
అత్యంత ఆకర్షణీయమైన ఎంప్లాయర్ బ్రాండ్
టాప్ 3లో గూగుల్ ఇండియా, ఇన్ఫోసిస్
ర్యాండ్‌స్టాడ్ అధ్యయనంలో వెల్లడి
న్యూఢిల్లీ: దేశీయంగా ఉద్యోగాలకు అత్యంత ఆకర్షణీయమైన బ్రాండ్లుగా టాటా గ్రూప్, గూగుల్ ఇండియా, ఇన్ఫోసిస్ నిలిచాయి. ర్యాండ్‌స్టాడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రీసెర్చ్ (ఆర్‌ఈబీఆర్) 2025 నివేదికలో టాప్ 3 స్థానాలను దక్కించుకున్నాయి. దీని ప్రకారం భారత్‌లో ఉద్యోగులు వర్క్–లైఫ్ సమతుల్యత, సమానత్వం, ఆకర్షణీయమైన జీతభత్యాలను కోరుకుంటున్నారు. అలాంటి కంపెనీలకే ఎక్కువగా ప్రాధాన్యమిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆరి్థక ఆరోగ్యం, కెరియర్ పురోగతి అవకాశాలు, ప్రతిష్ట అంశాల్లో టాటా గ్రూప్ అత్యధిక స్కోరుతో అగ్రస్థానం దక్కించుకుంది.
గూగుల్ ఇండియా రెండో స్థానంలో, ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మూడో స్థానంలో నిల్చాయి. ఇక అత్యంత ఆకర్షణీయమైన టాప్ 10 ఎంప్లాయర్ బ్రాండ్స్ 2025 జాబితాలో శాంసంగ్ ఇండియా (4), జేపీమోర్గాన్ చేజ్ (5), ఐబీఎం (6), విప్రో (7), రిలయన్స్ ఇండస్ట్రీస్ (8), డెల్ టెక్నాలజీస్ (9), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (10) సంస్థలు ఉన్నాయి. జాబితాలో ఎస్‌బీఐ ఏకైక భారతీయ బహుళజాతి ప్రభుత్వ రంగ బ్యాంకు కావడం గమనార్హం.
‘సంప్రదాయ ఉద్యోగాలతో నేటి ఉద్యోగులు సంతృప్తిపడటం లేదని 2025 నివేదికతో తేటతెల్లమైంది. వారు నిర్దిష్ట లక్ష్యం, సమానత్వం, అర్థవంతమైన వృద్ధి, వర్క్–లైఫ్ మధ్య సమతుల్యతను కోరుకుంటున్నారు’ అని ర్యాండ్‌స్టాడ్ ఇండియా ఎండీ విశ్వనాథ్ పీఎస్ తెలిపారు. ఉద్యోగాలు మారిపోవాలనే ధోరణి కూడా యువ ఉద్యోగుల్లో ఎక్కువగా కనిపిస్తుండటమనేది కంపెనీలకు మేల్కొలుపులాంటిదని ఆయన చెప్పారు.
నివేదికలో మరిన్ని విశేషాలు..
⇒ 34 మార్కెట్లలో 1,70,000 మంది ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. వీరిలో 3,500 మంది భారత్‌కి చెందిన వారు ఉన్నారు.
⇒ జీతానికి మించిన ప్రయోజనాలను ఉద్యోగులు కోరుకుంటున్నారు. ఇటు వ్యక్తిగతంగా, అటు వృత్తిగతంగా ఎదిగేందుకు ఉపయోగపడేలా కంపెనీల్లో వాతావరణం ఉండాలని ఆశిస్తున్నారు.
⇒ 2025 ప్రథమార్ధంలో 47% మంది భారతీయ ఉద్యోగులు, ఉద్యోగం మారాలని ప్రణాళికలు వేసుకున్నారు. జెన్ జెడ్ (51%), మిలీనియల్స్‌లో (50%) ఈ ఆలోచన బలంగా ఉంది.
⇒ ఏఐ వినియోగం భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం భారతీయ ఉద్యోగుల్లో 61 శాతం మంది దీన్ని తరచుగా ఉపయోగిస్తున్నారు. మిలీనియల్స్ అత్యంత యాక్టివ్ యూజర్లుగా ఉంటున్నారు. గతేడాదితో పోలిస్తే వీరి సంఖ్య 13 శాతం పెరిగింది. ఏఐ ప్రభావాలపై అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కృత్రిమ మేథ తమ పనిపై గణనీయంగా ప్రభావం చూపుతోందని 38 శాతం మంది ఉద్యోగుల్లో అభిప్రాయం నెలకొంది.