెట్ రీఅలోకేషన్‌తో లేదా అస్సెట్ రీబ్యాలన్స్‌గా చెప్పుకోవచ్చు. అస్సెట్ రీబ్యాలన్సింగ్‌తో ఉన్న మరో ప్రయోజనం.. అధిక స్థాయిల్లో విక్రయించి, తక్కువలో కొనుగోలు చేయడం సాధ్యపడుతుంది. అంటే విలువ గణనీయంగా పెరిగిన చోట విక్రయించి.. అదే సమయంలో పెద్దగా పెరగని చోట కొనుగోలు చేస్తాం.
ఉదాహరణకు పెట్టుబడుల్లో ఈక్విటీల వాటా పెరిగితే.. ఈక్విటీలు బాగా ర్యాలీ చేశాయని అర్థం. దాంతో అస్సెట్ రీబ్యాలన్స్‌లో భాగంగా అధిక వ్యాల్యూషన్ల వద్ద పెట్టుబడులు కొంత వెనక్కి తీసుకుని డెట్‌కు మళ్లిస్తాం. తరచూ కాకుండా.. ఏడాదికి ఒకసారి పెట్టుబడులను సమీక్షించుకుని అస్సెట్ రీబ్యాలన్స్ చేసుకోవచ్చు. లేదా ఏదైనా ఒక సాధనంలో (ఈక్విటీ లేదా డెట్) పెట్టుబడుల విలువ మీరు నిర్ణయించుకున్న పరిమితికి మించి 5 శాతానికి పైగా పెరిగిపోయిన సందర్భాల్లోనూ రీబ్యాలన్స్ చేసుకోవాలి.
మ్యూచువల్ ఫండ్స్ న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్‌ఎఫ్‌వో) ప్రకటనలు తరచూ కనిపిస్తున్నాయి. వీటిల్లో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచి నిర్ణయమేనా? లేక ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఫండ్స్‌లో మంచి ట్రాక్ రికార్డు ఉన్నవి ఎంపిక చేసుకోవాలా? – జైరూప్
కొత్త పథకాల పట్ల, మరీ ముఖ్యంగా పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టినప్పుడు ఆసక్తి ఏర్పడడం సహజమే. పెట్టుబడుల ప్రపంచంలో కొత్త అంటే అది మెరుగైనదని కాదు. చాలా వరకు ఎన్‌ఎఫ్‌వోలు ఇన్వెస్టర్ల కోసం కొత్తగా తీసుకొచ్చేదేమీ ఉండదు. ఇప్పటికే గొప్పగా నిర్వహిస్తున్న మ్యూచువల్ ఫండ్స్ వ్యూహాలను పోలినవే ఎక్కువ సందర్భాల్లో ఎన్‌ఎఫ్‌వోలుగా వస్తుంటాయి. ఇప్పటికే ఉన్న పథకాల మాదిరి కాకుండా.. ఎన్‌ఎఫ్‌వోలకు గత పనితీరు చరిత్ర ఉండదు.
సదరు ఎన్‌ఎఫ్‌వో ఫండ్ మేనేజర్ మార్కెట్ సైకిల్స్, రిస్క్‌ను సమర్థవంతంగా ఎలా ఎదుర్కొంటారన్నది తెలియదు. కొత్త ఫండ్ అని ఎంపిక చేసుకోవడం అంటే.. మంచి ట్రాక్ రికార్డు ఉన్న క్రికెటర్లను కాదని, అప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడని క్రికెటర్‌ను జట్టులోకి తీసుకోవడం వంటిదే. కొత్త ఆస్సెట్ క్లాస్ లేదా పెట్టుబడుల విధానాన్ని ఆఫర్ చేయకుండా, అప్పటికే ఉన్న పథకాల పెట్టుబడుల వ్యూహాలకు నకలుగా వచ్చే ఫండ్‌ను ఎంపిక చేసుకోవడానికి ఎలాంటి కారణం కనిపించడం లేదు.
సమాధానాలు: ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్