కోవిడ్‌-19లోనూ ఈ కంపెనీల జోరు

Tata consumer products- Ashoka builcon jumps on Q1 results - Sakshi

క్యూ1లో పటిష్ట ఫలితాలు- టాటా కన్జూమర్‌ 4 శాతం ప్లస్‌

సరికొత్త గరిష్టానికి షేరు- ఆరు వారాల్లో 41 శాతం జూమ్‌

ఆర్డర్‌బుక్‌ దన్ను- అశోకా బిల్డ్‌కాన్‌ షేరు 7.5 శాతం అప్‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర  ఫలితాలు సాధించడంతో ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం టాటా కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌ కౌంటర్‌కు భారీ డిమాండ్‌ కొనసాగుతోంది. మరోపక్క ఇదే కాలంలో రివర్స్‌ టర్న్‌అరౌండ్‌ ఫలితాలు ప్రకటించినప్పటికీ మౌలిక సదుపాయాల కంపెనీ అశోకా బిల్డ్‌కాన్‌ కౌంటర్‌ సైతం వెలుగులోకి వచ్చింది. కోవిడ్‌-19 కట్టడికి లాక్‌డవుల అమలు కారణంగా పనితీరు నిరాశపరచినప్పటికీ భవిష్యత్‌లో మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్న అంచనాలు ఈ కౌంటర్‌కు జోష్‌నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. వెరసి ఒడిదొడుకుల మార్కెట్లోనూ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ఈ రెండు కౌంటర్లూ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం..

టాటా కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌
జులై 1 నుంచీ ర్యాలీ బాటలో సాగుతున్న టాటా కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌ షేరు తాజాగా 4 శాతం జంప్‌చేసి రూ. 538 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 543 వరకూ ఎగసింది. ఇది చరిత్రాత్మక గరిష్టంకాగా.. గత ఆరు వారాల్లో ఈ షేరు 41 శాతం ర్యాలీ చేయడం విశేషం. తద్వారా తాజాగా ఎఫ్‌ఎంసీజీ కంపెనీ మారికోను మార్కెట్‌ విలువలో వెనక్కి నెట్టింది. టాటా కన్జూమర్‌ మార్కెట్‌ విలువ తాజాగా రూ. 49,427 కోట్లను తాకగా..  మారికో మార్కెట్‌ క్యాప్‌ రూ. 47,253 కోట్లుగా నమోదైంది. కాగా.. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్‌- జూన్‌)లో టాటా కన్జూమర్‌ ప్రొడక్ట్స్‌ నికర లాభం 82 శాతం జంప్‌చేసి రూ. 345 కోట్లను అధిగమించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 13 శాతం పుంజుకుని రూ. 2714 కోట్లకు చేరింది.

అశోకా బిల్డ్‌కాన్‌
స్టాండెలోన్‌ ప్రాతిపదికన ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్‌- జూన్‌)లో అశోకా బిల్డ్‌కాన్‌ రూ. 69 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఇది 7 శాతం వృద్ధికాగా.. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఇదే కాలంలో రూ. 38 కోట్ల నికర నష్టం ప్రకటించింది. గతేడాది(2019-20) క్యూ1లో రూ. 147 కోట్ల నికర లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 761 కోట్లకు చేరింది. అయితే ప్రస్తుత ఆర్డర్‌బుక్‌ విలువ రూ. 8,617 కోట్లను తాకినట్లు కంపెనీ వెల్లడించింది. కోవిడ్‌-19 కారణంగా క్యూ1లో కార్యకలాపాలు కుంటుపడినప్పటికీ ఇకపై మెరుగైన పనితీరు చూపగలమన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో అశోకా బిల్డ్‌కాన్‌ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 7.5 శాతం దూసుకెళ్లి రూ. 65 వద్ద ట్రేడవుతోంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top