దేశీ సూచీల నేల చూపులు.. లక్షల కోట్ల సంపద ఆవిరి

Stock Market Indices Severely affected and Sensex plunges Below 58k - Sakshi

ముంబై: స్టాక్‌ మార్కెట్‌పై బేర్‌ పంజా విసిరింది. వరుసగా ఐదో రోజు స్టాక్‌ మార్కెట్‌లో ఇన్వెస్టర్లు భారీ నష్టాలు చవి చూస్తున్నారు. స్మాల్‌, మీడియం, లార్జ్‌ క్యాప్‌ అని తేడా లేకుండా అన్ని విభాగాల్లో షేర్లు నష్టపోతున్నాయి. రష్యా, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు, ఒమిక్రాన్‌ వ్యాప్తి, ఫెడ్‌రల్‌ బ్యాంకు వడ్డీ రేట్లు తదితర అంశాలతో అంతర్జాతీయ మార్కెట్‌లో కుదుపుకు లోనవుతున్నాయి. ఆ ప్రభావం ఇండియాలోని సెన్సెక్స్‌, నిఫ్టీ సూచీలపై స్పష్టంగా కనిపిస్తోంది. 

వెయ్యికి పైగా పాయింట్లు కోత
బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఈ రోజు సగం సెషన్‌ పూర్తయ్యే సరికే వెయ్యికి పైగా పాయింట్లను కోల్పోయింది. మధ్యాహ్నం 12:45 గంటల సమయంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 1182 పాయింట​‍్లు నష్టపోయి 57,854 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది.  లార్జ్‌ క్యాప్‌ కంపెనీల షేర్ల ధరలో 2 శాతం క్షీణత నమోదు అయ్యింది. మీడియం, స్మాల్‌ కేటగిరిలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మరోవైపు నిఫ్టీ 370 పాయింట్లు నష్టపోయి 17,246 దగ్గర కొట్టుమిట​‍్టాడుతోంది. సరిగ్గా వారం రోజుల వ్యవధిలో నిఫ్టీ సుమారు 1100  పాయింట్లు నష్టపోయింది. సెన్సెక్స్‌ 2500కి వరకు పాయింట్లను కోల్పోయింది. గడిచిన వారం రోజుల్లో 12 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సంపద హుష్‌కాకి అయ్యింది.

ర్యాలీలో వచ్చిందంతా
గతేడాది తొలి త్రైమాసికంలో సెన్సెక్స్‌ 50వేల మార్క్‌ని క్రాస్‌ చేసింది. అప్పటి నుంచి నవంబరు మధ్య వరకు బుల్‌ ర్యాలీ కొనసాగింది. దీంతో సెన్సెక్స్‌ ఆరు నెలల కాలంలోనే ఏకంగా పది వేల పాయింట్లు లాభపడింది. నిఫ్టీ సైతం 16 వేల నుంచి 19 వేల వరకు చేరుకుంది. ఆ బుల్‌ర్యాలీలో విపరీతంగా లాభపడిన షేర్ల ధరలు ఇప్పుడు కోతకు గురవుతున్నాయి. నవంబరు మధ్య నుంచి కరెక‌్షన్‌ మొదలవగా జనవరిలో ఒమిక్రాన్‌, రష్యా అమెరికా ఉద్రిక్తతలు మార్కెట్‌పై పను ప్రభావం చూపుతున్నాయి. ఐపీవో సందర్భంగా ఆసక్తి రేపిన జోమాటో, పేటీఎం షేర్ల ధరలు కనిష్ట స్థాయిల వద్ద నమోదు అవుతున్నాయి.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top