చక్కెర షేర్లు.. తియ్యటి ర్యాలీ

Sugar sector growth likely to improve in Q4FY21 says UNICA - Sakshi

ఏడాదిలో ఎన్నో రెట్ల లాభాలు

గత మూడు నెలల్లో భారీ పెరుగుదల

బ్రెజిల్‌లో తగ్గిన ఉత్పత్తి ప్రభావం

విధానాల రూపంలో ప్రభుత్వ మద్దతు

న్యూఢిల్లీ: చక్కెర కంపెనీల షేర్లు ఇన్వెస్టర్లకు తీపి లాభాలను పంచుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే ఈ స్టాక్స్‌ మంచి ర్యాలీ చేయగా.. ఇక ముందూ లాభాలను ఇచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బ్రెజిల్‌లో చక్కెర సాగు ఆశాజనకంగా లేనందున ధరలు పెరిగి, భారత కంపెనీలకు కలిసొస్తుందని భావిస్తున్నారు. బ్రెజిల్‌లో ఏప్రిల్‌ నెలలో పంచదార ఉత్పత్తి దాదాపు 35 శాతం వరకూ తగ్గింది. ఈ మేరకు భారత షుగర్‌ కంపెనీలకు కలిసొస్తుందని అంచనా వేస్తున్నారు. ‘‘బ్రెజిల్‌ దక్షిణాది ప్రాంతంలో చక్కెర దిగుబడి ఏప్రిల్‌ నెల మొదటి అర్ధ భాగంలో 6,24,000 టన్నులు. అంతక్రితం ఏడాది ఏప్రిల్‌లో ఇదే కాలంలో ఉత్పత్తి 9,71,000 టన్నులుగా ఉంది. 2020లో ఇదే కాలంతో పోల్చి చూస్తే చెరకు క్రషింగ్‌ 30 శాతం తగ్గి 15.6 మిలియన్‌ టన్నులుగా ఉంది’’ అని చక్కెర ఉత్పత్తిదారుల సంఘం యూనికా పేర్కొంది. అదే సమయంలో భారత్‌లో మాత్రం పంచదార ఉత్పత్తి 2020 అక్టోబర్‌ – 2021 సెప్టెంబర్‌ సీజన్‌లో 41 లక్షల టన్నుల మేర పెరగడం గమనార్హం.  

అన్ని షేర్లదీ పరుగే..: ఆంధ్రా షుగర్స్, ఈఐడీ ప్యారీ, బలరామ్‌పూర్‌ చినీ, ధంపూర్‌ షుగర్, దాల్మియా, అవధ్‌ షుగర్‌.. ఇవన్నీ కూడా గత ఏడాది కాలంలో అద్భుతమైన రాబడులను ఇచ్చాయి. ప్రధానంగా గత మూడు నెలల్లోనే 50–100 శాతం మధ్య ర్యాలీ చేసి నూతన గరిష్టాలకు చేరాయి.

సరఫరా కఠినంగా మారొచ్చు..
పంచదార ఉత్పత్తికి ప్రపంచంలో బ్రెజిల్‌ అతిపెద్ద మార్కెట్‌. ఇక్కడి ఉత్పత్తి పరిస్థితులు భారత్‌ కంపెనీల లాభాలను నిర్ణయించగలవు. బ్రెజిల్‌లో ఇప్పటికే చెరకు సాగు సీజన్‌ నడుస్తోంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు దిగుబడి తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. రుతుపవనాలు సానుకూలించకపోవడంతో సాగు తగ్గిందని.. దీనివల్ల దిగుబడితోపాటు నాణ్యత కూడా క్షీణించొచ్చని అంచనా. దీనికితోడు థాయిలాండ్, ఈయూ సైతం చక్కెర ఉత్పత్తిని పెంచకపోవచ్చని.. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్‌–సరఫరా పరిస్థితులు సానుకూలంగా ఉండకపోవచ్చని ఎలారా సెక్యూరిటీస్‌ తెలిపింది.  

సైక్లికల్‌ కాదు..
భారత్‌లో షుగర్‌ పరిశ్రమ ధరల పరంగా ఇక ఎంత మాత్రం సైక్లికల్‌ కాబోదని (హెచ్చుతగ్గులు) జేఎం ఫైనాన్షియల్‌ పేర్కొంది. పాక్షిక నియంత్రణల నుంచి కూడా బయటకు రావచ్చని భావిస్తున్నట్టు తెలిపింది. పెట్రోల్‌లో ఇథనాల్‌ మిశ్రమం పట్ల ప్రభుత్వం చూపిస్తున్న శ్రద్ధ, చక్కెర రైతులకు చెల్లింపులు సకాలంలో అందేలా చూడాలన్న ఉద్దేశం ఈ రంగానికి ఎంతో మేలు చేస్తుందని అంచనా వేస్తోంది. చక్కెరకు మద్దతు ధరలు, ఎగుమతి సబ్సిడీలు, ఇథనాల్‌ రూపంలో మద్దతు వంటి చర్యలు ఈ రంగంలోని కంపెనీలు నిలదొక్కుకునేలా చేస్తాయని పేర్కొంది. ఫలితంగా ఈ రంగంలోని పటిష్టమైన కంపెనీలు మరింత లాభాలు, నగదు ప్రవాహాలను చూస్తాయని జేఎం ఫైనాన్షియల్‌ అంచనా వేసింది.

షేర్ల గమనం
కంపెనీ                      ప్రస్తుత ధర                   3 నెలల్లో                ఏడాదిలో
                             (రూ.లలో)                   పెరుగుదల(%)             పెరుగుదల(%)
అవధ్‌ షుగర్‌               306                               60                          110
దాల్మియా భారత్‌          318                               98                          364
ద్వారికేష్‌ షుగర్‌             56                               75                           200
బలరామ్‌పూర్‌ చినీ        303                              68                           190
ధంపూర్‌ షుగర్‌             318                             78                            206

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top