రతన్‌ టాటా-నీరా రాడియా సంభాషణల టేపు లీక్‌! ఎనిమిదేళ్ల తర్వాత సుప్రీం విచారణ

Supreme Court Hearing On Tata Radia Tapes Leak Petition - Sakshi

ఢిల్లీ: నీరా రాడియా ఆడియో టేపుల లీకేజీ వ్యవహారంలో.. ప్రముఖ ఇండస్ట్రీలిస్ట్‌ రతన్‌ టాటా వేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఎనిమిదేళ్ల తర్వాత నేడు విచారణ చేపట్టనుంది. 2010లో మాజీ కార్పొరేట్‌ వ్యవహారాల ప్రతినిధి నీరా రాడియా-టాటాల మధ్య జరిగిన సంభాషణలను మీడియా ప్రసారం చేయగా.. అది తన గోప్యత హక్కుకు భంగం కలిగించేదని రతన్‌ టాటా సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

నీరా రాడియా తన వైష్ణవి కార్పొరేట్ కమ్యూనికేషన్ సంస్థ ద్వారా ప్రముఖులతో ఫోన్‌ సంభాషణలు జరిపారు. అయితే.. పన్నులకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా ఆమె ఫోన్‌ సంభాషణలను 2008, 2009 ట్యాప్‌చేసి.. రికార్డు చేశారు అధికారులు. ఇందులో ప్రముఖ వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, ఇతర ప్రముఖులు సైతం ఉన్నారు. 

అయితే 2010లో రతన్‌ టాటా-రాడియా మధ్య జరిగిన ఆడియో సంభాషణను మీడియా ప్రసారం చేసింది.  దీంతో ఈ టేపుల విడుదల.. తన గోప్యతా హక్కును ఉల్లంఘించడమేనని వాదిస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు 2011లో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. 2012 ఆగస్ట్‌ నెలలో రతన్ టాటా 'రాడియా టేపులు' ఎలా బయటపడ్డాయో వివరిస్తూ ప్రభుత్వం సమర్పించిన నివేదిక కాపీని తనకు ఇవ్వాలంటూ సుప్రీం కోర్టును అభ్యర్థించారు. ఇక రతన్‌ టాటా పిటిషన్‌పై చివరిసారిగా 2014లో సుప్రీంకోర్టు విచారణ జరిపింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top