ఉక్రెయిన్‌పై రష్యా అణు ప్రయోగం.. నష్టాలతో ముగిసిన మార్కెట్లు

Today Stock Market Update - Sakshi

మూడోరోజూ నష్టాలు

ఐటీ తప్ప అన్ని షేర్లూ డీలా

సెన్సెక్స్‌ నష్టం 769 పాయింట్లు

16,250 దిగువకు నిఫ్టీ

ముంబై: మిడ్‌సెషన్‌లో ఆరంభ నష్టాలను పూడ్చుకున్నప్పటికీ.., చివరి గంట అమ్మకాలతో స్టాక్‌ సూచీలు మూడోరోజూ నష్టాలతో ముగిశాయి. ఒక్క ఐటీ తప్ప అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీలకు శుక్రవారమూ పతనం తప్పలేదు. సెన్సెక్స్‌ 769 పాయింట్లు క్షీణించి 54,334 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 253 పాయింట్లను కోల్పోయి 16,245 వద్ద నిలిచింది. సెన్సెక్స్‌ సూచీలోని 30 షేర్లలో 23 షేర్లు నష్టపోయాయి. మెటల్, ఎఫ్‌ఎంసీజీ, ఆటో షేర్లలో అధిక అమ్మకాలు జరిగాయి.

గత రెండు సెషన్లో స్వల్ప నష్టాలను చవిచూసిన మిడ్, స్మాల్‌క్యాప్‌ షేర్లు ఇంట్రాడేలో భారీగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫలితంగా బీఎస్‌ఈ మిడ్, స్మాల్‌ ఇండెక్సులు రెండున్నర శాతానికి పైగా క్షీణించాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.7,631 కోట్ల షేర్లను విక్రయించగా, దేశీయ ఇన్వెస్టర్లు రూ.4,739 కోట్ల షేర్లను కొన్నారు. ప్రపంచ మార్కెట్లలోనూ బలహీనతలు కొనసాగుతున్నాయి. ఆసియాలో ఒక్క ఇండోనేసియా మినహా అన్ని దేశాలకు స్టాక్‌ సూచీలు రెండు శాతం క్షీణించాయి. యూరప్‌ మార్కెట్లు మూడు శాతానికి పైగా నష్టపోయాయి.

నాలుగు రోజులే ట్రేడింగ్‌ జరిగిన ఈ వారంలో సెన్సెక్స్‌ 1,525 పాయింట్లు, నిఫ్టీ 413 పాయింట్ల చొప్పున నష్టపోయాయి. సూచీలకిది వరుసగా నాలుగోవారమూ నష్టాల ముగింపు కావడం గమనార్హం.  ‘‘రష్యా బలగాలు యూరప్‌లోని అతిపెద్ద అణు విద్యుత్‌ ప్లాంట్‌ జాపోరిజియాపై దాడి తర్వాత అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు అనూహ్య పతనాన్ని చవిచూశాయి. మండిపోతున్న క్రూడాయిల్‌ ధరలు, సప్లై అవాంతరాలతో ద్రవ్యోల్బణ స్థాయి ఆర్‌బీఐ అంచనాలను మించిపోవచ్చనే ఆందోళనలు తెరపైకి వచ్చాయి. యుద్ధంతో సరఫరాకు విఘాతం కలిగించవచ్చనే భయాలు నెలకొన్నాయి’’ జియోజిత్‌ ఫైనాన్స్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ తెలిపారు.

ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 54 వేల దిగువకు...
స్టాక్‌మార్కెట్‌ ఉదయం భారీ నష్టంతో మొదలైంది. సెన్సెక్స్‌ 452 పాయింట్లు నష్టంతో 54,654 వద్ద, నిఫ్టీ 159 పాయింట్లు క్షీణించి 16,723 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. తొలిసెషన్‌లో అమ్మకాలతో సెన్సెక్స్‌ 1,215 పాయింట్లు పతనమై 53,888 వద్ద, నిఫ్టీ 364 పాయింట్లు నష్టపోయి 16,134 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. గతేడాది ఆగస్ట్‌ 3వ తేదీ తర్వాత సెన్సెక్స్‌ 54 వేల స్థాయిని కోల్పోవడం ఇదేతొలిసారి. మిడ్‌సెషన్‌లో సూచీలకు కనిష్టస్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో లాభాలన్నీ పూడ్చుకోగలిగాయి. అయితే మార్కెట్‌ మరోగంటలో ముగిస్తుందన్న సమయంలో అమ్మకాలు జోరందుకుని సూచీలు వారాంతాన్ని నష్టాలతో ముగించాయి.

3 రోజుల్లో రూ.5.59 లక్షల కోట్లు మాయం  
గత మూడు రోజుల్లో సెన్సెక్స్‌ సూచీ 1,913 పాయింట్లు క్షీణించడంతో ఇన్వెస్టర్లు రూ.5.59 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. తద్వారా ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ కంపెనీల నమోదిత మొత్తం విలువ రూ.247 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. ఉక్రెయిన్‌ రష్యా యుద్ధ ప్రభావంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినవచ్చనే భయాలతో ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీమార్కెట్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

మార్కెట్లో మరిన్ని సంగతులు  
► రైట్స్‌ ఇష్యూ ప్రకటన తర్వాత రోజు వొకార్డ్‌ షేరు బీఎస్‌ఈలో ఒకటిన్నర శాతం పుంజుకుని రూ. 346 వద్ద ముగిసింది.  
► వొడాఫోన్‌ ఐడియా షేరులో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. బీఎస్‌ఈలో షేరు దాదాపు 7% క్షీణించి రూ. 10.33 వద్ద స్థిరపడింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top