
ప్రపంచ పర్యాటక రంగం అభివృద్ధి చెందుతున్న తరుణంలో.. యునైటెడ్ స్టేట్స్ ఊహించని తిరోగమనాన్ని ఎదుర్కొంటోంది. అమెరికాకు వివిధ దేశాల నుంచి వచ్చేవారి సంఖ్య 8.2 శాతం తగ్గింది. ఫలితంగా పర్యటక ఆదాయం గణనీయంగా తగ్గింది. టూరిస్ట్‌లు ప్రత్యామ్నాయంగా సురక్షితమైన, చౌకైన గమ్యస్థానాలను ఎంచుకుంటున్నారు. అమెరికాకు పర్యాటకుల సంఖ్య తగ్గడానికి కారణాలను పరిశీలిస్తే..
వీసా ఆలస్యం, పెరిగిన ఖర్చులు, రాజకీయ ప్రభావం, భద్రతకు సంబంధించిన ఆందోళనలు ప్రధానంగా పర్యాటకుల సంఖ్య తగ్గడానికి కారణమని కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు.

యూఎస్‌కు వెళ్లే జర్మన్‌ల సంఖ్య 12 శాతం తగ్గింది. వీరంతా పోర్చుగల్, కెనడా, వియత్నాం దేశాలను సందర్శిస్తున్నారు. జపనీస్ సందర్శకుల సంఖ్య.. కోవిడ్ మహమ్మారి సమయం నుంచే 35 శాతం తగ్గిపోయింది. పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో వీరందరూ.. దక్షిణ కొరియా, థాయిలాండ్, ఆస్ట్రేలియాలను సందర్శిస్తున్నారు. అంతే కాకుండా అమెరికాకు వెళ్లే కెనడా పర్యాటకుల సంఖ్య 20.2 శాతం పడిపోయింది.
వీసా ఆలస్యం కారణంగా.. బ్రెజిల్ ప్రజలు అమెరికాకు ప్రత్యామ్నాయం వెతుక్కుని, యూరప్, సౌత్ అమెరికా దేశాలకు వెళ్తున్నారు. ఈ దేశీయులు అమెరికా వీసా కోసం 300 రోజులు నిరీక్షించాల్సి ఉంది. ఇది బ్రెజిలియన్ ప్రయాణికులను వేరే మార్గం వెతుక్కునేలా చేసింది.

ఇక భారత్ విషయానికి వస్తే.. అమెరికా అధ్యక్షుడు ప్రతీకార సుంకాలను విధించడమే కాకుండా, వీసా ఆంక్షలను కూడా మరింత కఠినం చేశారు. ఇప్పుడు వీసా కోసం భారతీయులు ఏకంగా 400 రోజులు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. రూపాయి కూడా బలహీనపడటం.. అమెరికాలో ఖర్చులు పెరగడం వల్ల, ఇండియన్స్.. ఆగ్నేయాసియా, యూరప్ దేశాలను ఎంచుకుంటున్నారు.
ఇదీ చదవండి: అమెరికా, పాకిస్తాన్ మధ్య కొత్త ఒప్పందం
పర్యాటకుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో.. అమెరికాలోని ప్రధాన నగరాలు ఇబ్బంది పడుతున్నాయి. పర్యాటకుల సంఖ్య 17 శాతం తగ్గడంతో న్యూయార్క్ నగరం 4 బిలియన్ డాలర్ల నష్టం చొసింది. శాన్ ఫ్రాన్సిస్కో & లాస్ ఏంజిల్స్ కూడా ఇలాంటి నష్టాలనే చవిచూస్తున్నాయి. వీసా విధానాలు సడలించకపోతే.. పర్యాటక రంగంలో అమెరికా కోలుకోవడానికి మరో రెండు నుంచి నాలుగేళ్ల సమయం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.