మార్కెట్‌లోకి కొత్త ఎలక్ట్రిక్‌ కారు.. 517 కి.మీ. రేంజ్‌ | VinFast VF MPV 7 Launched In India At Rs 24 49 Lakh | Sakshi
Sakshi News home page

మార్కెట్‌లోకి కొత్త ఎలక్ట్రిక్‌ కారు.. 517 కి.మీ. రేంజ్‌

Apr 15 2026 3:27 PM | Updated on Apr 15 2026 4:04 PM

VinFast VF MPV 7 Launched In India At Rs 24 49 Lakh

ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ (VinFast) భారత మార్కెట్లోకి తన మూడవ మోడల్ ‘వీఎఫ్‌ ఎంపీవీ 7’ (VF MPV 7)ను అధికారికంగా విడుదల చేసింది. వినూత్న ఫీచర్లు, శక్తివంతమైన రేంజ్‌తో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ కారు ప్రారంభ ధరను రూ. 24.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా సంస్థ నిర్ణయించింది. ప్రధానంగా ఫ్లీట్ (Commercial) ఆపరేటర్లను దృష్టిలో ఉంచుకుని దీనిని రూపొందించారు.

బుకింగ్స్ ప్రారంభం
విన్‌ఫాస్ట్‌ ‘వీఎఫ్‌ ఎంపీవీ 7’ కారు అమ్మకాలకు బుకింగ్స్‌ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ కారు కొనే ఆసక్తి ఉన్న వినియోగదారులు రూ. 21,000 టోకెన్ మొత్తంతో బుకింగ్ చేసుకోవచ్చు. కాగా ఈ ఏడాది చివర్లో  'లిమో గ్రీన్' పేరుతో దీనికి సంబంధించిన పూర్తి స్థాయి కమర్షియల్ వెర్షన్ కూడా అందుబాటులోకి రానుంది.

డిజైన్
‘వీఎఫ్‌ ఎంపీవీ 7’ మోడల్ అధునాతన డిజైన్ లాంగ్వేజ్‌తో ఆకట్టుకుంటోంది. దీని కొలతలు చూస్తే 4,740 మిమీ పొడవు, 1,872 మిమీ వెడల్పు, 1,734 మిమీ ఎత్తు ఉంటుంది. ఏకంగా 1,240 లీటర్ల భారీ స్టోరేజ్ సామర్థ్యం(బూట్ స్పేస్) ఇచ్చారు.

ఎక్స్‌టీరియర్
ముందు భాగంలో విన్‌ఫాస్ట్ సిగ్నేచర్ "V" లోగోతో కూడిన ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, నిలువుగా ఉండే హెడ్ ల్యాంప్స్ దీనికి ప్రత్యేక లుక్‌ని ఇస్తాయి. 19-అంగుళాల అల్లాయ్ వీల్స్, వెనుక వైపు కారు వెడల్పు పొడవునా ఉండే టెయిల్ లైట్లు దీని ప్రధాన ఆకర్షణ.

ఇంటీరియర్, ఫీచర్లు
క్యాబిన్ లోపల ప్రయాణికుల సౌకర్యార్థం అత్యాధునిక సాంకేతికతను జోడించారు. 10.1-అంగుళాల భారీ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, లెథరెట్ ఇంటీరియర్, USB-A, USB-C ఛార్జింగ్ పోర్ట్‌లు ఇ​చ్చారు. ఇక ఆల్-డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ఆటో హోల్డ్ ఫీచర్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వంటి భద్రతా ప్రమాణాలు ఉన్నాయి.

పవర్‌ట్రైన్, పర్ఫార్మెన్స్
ఈ ఎలక్ట్రిక్ ఎంపీవీలో 60.1 kWh సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీంతో ఒక్కసారి ఛార్జ్ చేస్తే  517 కిలోమీటర్ల (ARAI గుర్తింపు పొందిన) ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు. 201 హెచ్‌పీ శక్తిని, 280 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కేవలం 9 సెకన్లలోనే 0 నుండి 100 కి.మీ వేగాన్ని అందుకోగలదు. దీని గరిష్ట వేగం గంటకు 140 కి.మీ. ఇది మూడు రకాల డ్రైవింగ్ మోడ్స్, రీజెనరేటివ్ బ్రేకింగ్ ఆప్షన్లతో లభిస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement