భారత్‌ వృద్ధి అంచనా 6.4 శాతానికి కట్‌  | United Nations revised India 2026 GDP growth forecast downward to 6. 4percent | Sakshi
Sakshi News home page

భారత్‌ వృద్ధి అంచనా 6.4 శాతానికి కట్‌ 

May 21 2026 6:22 AM | Updated on May 21 2026 6:22 AM

United Nations revised India 2026 GDP growth forecast downward to 6. 4percent

గత అంచనా 6.6 శాతం 

అయినా వేగవంతమైన ఆర్థిక వ్యవస్థే 

ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పశ్చిమాసియా షాక్‌ 

ఐక్యరాజ్య సమితి నివేదిక

న్యూయార్క్‌: ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితులు, పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో 2026 సంవత్సరానికి భారత్‌ జీడీపీ వృద్ధి రేటు అంచనాను ఐక్యరాజ్యసమితి (యూఎన్‌) స్వల్పంగా తగ్గించింది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో గత అంచనా 6.6 శాతాన్ని 6.4 శాతానికి తగ్గించింది. అయినప్పటికీ ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్‌ కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక వ్యవహారాల విభాగం ఈ మేరకు ఒక నివేదికను విడుదల చేసింది.  

పశ్చిమాసియా సంక్షోభం  
ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పశ్చిమాసియా సంక్షోభం మరో షాక్‌గా ఈ నివేదిక అభివరి్ణంచింది. ఇది ప్రపంచ వృద్ధిని మందగింపజేయడంతోపాటు, ద్రవ్యోల్బణం ఒత్తిళ్లను, అనిశ్చితులను పెంచినట్టు వివరించింది. ప్రస్తుత ప్రపంచ ప్రతికూల సవాళ్ల నుంచి భారత్‌కూ మినహాయింపు లేదని యూఎన్‌ గ్లోబల్‌ ఎకనామిక్‌ మానిటరింగ్‌ విభాగం సీనియర్‌ ఆర్థికవేత్త ఇంగో పిట్టర్లే వ్యాఖ్యానించారు. ‘‘భారత్‌ ఇంధనాన్ని భారీగా దిగుమతి చేసుకుంటోంది. విదేశాల నుంచి వచ్చే రెమిటెన్స్‌లపై ప్రభావం తదతర ఒత్తిళ్లు సైతం నెలకొన్నాయి. అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితుల కఠినతరంతో మానిటరీ పాలసీ మరింత సంక్లిష్టంగా మారింది’’ అని పిట్టర్లే వివరించారు. ఈ పరిస్థితుల్లో ఆర్‌బీఐ, ఆర్థిక శాఖ ఎలా స్పందిస్తాయన్నదే కీలకమన్నారు.  

ప్రపంచ జీడీపీ వృద్ధి అంచనా సైతం తగ్గింపు 
2026 సంవత్సరానికి గాను ప్రపంచ స్థూల జీడీపీ వృద్ధి రేటు అంచనాను సైతం 2.5 శాతానికి యూఎన్‌ తగ్గించింది. జనవరిలో వేసిన అంచనా కంటే 0.2 శాతం తక్కువ కావడం గమనార్హం. అంతేకాదు, కరోనా మహమ్మారికి ముందున్న సాధారణ వృద్ధి రేటు కంటే ఇది చాలా తక్కువని ఈ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది.  

బలంగానే ఆర్థిక మూలాలు.. 
భారత్‌ వృద్ధి 2025లో ఉన్న 7.5 శాతం నుంచి 2026లో 6.4 శాతం తగ్గడమన్నది ప్రధానంగా ఇంధన దిగుమతి వ్యయాలు పెరిగిపోవడం వల్లేనంటూ.. భారత ఆర్థిక వ్యవస్థ పునాదులు బలంగా ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. దేశీయంగా వినియోగ డిమాండ్, ప్రభుత్వ మూలధన వ్యయాలు, సేవల రంగ ఎగుమతుల్లో చక్కని పనితీరు కారణంగా భారతదేశంలో నిర్మాణాత్మకంగా బలమైన వృద్ధి కనిపిస్తున్నట్టు పేర్కొంది. తిరిగి 2027 సంవత్సరంలో ఆర్థిక వృద్ధి రేటు 6.6 శాతానికి పుంజుకుంటుందని అంచనా వేసింది. దిగుమతి చేసుకునే దేశాలకు వ్యయాలు పెరిగినప్పుడు ఎగుమతులు కూడా సమస్యలు ఎదుర్కోవచ్చని యూఎన్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ ఎకనమిక్‌ అనలైసిస్‌ శంతను ముఖర్జీ అభిప్రాయపడ్డారు. రవాణా ఖర్చులు, లాజిస్టిక్స్‌ వ్యయాలు, డీజిల్‌ వంటి ఇంధన ధరలు పెరిగినప్పుడు వ్యాపార వ్యయాలు పెరిగిపోయే ప్రమాదం ఉందన్నారు. ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లాగే ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్‌కు ఆర్థికంగా కొంత వెసులుబాటు ఉందన్నారు. అయితే, ప్రస్తుతమున్న మిగులు నిల్వలు కరిగిపోయే లోపే ఈ షాక్‌లను ఎంత సమర్థవంతంగా అధిగమించగలదన్న దానిపైనే ఇది ఆధారపడి ఉంటుందని చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement