పన్ను ఆదా.. మంచి రాబడులు

Tax savings on Good returns Canara Robeco Equity Tax Saver - Sakshi

కెనరా రొబెకో ఈక్విటీ ట్యాక్స్‌ సేవర్‌

సెక్షన్‌ 80సీ కింద రూ.1.5 లక్షల మొత్తంపై ఆదాయపన్ను లేకుండా చూసుకోవాలని భావించే వారికి అందుబాటులో ఉన్న ఎన్నో సాధనాల్లో ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్‌ స్కీమ్స్‌ (ఈఎల్‌ఎస్‌ఎస్‌) కూడా ఒకటి. ఈక్విటీ పెట్టుబడులపై పన్ను ఆదా చేసుకునేందుకు ఇదొక చక్కని ఆప్షన్‌ కూడా అవుతుంది. కాకపోతే వీటిల్లో పెట్టుబడులను మూడేళ్ల పాటు వెనక్కి తీసుకునేందుకు (లాకిన్‌ పీరియడ్‌) అవకాశం ఉండదు.

పన్ను ఆదా ప్రయోజనం లభిస్తుంది కనుక లాకిన్‌ పీరియడ్‌ పెద్ద సమస్య కాబోదు. పైగా పన్ను ఆదా ప్రయోజనాలు కలిగిన సాధనాల్లో తక్కువ లాకిన్‌ ఉండే సాధనం కూడా ఇదే. ఈ విభాగంలో మెరుగైన, నిలకడైన రాబడులను ఇస్తున్న పథకాలు కొన్నే ఉన్నాయి. వాటిల్లో కెనరా రొబెకో ఈక్విటీ ట్యాక్స్‌ సేవర్‌ కూడా ఒకటి. జీవితంలో ముఖ్యమైన లక్ష్యాల కోసం (పిల్లల ఉన్నత విద్య, వివాహం, ఇల్లు, రిటైర్మెట్‌) ఈ పథకాలను ఎంపిక చేసుకోవచ్చు. తద్వారా దీర్ఘకాలంలో మంచి నిధి సమకూర్చుకునే అవకాశం కలుగుతుంది.

పనితీరు
కెనరా రొబెకో ఈక్విటీ ట్యాక్స్‌ సేవర్‌ పథకం ఈఎల్‌ఎస్‌ఎస్‌ విభాగం సగటు రాబడుల కంటే మెరుగైన పనితీరును 2018 నుంచి నమోదు చేస్తూ వస్తోంది. భారీ అస్థిరతలు కనిపించిన 2020లో ఈ పథకం ఇచ్చిన రాబడులు 27.3 శాతంగా ఉన్నాయి. కానీ ఈఎల్‌ఎస్‌ఎస్‌ విభాగం సగటు రాబడులు 16 శాతంగానే ఉండడం గమనార్హం. గడిచిన ఏడాది కాలంలో రాబడులు 56 శాతంగా ఉన్నాయి. మూడేళ్లలో 19 శాతం, ఐదేళ్లలో 18 శాతం, ఏడేళ్లలో 15.54 శాతం, పదేళ్లలో 15.59 శాతం చొప్పున వార్షిక రాబడులను ఈ పథకం ఇచ్చింది.

1993లో ఈ పథకం ఆరంభమైన నాటి నుంచి చూస్తే వార్షిక రాబడులు 15.42 శాతంగా ఉండడాన్ని తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి. అన్ని కాలాల్లోనూ ఈ పథకంలో రాబడులు 15 శాతంపైనే ఉండడాన్ని చక్కని, మెరుగైన రాబడులని నిపుణుల అభిప్రాయం. ప్రతీ నెలా ఈ పథకంలో రూ.500 నుంచి ఇన్వెస్ట్‌ చేసుకునే వెసులుబాటు ఉంది. ఈక్విటీ అస్థిరతలను తగ్గించుకునేందుకు సిప్‌ ప్లాన్‌ అనుకూలమైనది.  

పెట్టుబడుల విధానం
వైవిధ్యమైన పెట్టుబడుల నిర్మాణాన్ని ఈ పథకం అనుసరిస్తుంటుంది. ఆర్థికంగా బలమైన మూలాలు కలిగి, ఎప్పటికప్పుడు వ్యాపారంలో స్థిరమైన వృద్ధిని నమోదు చేసే కంపెనీలకు పెట్టుబడుల పరంగా ప్రాధాన్యం ఇస్తుంటుంది. ప్రధానంగా లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌కు ఎక్కువ కేటాయింపులు చేస్తోంది. ఆరు నెలల క్రితం లార్జ్‌క్యాప్‌లో 70 శాతం మేర ఉన్న పెట్టుబడులను తాజాగా 76.5 శాతానికి పెంచుకుంది. మార్కెట్లు గణనీయంగా పెరిగి ఉన్న నేపథ్యంలో దిద్దుబాటు చోటు చేసుకుంటే.. లార్జ్‌క్యాప్‌ రూపంలో రిస్క్‌ తగ్గించుకునే వ్యూహం ఇందులో కనిపిస్తోంది.

అదే సమయంలో స్మాల్, మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ భారీ ర్యాలీ నేపథ్యంలో వీటిల్లో ఎక్స్‌పోజర్‌ కొంత తగ్గించుకుంది. ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాలకు కచ్చితంగా ఫలానా విభాగంలో ఇంత మేర ఇన్వెస్ట్‌ చేయాలన్న నిబంధనలు వర్తించవు. కనుక పెట్టుబడుల విషయంలో ఇవి సౌకర్యవంతంగా (ప్లెక్సిబుల్‌) వ్యవహరించగలవు. ప్రస్తుతం ఈ పథకం పోర్ట్‌ఫోలియోను పరిశీలించినట్టయితే 55 స్టాక్స్‌ ఉన్నాయి. బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్, టెక్నాలజీ స్టాక్స్‌లో ఎక్కువగా పెట్టుబడులున్నాయి. మొత్తం తన నిర్వహణలోని పెట్టుబడుల్లో (రూ.2,343 కోట్లు) 97.3 శాతాన్ని ఈక్విటీలకు కేటాయించగా.. మిగిలిన పెట్టుబడులను డెట్‌ రూపంలో కలిగి ఉంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top