భారతదేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి, వనరులను సమర్థవంతంగా పునర్నిర్మించడానికి మెరుగైన బాండ్ మార్కెట్ అభివృద్ధి అత్యవసరమని 15వ ఆర్థిక సంఘం మాజీ ఛైర్మన్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ ప్రెసిడెంట్ ఎన్‌కే సింగ్ స్పష్టం చేశారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన, దేశ వృద్ధి పథంలో బ్యాంకింగ్ రంగం పోషించాల్సిన పాత్ర, మౌలిక సదుపాయాల రంగానికి అవసరమైన నిధుల సమీకరణపై విశ్లేషణ చేశారు.
మౌలిక సదుపాయాల రంగానికి ఊతం
ప్రస్తుతం మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు అవసరమైన భారీ నిధుల కోసం ప్రధానంగా వాణిజ్య బ్యాంకులపైనే భారం పడుతున్నారు. దీనివల్ల బ్యాంకుల వద్ద ఉండాల్సిన నగదు నిల్వలు దీర్ఘకాలిక ప్రాజెక్టులలో చిక్కుకుపోతున్నాయి. మెరుగైన బాండ్ మార్కెట్ అందుబాటులోకి వస్తే మౌలిక సదుపాయాల రంగానికి అవసరమైన దీర్ఘకాలిక ఫైనాన్సింగ్ అక్కడి నుంచే లభిస్తుందని సింగ్ చెప్పారు. దీనివల్ల వాణిజ్య బ్యాంకులు తమ వనరులను ఇతర ప్రాధాన్యత కలిగిన బ్యాంకింగ్ కార్యకలాపాలకు, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రుణాలకు మళ్లించే వీలుంటుందన్నారు.
‘మౌలిక సదుపాయాలకు నిధులు సమకూర్చడానికి బాండ్ మార్కెట్‌ను ఉపయోగించుకోవాలి. అప్పుడే వాణిజ్య బ్యాంకులు తమ ప్రధాన బ్యాంకింగ్ రుణ కార్యకలాపాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించగలవు’ అని ఎన్‌కే సింగ్ పేర్కొన్నారు.
బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలు
కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి ప్రకటించిన కొత్త బ్యాంకింగ్ కమిటీ ఏర్పాటును సింగ్ స్వాగతించారు. భారత ఆర్థిక వ్యవస్థలో బ్యాంకులు కేవలం రుణదాతలుగానే కాకుండా ఆర్థిక మధ్యవర్తులుగా కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ‘బ్యాంకింగ్ రంగంలో సంస్కరణల ద్వారా పెట్టుబడి వ్యయాన్ని తగ్గించి, సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అమల్లో ఉన్న కొన్ని పాత నిబంధనల వల్ల భారీగా నిధులు స్తంభించిపోతున్నాయి. వీటిని కమిటీ పునసమీక్షించాలి’ అని సూచించారు.
ఇదీ చదవండి: కొలువు తీరిన కొంత కాలానికే ఇంటికి!


