
ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో లార్జ్‌క్యాప్, లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ విభాగం మధ్య ఏ ఫండ్స్ మెరుగైనవి?
– వీణారాణి
దీర్ఘకాలంలో ఏ విభాగం మంచి పనితీరు చూపిస్తుందన్నది ఊహించడమే అవుతుంది. ఈక్విటీల్లో పెట్టుబడులు పెడుతున్నప్పుడు కాల వ్యవధి కనీసం ఐదేళ్లకు తగ్గకుండా ఉండాలి. ఇన్వెస్ట్ చేసిన ఆ ఐదేళ్ల కాలంలోనూ మార్కెట్ సైకిల్ ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో లార్జ్‌క్యాప్ కంపెనీలు మంచి పనితీరు చూపిస్తాయి. కొన్ని సందర్భాల్లో మిడ్‌క్యాప్ మంచి ప్రదర్శన చేస్తాయి.
కొన్ని సందర్భాల్లో స్మాల్‌క్యాప్ ఇంకా మంచి రాబడులను ఇస్తుంటాయి. కనుక ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడం సానుకూలం. ఫ్లెక్సీక్యాప్ ఫండ్ ఏ విబాగంలో అయినా ఇన్వెస్ట్ చేసే స్వేచ్ఛతో ఉంటుంది. మార్కెట్లో ఒక విభాగం మంచి పనితీరు, మరో విభాగం బలహీన పనితీరు చూపిస్తున్న సందర్భాల్లో ఫ్లెక్సీక్యాప్ పథకంలో పెట్టుబడుల ద్వారా దీన్ని చక్కగా అధిగమించగలరు.
నేను అధిక పన్ను శ్లాబులోకి వస్తాను. ఎఫ్‌డీలపై ఆదాయం సైతం పన్ను పరిధిలోకి వస్తుంది. అత్యవసర నిధిని డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా..?
– జగన్నాథ స్వామి
మీ అత్యవసర నిధిలో కొంత భాగాన్ని డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచి నిర్ణయమే అవుతుంది. అత్యవసర నిధిని మూడు భాగాలుగా వర్గీకరించుకుని ఇన్వెస్ట్ చేసుకోవాలి. మొదటి భాగం అత్యవసర నిధిని నగదు రూపంలోనే ఉంచుకోవాలి. రెండో భాగాన్ని బ్యాంకు ఖాతా లేదంటే ఫిక్స్‌డ్ డిపాజిట్ రూపంలో పెట్టుకోవచ్చు. లేదా వెంటనే నగదుగా మార్చుకోగలిగిన మరొక సాధనంలో అయినా ఇన్వెస్ట్ చేసుకోవాలి. మూడో భాగాన్ని లిక్విడ్ ఫండ్ లేదా అల్ట్రా షార్ట్ డ్యురేషన్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి.
దీనివల్ల రాబడులు సానుకూలంగా ఉంటాయి. పన్ను పరంగా ప్రత్యేక అనుకూలతలు ఏవీ లేవు. ఫిక్స్‌డ్ డిపాజిట్ల మాదిరిగా కాకుండా.. డెట్ ఫండ్స్‌లో పెట్టుబడులను వెనక్కి తీసుకున్నప్పుడే రాబడులపై పన్ను వర్తిస్తుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్ అయితే ప్రతీ ఆర్థిక సంవత్సరంలోనూ వడ్డీ ఆదాయాన్ని పన్ను చెల్లింపుదా రు తన వార్షిక ఆదాయానికి కలిపి చూపించాల్సి ఉంటుంది. వారి శ్లాబు రేటు ప్రకారం పన్ను చెల్లించాలి. అధిక పన్ను శ్లాబు పరిధిలోకి వచ్చే వారికి ఫిక్స్‌డ్ డిపాజిట్ రూపంలో వచ్చే ఆదాయంపై 30 శాతం పన్ను పడుతుంది.
డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లోనూ 2023 ఏప్రిల్ 1 తర్వాత చేసిన పెట్టుబడులను విక్రయిస్తే.. ఎంతకాలం అన్నదానితో సంబంధం లేకుండా లాభం మొత్తం వార్షిక ఆదాయానికి కలుస్తుంది. కనుక ఈ ఆదాయంపైనా మీరు గరిష్ట పన్ను చెల్లించాల్సి వస్తుంది. అయితే, ఎఫ్‌డీలతో పోలిస్తే డెట్ ఫండ్స్ కాస్త మెరుగైన రాబడులిస్తాయి. కానీ, డెట్ ఫండ్స్‌లో రాబడులకు హామీ ఉండదు. ఫిక్స్‌డ్ డిపాజిట్స్ మాదిరి ఒక్కో ఇన్వెస్టర్‌కు గరిష్టంగా రూ.5 లక్షల పెట్టుబడికి బీమా రక్షణ హామీ కూడా ఉండదు. లిక్విడ్ ఫండ్స్, అల్ట్రా షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ తక్కువ రిస్క్ విభాగంలోకి వస్తాయి.
సమాధానాలు: ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్