చెక్‌ బౌన్స్‌ కేసుల సత్వర విచారణపై సుప్రీం దృష్టి

Supreme Court Asks Centre if it can Set Up Additional Courts - Sakshi

అదనపు కోర్టుల ఏర్పాటుపై స్పందనకు కేంద్రానికి ఆదేశం

న్యూఢిల్లీ: చెక్‌ బౌన్స్‌ కేసులు కోర్టుల్లో భారీగా పేరుకుపోతున్న నేపథ్యంలో ఈ కేసుల సత్వర పరిష్కారంపై సుప్రీంకోర్టు దృష్టి సారించింది. నెగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ యాక్ట్‌ (ఎన్‌ఐ యాక్ట్‌) కేసులను సత్వరం పరిష్కరించడానికి అదనపు కోర్టుల ఏర్పాటుపై అభిప్రాయాన్ని తెలియజేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. దేశవ్యాప్తంగా వివిధ కోర్టుల్లో దాదాపు 35 లక్షల ఎన్‌ఐ యాక్ట్‌ కేసులు (జిల్లా కోర్టుల్లో పెండింగులో ఉన్న మొత్తం క్రిమినల్‌ కేసుల్లో 15 శాతం పైగా) పెండింగులో ఉన్న నేపథ్యంలో చీఫ్‌ జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే, న్యాయమూర్తులు ఎల్‌ నాగేశ్వరరావు, ఆర్‌. రవీంద్ర భట్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం గురువారం ఈ ఆదేశాలు ఇచ్చింది.

247వ అధికరణ కింద  (అదనపు కోర్టుల ఏర్పాటుకు పార్లమెంటుకు అధికారాన్ని ఇస్తున్న అధికరణం) ఎన్‌ఐ యాక్ట్‌ కేసుల సత్వర పరిష్కారానికి అదనపు కోర్టుల ఏర్పాటుపై కేంద్రం అభిప్రాయాన్ని వచ్చే వారంలో తెలియజేయాలని ధర్మాసనం అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ విక్రమ్‌జిత్‌ బెనర్జీని ఆదేశించింది. చెక్‌బౌన్స్‌లు వివిధ కోర్టుల్లో భారీగా పేరుకుపోతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు సుమోటోగా ఈ కేసు గత ఏడాది విచారణకు చేపట్టింది.  2005కు ముందు ఒక కేసు విచారణ సందర్భంగా ఈ సమస్య (కోర్టుల్లో చెక్‌ బౌన్స్‌ కేసుల దీర్ఘకాలిక విచారణ అంశం)  అత్యున్నత న్యాయస్థానం దృష్టికి వచ్చింది. ఈ అంశంపై ధర్మాసనానికి సలహాలు ఇవ్వడానికి సీనియర్‌ అడ్వొకేట్‌ సిద్ధార్థ్‌ లుథ్రా, అడ్వొకేట్‌ కే. పరమేశ్వర్‌లు నియమితులయ్యారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top