పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ భయాలు భారత వ్యవసాయ రంగాన్ని కలవరపెడుతున్నాయి. ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయంగా ఎరువుల సరఫరా గొలుసు దెబ్బతినే ప్రమాదం పొంచి ఉండటంతో భారత్ అప్రమత్తమైంది. రాబోయే ఖరీఫ్ సీజన్‌లో ఎరువుల కొరత లేకుండా చూసేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద యూరియా దిగుమతిదారు అయిన భారతదేశం సుమారు 2.5 మిలియన్ (25 లక్షల) టన్నుల యూరియాను కొనుగోలు చేయాలని నిర్ణయించింది.
టెండర్ల జారీ
ప్రభుత్వ పక్షాన ఎరువుల కొనుగోళ్లు జరిపే ఇండియన్ పొటాష్ లిమిటెడ్ (ఐపీఎల్) ఇటీవల భారీ అంతర్జాతీయ టెండర్‌ను జారీ చేసింది. ఈ టెండర్ ద్వారా 1.5 మిలియన్ టన్నుల యూరియాను పశ్చిమ తీర నౌకాశ్రయాల ద్వారా దిగుమతి చేసుకోనున్నారు. మిగిలిన మొత్తాన్ని తూర్పు తీర ప్రాంతాల ద్వారా సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఎరువుల రవాణా నౌకలు జూన్ 14వ తేదీ నాటికి సంబంధిత ఓడరేవుల నుంచి బయలుదేరాల్సి ఉంటుంది. టెండర్ల ఆఫర్ల సమర్పణకు ఏప్రిల్ 15 చివరి తేదీ కాగా, ఇవి ఏప్రిల్ 23 వరకు చెల్లుబాటులో ఉంటాయి.
భారతదేశ యూరియా ఉత్పత్తి ప్రధానంగా సహజ వాయువుపై ఆధారపడి ఉంటుంది. దేశీయంగా వినియోగించే సహజ వాయువులో మెజారిటీ భాగం మధ్యప్రాచ్యం నుంచే దిగుమతి అవుతోంది. అయితే, ప్రస్తుత ఉద్రిక్తతల వల్ల హార్మూజ్ జలసంధి వద్ద రాకపోకలకు ఆటంకం కలగడంతో ఎల్‌ఎన్‌జీ కొరత ఏర్పడింది. ఈ ప్రభావంతో గత నెలలో దేశంలోని కొన్ని కీలక ఎరువుల ప్లాంట్లు ఉత్పత్తిని నిలిపివేయాల్సి వచ్చింది.
ఖరీఫ్ సన్నద్ధత - నిల్వల వివరాలు
జూన్-సెప్టెంబర్ వర్షాకాలంలో వరి, మొక్కజొన్న, సోయాబీన్ వంటి పంటల సాగు ప్రారంభం కానుంది. ఈ సీజన్‌కు దేశవ్యాప్తంగా సుమారు 39 మిలియన్ టన్నుల ఎరువులు అవసరమని ఎరువుల మంత్రిత్వ శాఖ అంచనా వేసింది. ప్రస్తుత నిల్వ 18 మిలియన్ టన్నులుగా ఉంది. మిగిలిన 21 మిలియన్ టన్నులను దేశీయ ఉత్పత్తి, ప్రస్తుత దిగుమతుల ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఇదీ చదవండి: ఇన్సూరెన్స్ ఉంటే సరిపోదు!


