జేఎల్‌ఆర్‌ రూ.1,53,450 కోట్లు

Tata Motors-backed Jaguar to invest 15 billion pounds for EV product over next 5 yrs - Sakshi

వచ్చే అయిదేళ్లలో పెట్టుబడి

న్యూఢిల్లీ: టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌) వచ్చే అయిదేళ్లలో రూ.1,53,450 కోట్ల పెట్టుబడి చేయనున్నట్టు ప్రకటించింది. విస్తరణ, కొత్త మోడళ్లను ప్రవేశపెట్టడం, కార్లకు సాంకేతికత జోడించడం కోసం ఈ నిధులను వెచ్చించనున్నట్టు వెల్లడించింది. యూకేలోని హేల్‌వుడ్‌ ప్లాంటు పూర్తి ఎలక్ట్రిక్‌ మోడళ్ల తయారీ కేంద్రం కానుందని తెలిపింది. ప్రస్తుతం ఇంటర్నల్‌ కంబషన్‌ ఇంజన్లను తయారు చేస్తున్న వోవహాంప్టన్‌ ప్లాంటులో ఎలక్ట్రిక్‌ డ్రైవ్‌ యూనిట్లను ఉత్పత్తి చేస్తారు. అలాగే ఈ కేంద్రాన్ని ఎలక్ట్రిక్‌ ప్రొపల్షన్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ సెంటర్‌గా పేరు మార్చనున్నారు. మధ్యస్థాయి ఆధునిక లగ్జరీ ఎస్‌యూవీ పూర్తి ఎలక్ట్రిక్‌ రూపంలో రానున్నట్టు జేఎల్‌ఆర్‌ వెల్లడించింది. ఈ ఏడాదే క్లయింట్ల నుంచి ఆర్డర్లు స్వీకరించనున్నట్టు తెలిపింది. డెలివరీలు 2025 నుంచి మొదలు కానున్నాయి.  

పురోగతి సాధించాం..
ఎలక్ట్రిక్‌ వాహన విభాగంలో 2030 నాటికి ఆధునిక లగ్జరీ కార్‌ బ్రాండ్‌గా నిలవాలన్న లక్ష్యాన్ని జేఎల్‌ఆర్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆడ్రియన్‌ మార్డెల్‌ పునరుద్ఘాటించారు. 2024–25 నాటికి రుణ రహిత, 2026 నాటికి రెండంకెల ఎబిటా స్థాయికి చేరుకుంటామన్నారు. ‘విలాసవంత వ్యాపారం కోసం పర్యావరణ, సామాజిక, కమ్యూనిటీ ప్రభావంలో కొత్త బెంచ్‌మార్క్‌ను రూపొందించడానికి రెండేళ్ల క్రితం వ్యూహాన్ని రచించాం. నాటి నుంచి చాలా పురోగతి సాధించాం. ఇందులో భాగంగా విమర్శకుల ప్రశంసలు పొందిన రెండు కొత్త ఆధునిక లగ్జరీ రేంజ్‌ రోవర్, రేంజ్‌ రోవర్‌ స్పోర్ట్‌ మోడళ్లను ఆవిష్కరించాం. రికార్డు స్థాయిలో వీటికి డిమాండ్‌ ఉంది. మహమ్మారి, చిప్‌ కొరత సవాళ్లు ఉన్నప్పటికీ ఈ ఘనతను సాధించాం. మూడవ త్రైమాసికంలో లాభాలను ఆర్జించేందుకు.. లాభదాయకత ఉన్న మోడళ్ల తయారీ సామర్థ్యాన్ని పెంచుతున్నాం’ అని వివరించారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top