ఏడాది కాలంగా బంగారం, వెండి ధరలు అసాధారణ రీతిలో దూసుకుపోతున్నాయి. ధరల ర్యాలీతో సంతోషిస్తున్న పెట్టుబడిదారులు ఇప్పుడు కీలక దశలో ఉన్నట్లు కొందరు నిపుణులు చెబుతున్నారు. రానున్న కాలంలో బంగారం, వెండి పెరుగుదల ఇలాగే కొనసాగుతుందా.. లేదా అనే అనుమానం వ్యక్తం కావడమే ఇందుకు కారణం. ఈ తరుణంలో కామొడిటీ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టేవారికి కాపర్(రాగి) ఆకర్షణీయంగా కనిపిస్తున్నట్లు కొందరు భావిస్తున్నారు. పారిశ్రామిక డిమాండ్, సరఫరా కొరత కారణంగా కాపర్ ధరలు సైతం కొంతకాలంగా పెరుగుతున్నాయి. దాంతో కాపర్ ‘భవిష్యత్తు బంగారం’(లాభాల పరంగా)గా మారుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కాపర్ ధరలు గడచిన ఏడాది కాలంలో దాదాపు 25 శాతం పెరిగాయని కొన్ని రిపోర్టులు చెబుతున్నాయి. ప్రస్తుతం కేజీ కాపర్ ధర సుమారు రూ.750గా ఉంది. ఇది 2026లో రూ.1500-రూ.1800 వరకు పెరిగే అవకాశం ఉందని కొందరు అంచనా వేస్తున్నారు.
అసలు బంగారం, వెండి ధరలు ఎందుకు పెరిగాయి?
బంగారం, వెండి ధరలు ఇటీవల కాలంలో భారీగా పెరగడానికి అనేక అంతర్జాతీయ, దేశీయ అంశాలు దోహదపడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు ప్రజలు తమ డబ్బు విలువను కాపాడుకోవడానికి సురక్షితమైన పెట్టుబడి మార్గాల కోసం చూస్తారు. చరిత్రలో బంగారం ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా పనిచేసే సాధనంగా ఉంది. దీనివల్ల డిమాండ్ పెరిగి ధరలు అధికమయ్యాయి.
అనేక దేశాల కేంద్ర బ్యాంకులు భౌగోళిక రాజకీయ అనిశ్చితి, ఆర్థిక అస్థిరత నేపథ్యంలో తమ నిల్వలను పెంచుకోవడానికి భారీ మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేశాయి.
సాధారణంగా యూఎస్ డాలర్ విలువ తగ్గినప్పుడు డాలర్ ఆధారిత బంగారం ఇతర కరెన్సీలు ఉన్న కొనుగోలుదారులకు చౌకగా మారుతుంది. తద్వారా డిమాండ్ పెరుగుతుంది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, మిడిల్ ఈస్ట్ దేశాల్లో సంక్షోభం వంటి సంఘటనలు ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితిని పెంచాయి. దీనితో పెట్టుబడిదారులు భద్రంగా ఉండే బంగారం వైపు మళ్లారు.
ఎలక్ట్రానిక్స్, సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వాహనాలు (EVs) వంటి పరిశ్రమల నుంచి వెండికి పారిశ్రామిక డిమాండ్ పెరుగుతుంది.
కాపర్ (రాగి) ధరల పెరుగుదలకు కారణాలు..
ఒకప్పుడు కేవలం పారిశ్రామిక లోహంగా మాత్రమే పరిగణించబడిన కాపర్ ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ మెటల్‌గా మారుతుంది. కొన్ని నివేదికల ప్రకారం కాపర్ లోహం గత రెండు దశాబ్దాల్లో దాదాపు 700 శాతం పెరిగింది. ఇది పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా గనుల్లో ఉత్పత్తి సమస్యలు, స్థానిక ఆందోళనలు, కొత్త గనుల అభివృద్ధిలో జాప్యం కారణంగా కాపర్ సరఫరా గణనీయంగా తగ్గింది. దీనికి తోడు పెరిగిన డిమాండ్ ధరలను మరింత పెంచింది.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తుండడం, భారీ స్థాయి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, భవన నిర్మాణ రంగం నుంచి కాపర్‌కు డిమాండ్ బలపడుతోంది.
భవిష్యత్తు అంచనా
మార్కెట్ నిపుణులు, మైనింగ్ దిగ్గజాలు రాగిని ‘తదుపరి బంగారం’గా పేర్కొంటున్నారు. కాపర్ ధరలు భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఎలక్ట్రిక్ వాహనాలు: ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో రాగి కీలక పాత్ర పోషిస్తుంది. ఒక సంప్రదాయ కారు కంటే ఒక ఎలక్ట్రిక్ కారుకు దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ కాపర్ అవసరం అవుతుంది. ఈవీల అమ్మకాలు పెరిగే కొద్దీ కాపర్ డిమాండ్ అపారంగా పెరుగుతుంది.
క్లీన్ ఎనర్జీ: పునరుత్పాదక ఇంధన వనరుల్లో ముఖ్యంగా సోలార్, పవన విద్యుత్ మౌలిక సదుపాయాల విస్తరణకు కాపర్ అవసరం అనివార్యం. కేబుల్స్, ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ సరఫరా వ్యవస్థల్లో రాగి కీలకమైన లోహం.
డిజిటలైజేషన్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డేటా సెంటర్లు, 5G టెక్నాలజీ, ఇతర ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో కాపర్‌కు డిమాండ్ పెరుగుతోంది.
కాపర్ వినియోగించే పరిశ్రమలు
| పరిశ్రమ | వినియోగం |
|---|---|
| విద్యుత్, ఎలక్ట్రానిక్స్ | వైర్లు, కేబుల్స్, మోటార్లు, జనరేటర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు (PCBs) |
| నిర్మాణ రంగం | హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థలు, పైపులు, రూఫింగ్ |
| రవాణా | ఎలక్ట్రిక్ వాహనాలు (EVs), రైల్వేలు, విమానయాన రంగం |
| పునరుత్పాదక శక్తి | సోలార్ ప్యానెల్స్, విండ్ టర్బైన్లు, బ్యాటరీలు |
| పారిశ్రామిక యంత్రాలు | ఉష్ణ మాపకాలు(Heat Exchangers), పంపులు |
గమనిక: పెట్టుబడికి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు నిపుణుల సలహా తప్పనిసరని గమనించాలి.
ఇదీ చదవండి: అలసిన పసిడి ధరలు.. తులం ఎంతంటే..


