
అమెరికాకు చెందిన వారెన్ బఫెట్, ప్రపంచంలోని అత్యాధునిక అత్యంత తెలివైన పెట్టుబడిదారుల్లో ఒకరు. ఆయన గురించి తెలియని విద్యావంతులు ఉంటారేమో కానీ ఆర్ధికవేత్తలు ఉండరు. ప్రపంచంలో అత్యధిక ధనవంతుల్లో 5వ వ్యక్తి అయిన వారెన్ బఫెట్ 94 వయస్సులోనూ అత్యంత తెలివిగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతూ లాభాలను ఆర్జిస్తున్నారు. సంపదను అర్జించడంతో పాటు దానిని రక్షించుకోవడం, దాని విలువను పెంచుకోవడం వంటి విషయాలపై ఆయన తరచుగా చెప్పే సూత్రాలు ఆర్ధిక నిరక్షరాస్యులకు ఓ రకంగా పాఠాల లాంటివే నని చెప్పాలి. సంపన్నులు కాలేకపోయిన మధ్య తరగతి జీవులు తరచుగా చేసే తప్పుల గురించి ఆయన చెప్పిన కొన్ని విషయాలివి...
కొత్త కారు...పెద్ద వృధా..
చాలా మంది తమ స్థాయి మెరుగుపరచడం కోసం కాకుండా మెరుగైందని చెప్పుకోవడం కోసం ఎక్కువ ఆరాట పడతారు. అలాంటి వారికి బఫెట్ చెబుతున్న సలహా ఏమిటంటే...కొత్త కారు షోరూం నుంచి బయటకి తీసుకొచ్చిన రెండో నిమిషం నుంచే విలువ తగ్గిపోవడం మొదలవుతుంది, ఐదు సంవత్సరాల్లో దాని విలువ 60% వరకు కోల్పోతుంది. వేల కోట్ల ఆస్తులున్న బఫెట్ 2014 మోడల్ క్యాడిల్లాక్ ఎక్స్‌టిఎస్ ను వినియోగిస్తుంటారు. అదీ జనరల్ మోటార్స్ వాళ్లు భారీ డిస్కౌంట్ ధరపై ఇస్తేనే కొనుగోలు చేశారు. ఆయనేమంటారంటే... ‘‘కారును ఒక విజయంలా కాదు, ఒక ప్రయాణ మార్గంగా మాత్రమే చూడాలి’’.
క్రెడిట్ కార్డ్ ఓ వల...
బహుశా భారతదేశంలో ఇప్పుడు క్రెడిట్ కార్డు గురించి తెలియని వారిని వేళ్ల మీద లెక్కపెట్టవచ్చేమో కానీ... క్రెడిట్ కార్డ్ వల్ల వచ్చే నష్టాలు మాత్రం లెక్కలేనన్ని అంటున్నారు బఫెట్.. దాని అప్పులపై అత్యధికంగా 30% వడ్డీ చెలించాల్సి వుంటుంది. ఉదాహరణకు రూ.1 లక్ష తీసుకుంటే రూ.30 వేల దాకా వార్షిక వడ్డీ చెల్లించవలసి ఉంటుంది. ‘‘మీరు తెలివిగా ఉంటే, అప్పు బాధ వదిలిపోవచ్చు’’ అంటారాయన. క్రెడిట్ కార్డ్‌ను అత్యవసర సమయాల్లో ఉపకరించేదిగా మాత్రమే చూడాలి తప్ప అత్యధిక వ్యయానికి అవకాశంగా చూడకూడదని ఆయన హెచ్చరిస్తున్నారు.
లాటరీ, జూదం రెండూ ప్రమాదమే..
జూదం, లాటరీలను ‘‘మ్యాథ్ ట్యాక్స్’’ అని పేర్కొంటారు బఫెట్, అంటే మ్యాథమేటిక్స్, లాజిక్ తెలియని వారికి వడ్డించే అదనపు పన్ను అని అర్ధం. ఇవి వ్యక్తుల్ని వారి మేధా శక్తిని నిర్వీర్యం చేసి చివరకు అదృష్టం మీద ఆధారపడే దుస్థితికి చేరుస్తుందని ఆయన అంటున్నారు.
ఇల్లు...అవసరమా? విజయమా?
అవసరానికి ఇల్లు కొనవచ్చు. అయితే అవసరానికి మించి పెద్ద ఇల్లు ఉంటే అది నష్టమే అంటున్నారు బఫెట్. ఆయన తాను 1958లో కొనుక్కున్న పాత ఇంటిలోనే ఆయన ఇప్పటికీ జీవిస్తున్నారు. ఇల్లు జీవించడానికి రెండు పడకగదుల ఇల్లు సరిపోయేవారు 4 పడక గదుల ఇల్లు కొనడం అంటే రూ.లక్షలు ఏటా వృధా చేస్తున్నట్టే వారికి పన్నులు, నిర్వహణ, సిబ్బంది ఖర్చులు, మెయిన్‌టెనెన్స్ అన్నీ డబుల్ అవుతాయి. కాబట్టి ఇల్లు కొనుగోలులో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి అని సూచిస్తున్నారాయన.
అవగాహన లేని చోట ఎప్పుడూ పెట్టుబడి పెట్టవద్దు
మనకు ఉన్న అదనపు సొమ్మును లాభాల కోసం రకరకాల మార్గాల్లో పెట్టుబడులుగా మార్చడం సరైనదే. అయితే మనం దేనిలో పెట్టుబడి పెడుతున్నాం? అనేది పూర్తి అవగాహన ఉండాలి. అలా కాకుండా ఏ మాత్రం తెలియని వ్యాపారం, రంగంలో పెట్టుబడి పెడితే... అది ఎప్పటికైనా నష్టాలే తెస్తుంది. ముందు పొదుపు చెయ్యి, ఆ తర్వాత ఖర్చు చెయ్యి తెలివిగా ఇన్వెస్ట్ చెయ్యి...అంటూ సూత్రీకరించే బఫెట్.. మనకు.వందల వేల కోట్ల ఆస్తులున్నా సరే.. ఆర్ధిక భధ్రత కోసం రెండే రూల్స్ పెట్టుకోవాలని సూచిస్తున్నారు. అవి 1. ఎప్పుడూ డబ్బును నష్టపోవద్దు. 2.మొదటి రూల్‌ని ఎప్పటికీ మరచిపోవద్దు.