వేసవి విడిదికి తోడు ఈద్ సెలవులు దగ్గరపడుతుండటంతో అంతర్జాతీయ పర్యాటకానికి భారతీయులు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో భారత పాస్‌పోర్ట్ శక్తిసామర్థ్యాలపై తాజా 'హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్' ఆసక్తికర గణాంకాలను విడుదల చేసింది. ప్రస్తుతం గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో భారత్ 78వ స్థానంలో నిలిచింది. ఫిబ్రవరిలో ఉన్న 75వ స్థానం నుంచి స్వల్పంగా పడిపోయినప్పటికీ, భారతీయులు వీసా ముందస్తు దరఖాస్తు అవసరం లేకుండానే ప్రపంచవ్యాప్తంగా 56 దేశాలను చుట్టిరావచ్చు.
ర్యాంకింగ్‌లో హెచ్చుతగ్గులు..
గ్లోబల్ వీసా విధానాల్లో వస్తున్న మార్పుల వల్ల భారత్ ఈసారి క్యూబా, సెనెగల్ వంటి దేశాలతో కలిసి 78వ స్థానాన్ని పంచుకుంది. అయితే, గమ్యస్థానాల పరంగా చూస్తే భారత్ బలం స్థిరంగానే ఉంది. 2025లో 57 దేశాలకు వీసా లేకుండా ప్రవేశం ఉండేది. అది జనవరి 2026 నాటికి 55 దేశాలకు తగ్గింది. ప్రస్తుతం గాంబియా చేరికతో 56 దేశాలకు వీసాఫ్రీ యాక్సిస్ పెరిగింది.
ఎక్కడికి ఎలా వెళ్లొచ్చు?
భారత పౌరులకు ప్రస్తుతం 30 దేశాలు పూర్తిస్థాయిలో వీసా రహిత ప్రవేశాన్ని కల్పిస్తుండగా, 23 దేశాలు 'వీసా-ఆన్-అరైవల్' (వచ్చిన తర్వాత వీసా), మరో 3 దేశాలు 'ఈటీఏ' (ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్) పద్ధతిలో అనుమతిస్తున్నాయి.
వీసా రహిత ప్రవేశం ఉన్న దేశాల్లో అంగోలా, బార్బడోస్, భూటాన్, బ్రిటిష్ వర్జిన్ దీవులు, కుక్ దీవులు, డొమినికా, ఫిజీ, గ్రెనడా, హైతీ, జమైకా, కజకస్తాన్, కిరిబాటి, మకావో (ఎస్.ఎ.ఆర్ చైనా), మలేషియా, మారిషస్, మైక్రోనేషియా, మోంట్సెరాట్, నేపాల్, నియు, ఫిలిప్పీన్స్, రువాండా, సెనెగల్, సెయింట్ విన్సెంట్ అండ్ ది గ్రెనడైన్స్, థాయ్ లాండ్, ది గాంబియా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, వనాటు ఉన్నాయి.
వీసా-ఆన్-అరైవల్ (VOA) అనుమతిస్తున్న దేశాల్లో బురుండి, కంబోడియా, కేప్ వెర్డే దీవులు, కొమొరో దీవులు, జిబౌటి, ఇథియోపియా, గినియా-బిస్సావు, ఇండోనేషియా, జోర్డాన్, లావోస్, మడగాస్కర్, మాల్దీవులు, మార్షల్ దీవులు, మంగోలియా, మొజాంబిక్, మయన్మార్, పలావు దీవులు, ఖతార్, సియెర్రా లియోన్, శ్రీలంక, సెయింట్ లూసియా, టాంజానియా, తైమూర్-లెస్టే, తువాలు, జింబాబ్వే ఉన్నాయి.
ఇక కెన్యా, సీషెల్స్, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ దేశాలు ఈటీఏ విధానంలో ప్రవేశం కల్పిస్తున్నాయి.
పర్యాటకుల చూపు.. 'సమీప' దేశాల వైపు..
ఈద్ సెలవుల నేపథ్యంలో తక్కువ ఖర్చుతో, కనీస డాక్యుమెంటేషన్‌తో ప్రయాణించే వీలున్న ఆసియా, మధ్యప్రాచ్య దేశాలపై భారతీయులు మక్కువ చూపుతున్నారు. ముఖ్యంగా థాయ్‌లాండ్, మలేషియా, మాల్దీవులు వంటి దేశాలు వీసా సరళీకరణను ప్రకటించడంతో బుకింగ్స్ ఒక్కసారిగా ఊపందుకున్నాయి.
ర్యాంకింగ్‌లో స్వల్ప మార్పు ఉన్నప్పటికీ, ఇది మన పాస్‌పోర్ట్ బలహీనత కంటే ఇతర దేశాల వీసా విధానాల్లో వస్తున్న మార్పుల వల్ల సంభవించినదేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు. విదేశీ ప్రయాణం చేయాలనుకునే వారు సంబంధిత దేశ ఇమ్మిగ్రేషన్ నిబంధనలను ఒకసారి సరిచూసుకోవడం ఉత్తమం.


