ఫార్మా రంగంలో రెండో పెద్ద కంపెనీగా టొరెంట్‌ | Torrent Pharmaceuticals deal to acquire JB Chemicals Pharma | Sakshi
Sakshi News home page

ఫార్మా రంగంలో రెండో పెద్ద కంపెనీగా టొరెంట్‌

Jun 30 2025 9:03 AM | Updated on Jun 30 2025 9:03 AM

Torrent Pharmaceuticals deal to acquire JB Chemicals Pharma

టొరెంట్‌ ఫార్మా చేతికి జేబీ కెమ్‌

ప్రమోటర్ల వాటా 49.19 శాతం కొనుగోలు

సాధారణ వాటాదారుల నుంచి 26 శాతం 

దేశీయంగా ఔషధ రంగంలో మరో భారీ డీల్‌కు తెరలేచింది. ప్రయివేట్‌ రంగ దిగ్గజం టొరెంట్‌ ఫార్మాస్యూటికల్స్‌.. దేశీ కంపెనీ జేబీ కెమికల్స్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్స్‌ను కొనుగోలు చేస్తోంది. తద్వారా దేశీ ఫార్మా రంగంలో రెండో పెద్ద కంపెనీగా అవతరించనుంది. జేబీ కెమ్‌ ప్రమోటర్ల నుంచి   46.39 శాతం వాటా కొనుగోలుకి తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు టొరెంట్‌ ఫార్మా పేర్కొంది. ఇందుకు మొత్తం రూ.19,500 కోట్లు వెచ్చించనుంది.

ఈ డీల్‌లో భాగంగా తొలుత ప్రమోటర్, పీఈ దిగ్గజం కేకేఆర్‌ నుంచి 46.39% వాటా కొనుగోలు చేయనుంది. ఇందుకు రూ.11,917 కోట్లు చెల్లించనుంది. అంతేకాకుండా జేబీ కెమ్‌లో కొంతమంది ఉద్యోగుల నుంచి షేరుకి రూ.1,600 ధరలో 2.8 శాతం వాటాను సైతం సొంతం చేసుకోనుంది. ఇందుకు రూ. 719 కోట్లు వెచ్చిస్తుంది. తద్వారా 49.19% వాటా చేజిక్కించుకోనుంది. ఆపై నిబంధనల ప్రకారం సాధారణ వాటాదారులకు షేరుకి రూ. 1,639 ధరలో 26% వాటా కొనుగోలుకి ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించనుంది. ఇందుకు దాదాపు రూ. 6,843 కోట్లు కేటాయించనుంది. శుక్రవారం ముగింపు ధర రూ.1,799తో పోలిస్తే ఓపెన్‌ ఆఫర్‌ ధర 9% తక్కువకావడం గమనార్హం! 

దేశీ ఫార్మా రంగంలో టొరెంట్‌ పార్మా, జేబీ కెమికల్స్‌ డీల్‌ రెండో పెద్ద లావాదేవీగా నమోదుకానుంది. ఇంతక్రితం 2015లో సన్‌ ఫార్మాస్యూటికల్‌ ఇండస్ట్రీస్‌ మరో దేశీ దిగ్గజం ర్యాన్‌బ్యాక్సీ ల్యాబొరేటరీస్‌ను కొనుగోలు చేసిన డీల్‌ అతిపెద్ద లావాదేవీగా నిలుస్తోంది.

ఇదీ చదవండి: స్వల్పకాల పెట్టుబడికి మెరుగైన సాధనాలు

100: 51 నిష్పత్తిలో: నియంత్రిత వాటా కొనుగోలు తదుపరి జేబీ కెమికల్స్‌ను టొరెంట్‌ ఫార్మాస్యూటికల్స్‌ విలీనం చేసుకోనుంది. ఇందుకు 100: 51 విలీన నిష్పత్తిని సైతం టొరెంట్‌ ఫార్మా ప్రకటించింది. జేబీ కెమ్‌ వాటాదారుల వద్దగల ప్రతీ 100 షేర్లకుగాను 51 టొరెంట్‌ ఫార్మా షేర్లను కేటాయించనుంది. తాజా డీల్‌ కారణంగా క్రానిక్‌ విభాగంలో సుప్రసిద్ధ జేబీ కేమ్‌ బ్రాండ్లను టొరెంట్‌ పొందగలుగుతుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement