
భారత ఈక్విటీలు ఈ రోజు క్యూ1 ఫలితాలతో నడిచాయి. 2025 జూన్ 30తో ముగిసిన తొలి త్రైమాసికం ఫలితాలను విడుదల చేసిన తర్వాత సెన్సెక్స్‌లో ఎల్ అండ్ టీ, ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్స్ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. దీనికి తోడు భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై సందిగ్ధత, అమెరికా ఫెడరల్ రిజర్వ్ ద్రవ్యపరపతి విధాన నిర్ణయం ఇన్వెస్టర్లను పక్కకు నెట్టి స్టాక్ మార్కెట్లలో ఒడిదుడుకులకు లోనయ్యాయి.
సెషన్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 143.9 పాయింట్లు (0.18 శాతం) పెరిగి 81,481.86 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 34 పాయింట్లు లాభపడి 24,855.05 వద్ద ముగిసింది. అదేసమయంలో ఎల్అండ్‌టీ, సన్ ఫార్మా, ఎన్టీపీసీ, మారుతీ సుజుకీ, భారతీ ఎయిర్‌టెల్, ట్రెంట్ షేర్లు లాభాల్లో ముగిశాయి. టాటా మోటార్స్, బజాజ్ ఫిన్సర్వ్, కొటక్ మహీంద్రా బ్యాంక్, పవర్ గ్రిడ్, హెచ్‌యూఎల్ షేర్లు నష్టాల్లో ముగిశాయి.
నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.07 శాతం, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.52 శాతం చొప్పున నష్టపోయాయి. నిఫ్టీ ఐటీ 0.31 శాతం, నిఫ్టీ ఫార్మా 0.01 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.24 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ రియల్టీ (0.96 శాతం), నిఫ్టీ ఆటో (0.6 శాతం) అత్యధికంగా నష్టపోయాయి. మార్కెట్ ఒడిదుడుకుల అంచనాలను కొలిచే ఇండియా వీఐఎక్స్ 2.77 శాతం నష్టంతో 11.21 వద్ద ముగిసింది.