
వైస్ చైర్మన్‌గా విశాల్ కపూర్
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) నూతన చైర్మన్‌గా నిప్పన్ ఇండియా లైఫ్ అస్సెట్ మేనేజ్‌మెంట్ (ఏఎంసీ) సీఈవో అయిన సందీప్ సిక్కా ఎంపికయ్యారు. వైస్ చైర్మన్‌గా బంధన్ ఏఎంసీ సీఈవో విశాల్ కపూర్ ఎన్నికైనట్టు యాంఫి ప్రకటించింది. యాంఫి 30 వార్షిక సమావేశంలో వీరిని ఎన్నుకోగా, వెంటనే బాధ్యతలు చేపటినట్టు తెలిపింది. సందీప్ సిక్కా యాంఫి చైర్మన్ బాధ్యతలు చేపట్టడం ఇంది రెండోసారి.
2013 నుంచి 2015 మధ్య కాలంలోనూ రెండేళ్ల పాటు ఆయన సేవలు అందించారు. దేశ మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ ఆస్తులు రూ.75 లక్షల కోట్లకు దాటిపోవడం తెలిసిందే. ఈ తరుణంలో ఎన్నికైన నూతన నాయకత్వం.. పరిశ్రమను మరింత వృద్ధి దశలోకి తీసుకెళ్లాలన్న లక్ష్యాన్ని పెట్టుకుంది. దేశంలోని మరిన్ని ప్రాంతాలకు మ్యూచువల్ ఫండ్స్‌ను విస్తరించడానికి ప్రాధాన్యం ఇస్తానని సందీప్ సిక్కా తెలిపారు. మరింత పారదర్శకత ద్వారా ఇన్వెస్టర్ల విశ్వాసం పొందుతామని.. సెబీ, విధాన నిర్ణేతలతో మరింత సమన్వయం చేసుకుని అందరికీ ఆర్థిక సేవల చేరువకు కృషి చేస్తామని చెప్పారు.