
ఇంకా స్పెక్ట్రమ్, గ్రౌండ్ స్టేషన్లు పెండింగ్
ఎలాన్ మస్క్‌కు చెందిన శాటిలైట్ ఇంటర్నెట్ సంస్థ స్టార్‌లింక్ భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించడానికి అన్ని అడ్డంకులను అధిగమించింది. భారతదేశ అంతరిక్ష నియంత్రణ సంస్థ ఇన్-స్పేస్ (ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్) ఈ సంస్థకు అనుమతులు ఇచ్చింది. దాంతో దేశంలో స్టార్‌లింక్ ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవలను అందించేందుకు అడ్డంకులు తొలగినట్లయింది.
2022 నుంచి భారతదేశంలో స్టార్‌లింక్ తన సర్వీసులు ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. గత నెలలో టెలికమ్యూనికేషన్స్ విభాగం (డాట్) నుంచి గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ బై శాటిలైట్ (జీఎంపీసీఎస్) లైసెన్స్ కూడా పొందింది. ఇప్పుడు, ఇన్-స్పేస్ ఆమోదంతో స్టార్‌లింక్ భారత్‌లోని కంపెనీ ప్రణాళికలకు లైన్ క్లియర్ అయింది.
ఐఎన్-స్పేస్ స్టార్‌లింక్ తన జెన్ 1 ఉపగ్రహ సమూహాన్ని భారతదేశంపై నిలిపేందుకు అనుమతిస్తుంది. ఈ అనుమతులు జులై 7, 2030 వరకు చెల్లుబాటు అవుతాయని కొన్ని సంస్థలు తెలిపాయి. ఈ ఆమోదంలో భాగంగా IN-SPACe యూజర్లు ఉపయోచించేందుకు నిర్దిష్ట ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌లను కూడా ఖరారు చేస్తుంది. గేట్ వే బీమ్‌ల కోసం స్టార్‌లింక్ 27.5–29.1 గిగాహెర్జ్ట్, 29.5–30 గిగాహెర్జ్ట్ అప్‌లింక్ బ్యాండ్‌లను, 17.8–18.6 గిగాహెర్జ్ట్, 18.8–19.3 గిగాహెర్జ్ట్ డౌన్‌లింక్ బ్యాండ్‌లను ఉపయోగించే అవకాశం ఉందని సమాచారం. సరళంగా చెప్పాలంటే స్టార్‌లింక్ దాని వినియోగదారులు, గ్రౌండ్ స్టేషన్ల నుంచి భారతదేశం అంతటా ఇంటర్నెట్ డేటాను పంపించేందుకు నిర్దిష్ట ఉపగ్రహ సంకేతాలను ఉపయోగించేలా అధికారిక అనుమతులు పొందింది.
ఇదీ చదవండి: పిల్లలూ.. బ్యాంకు తలుపు తట్టండి!
గేట్‌వే స్టేషన్లు నిర్మాణం..
ఇదిలాఉండగా, ఈ ఆమోదం పొందడం వల్ల స్టార్‌లింక్ వెంటనే భారత్‌లో సర్వీసులు ప్రారంభిస్తుందని కాదు. సంస్థ ఇంకా భారత ప్రభుత్వం నుంచి స్పెక్ట్రమ్‌ను పొందాల్సి ఉంటుంది. గ్రౌండ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం, భద్రతా అవసరాలను తీర్చడానికి పరీక్షలను పూర్తి చేయాల్సి ఉంది. కాబట్టి దేశవ్యాప్తంగా కనీసం మూడు గేట్‌వే స్టేషన్లను నిర్మించాలని కంపెనీ యోచిస్తోంది. ఈ వ్యవస్థ పూర్తయితే స్టార్‌లింక్ కూడా త్వరలో ట్రయల్స్ ప్రారంభించే అవకాశం ఉంది. కంపెనీ భారతదేశ సాంకేతిక, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉందని నిరూపించడానికి టెలికమ్యూనికేషన్స్ విభాగం ట్రయల్ స్పెక్ట్రమ్‌ను మంజూరు చేయబోతున్నట్లు సమాచారం.