స్టార్‌లింక్‌కు లైసెన్స్‌ వచ్చేసింది... | Elon Musk's Starlink gets licence for satcom services in India | Sakshi
Sakshi News home page

స్టార్‌లింక్‌కు లైసెన్స్‌ వచ్చేసింది.. భారత్‌లో ఇక కొత్త ఇంటర్నెట్‌ సేవలు

Jun 6 2025 6:04 PM | Updated on Jun 6 2025 6:18 PM

Elon Musk's Starlink gets licence for satcom services in India

భారత్‌లో శాటిలైట్‌  ద్వారా ఇంటర్నెట్‌ సేవలు అందించేందుకు ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్ లింక్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. మార్కెట్ ను చేజిక్కించుకోవాలన్న శాటిలైట్ కంపెనీ కలలకు ఊతమిచ్చేలా స్టార్ లింక్‌కు డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ నుంచి కీలక లైసెన్స్ లభించింది.

భారత టెలికాం మంత్రిత్వ శాఖ నుండి లైసెన్స​ పొందిన స్టార్ లింక్ దేశంలోని 90 కోట్ల ఇంటర్నెట్ వినియోగదారులను అందిపుచ్చుకునే లక్ష్యంతో భారతదేశంలో వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించడానికి సిద్ధంగా ఉందని వార్తా సంస్థలు రాయిటర్స్, బ్లూమ్‌బర్గ్ నివేదించాయి. కాగా స్టార్ లింక్ కు నిజంగానే లైసెన్స్ లభించిందని, దరఖాస్తు చేసుకున్న 15-20 రోజుల్లో ట్రయల్ స్పెక్ట్రమ్ మంజూరు చేస్తామని డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ వర్గాలు ధ్రువీకరించినట్లుగా పీటీఐ వార్తసంస్థ కూడా పేర్కొంది.

దేశంలో సేవలను అందించడానికి యూటెల్‌ శాట్‌కు చెందిన వన్‌వెబ్, రిలయన్స్ జియో ఇలాంటి దరఖాస్తులను ఆమోదించిన భారత టెలికమ్యూనికేషన్ల విభాగం నుండి లైసెన్స్ పొందిన మూడవ సంస్థ స్టార్‌లింక్. భారతదేశంలో వాణిజ్య కార్యకలాపాలు సాగించడానికి లైసెన్సుల కోసం స్టార్‌ లింక్ 2022 నుండి ఎదురుచూస్తోంది. కాని జాతీయ భద్రతా ఆందోళనలతో సహా కారణాల వల్ల జాప్యం జరిగింది. అమెజాన్ కు చెందిన కుయిపర్ ఇండియా లైసెన్స్ కోసం ఇప్పటికీ ఎదురుచూస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా.. స్టార్‌లింక్ సేవలు చాలా ఖరీదైనవిగా ఉన్నాయి. యునైటెడ్ స్టేట్స్‌లో, రెసిడెన్షియల్ లైట్ ప్లాన్ నెలకు దాదాపు 80 డాలర్లు (రూ. 6,800). అయితే కస్టమర్‌లు 349 డాలర్లతో (రూ. 29,700) వన్ టైమ్ రుసుముతో స్టార్‌లింక్ స్టాండర్డ్ కిట్‌ను కూడా కొనుగోలు చేయాలి. అయితే భారతదేశంలో స్టార్‌లింక్ సర్వీస్ ప్రారంభమైన తరువాత.. దీని ఛార్జీలు నెలకు 10 డాలర్ల (రూ.850) వరకు ఉండే అవకాశం ఉంది. పరిచయ ఆఫర్లలో  భాగంగా సంస్థ అపరిమిత డేటాను అందించే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement