ఆయిల్‌ కంపెనీలకు ‘పశ్చిమాసియా’ కష్టాలు.. | West Asia Tensions Push Crude Prices Sky High India OMCs Bleed Losses | Sakshi
Sakshi News home page

ఆయిల్‌ కంపెనీలకు ‘పశ్చిమాసియా’ కష్టాలు..

Apr 30 2026 8:27 AM | Updated on Apr 30 2026 8:27 AM

West Asia Tensions Push Crude Prices Sky High India OMCs Bleed Losses

ఎల్‌పీజీపై వార్షికంగా రూ.80 వేల కోట్ల అండర్‌ రికవరీ

రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా అంచనాలు 

పశ్చిమాసియా ఉద్రిక్తతలతో అంతర్జాతీయంగా క్రూడ్‌ ధరలు భారీగా పెరిగినప్పటికీ దేశీయంగా రిటైల్‌ రేట్లను పెంచకపోవడం వల్ల ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు (ఓఎంసీ) నష్టపోతున్నాయి. పెట్రోల్‌పై లీటరుకు రూ. 14, డీజిల్‌పై రూ. 18 మేర నష్టం వాటిల్లుతోంది. ఇదే ధోరణి కొనసాగితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వంట గ్యాస్‌ ఎల్‌పీజీపై ఆయిల్‌ కంపెనీలు రూ. 80,000 కోట్ల ఆదాయాన్ని కోల్పోనున్నాయి. బడ్జెట్‌లో ఎరువులపై సబ్సిడీకి రూ. 1.71 లక్షల కోట్లు కేటాయించినప్పటికీ.. భారం దానికన్నా అధికంగా రూ. 2.05 – 2.25 లక్షల కోట్లకు ఎగియనుంది.  రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా ఈ మేరకు ఓ నివేదికలో అంచనాలు వెలువరించింది.

హార్మూజ్‌ జలసంధి మార్గం గుండా ఇంధన సరఫరా దెబ్బతినడంతో ఇంధనాలు, ఎరువులు, రసాయనాల కొరత ఏర్పడి, ధరలు పెరిగిపోతున్నాయని వివరించింది. రెణ్నెల్ల క్రితం పశి్చమాసియా సంక్షోభం ప్రారంభమైనప్పుడు బ్యారెల్‌కి 70–72 డాలర్లుగా ఉన్న క్రూడ్‌ ధరలు ఆ తర్వాత 120–125 డాలర్లకు ఎగిసినట్లు ఇక్రా పేర్కొంది. అయినప్పటికీ దేశీయంగా బంకుల్లో రేట్లు పెంచకపోవడం వల్ల ఓఎంసీల లాభదాయకతపై ప్రభావం పడుతోందని ఇక్రా సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ప్రశాంత్‌ వశిష్ట తెలిపారు.

మరిన్ని ముఖ్య వివరాలు..

  • భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు నెమ్మదించి, గ్లోబల్‌ సరఫరా వ్యవస్థలు సాధారణ స్థితికి వస్తే తప్ప సమీప భవిష్యత్తులో ఓఎంసీల మార్జిన్లు, రుణ పరపతిపై ఒత్తిడి కొనసాగవచ్చు.  

  • ముడి వస్తువుల ధరలు గణనీయంగా పెరిగి, సబ్సిడీ ఆ స్థాయిలో పెరగకపోవడం వల్ల యూరియా సంస్థల లాభదాయకత నెమ్మదించవచ్చు. వాతావరణ రిసు్కలను ఎదుర్కొనాల్సి రావడం వల్ల,  పెరిగే ధరలను భరించే సామర్థ్యం రైతుల్లో తగ్గొచ్చు.

  • వాణిజ్యానికి ఆటంకాలు, అధిక ఇంధన ధరలతో రసాయనాలు, పాలిమర్స్‌ ధరలు పెరిగాయి. దీంతో తయారీ సంస్థలు, వినియోగదారులు భారీగా నిల్వ చేసుకుంటున్నారు. అయితే, నిర్దిష్ట సెగ్మెంట్లలో అంతర్జాతీయంగా సరఫరా గణనీయంగా పెరిగితే, నిల్వ చేసుకునే ధోరణి తగ్గి, డిమాండ్‌ నెమ్మదిగా సాధారణ స్థాయికి రావొచ్చు.

  • గ్యాస్‌ రేట్ల పెరుగుదల, కరెన్సీ క్షీణతతో సిటీ గ్యాస్‌ డి్రస్టిబ్యూషన్‌ సంస్థల మార్జిన్లపై ఒత్తిడి పెరగొచ్చు. కేటాయింపుల్లో ప్రాధాన్యత ఉండటంతో గృహాలకు సరఫరా చేసే పైప్డ్‌ నేచురల్‌ గ్యాస్‌ (పీఎన్‌జీ) విభాగం లాభదాయకత స్థిరంగానే ఉన్నా, ధరల పెంపు పాక్షికంగానే బదలాయించడం వల్ల కంప్రెస్డ్‌ నేచురల్‌ గ్యాస్‌ (సీఎన్‌జీ) మార్జిన్లు మాత్రం నెమ్మదించవచ్చు.  

  • ఇంధనాలు, ముడివస్తువుల ధరలు పెరగడం వల్ల పలు రంగాల్లోని సంస్థల మార్జిన్లపై ప్రభావం పడనుంది. దీంతో కొన్ని సంస్థల రుణ పరపతి కూడా దెబ్బతినొచ్చు.

ఇదీ చదవండి: ఆంత్రోపిక్ బంపర్‌ ఆఫర్‌

Advertisement
 
Advertisement
Advertisement