
దేశీయంగా వేరబుల్ మార్కెట్ వరుసగా అయిదో త్రైమాసికంలోనూ నెమ్మదించింది. స్మార్ట్‌వాచీలు, ట్రూ వైర్‌లెస్ స్టీరియో ఇయర్‌బడ్స్ విక్రయాలు తగ్గడంతో ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో అమ్మకాలు 9.4 శాతం క్షీణించి 2.67 కోట్లకు పరిమితమయ్యాయి. మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఐడీసీ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
దీని ప్రకారం సరఫరా తగ్గినప్పటికీ వేరబుల్స్ సగటు విక్రయ ధర (ఏఎస్‌పీ) ఒక మోస్తరుగా 2.2 శాతం మేర పెరిగి 19.2 డాలర్లకు (సుమారు రూ. 1,700)కు చేరింది. 2025 ప్రథమార్థంలో వేరబుల్ డివైజ్ మార్కెట్ వార్షికంగా 6.3 శాతం తగ్గి 5.16 కోట్ల యూనిట్లకు పరిమితమైంది. ఏఎస్‌పీ పెద్దగా మార్పులు లేకుండా 18.7 డాలర్ల (సుమారు రూ. 1,630) స్థాయిలో కొనసాగింది. స్మార్ట్ రింగ్స్, స్మార్ట్ గ్లాసెస్, స్మార్ట్ రిస్ట్‌బ్యాండ్స్‌లాంటి కొత్త రకం వేరబుల్స్‌కి డిమాండ్ పెరిగింది.
మరిన్ని ముఖ్యాంశాలు..
అమ్మకాలు 4.8 శాతం తగ్గినప్పటికీ వేరబుల్స్ మార్కెట్లో 28 శాతం వాటాతో ఇమేజిన్ మార్కెటింగ్ (బోట్ బ్రాండ్) అగ్రస్థానంలో ఉంది.
13.1 శాతం వాటాతో నాయిస్ రెండో స్థానంలో నిల్చింది. విక్రయాలు 8.6 శాతం తగ్గాయి.
గోబోల్ట్ (గతంలో బోల్ట్) అమ్మకాలు 21.8 శాతం పెరిగాయి. 10.9 శాతం మార్కెట్ వాటా ఉంది. ఒప్పో, వన్‌ప్లస్ వాటా చెరి 8 శాతంగా, రియల్‌మి వాటా 6.5 శాతంగా ఉంది.
ఇక స్మార్ట్‌వాచీల అమ్మకాలు వరుసగా ఆరో త్రైమాసికంలోనూ క్షీణించాయి. జూన్ క్వార్టర్‌లో 28.4 శాతం తగ్గి 66 లక్షల యూనిట్లకు పరిమితమయ్యాయి. మొత్తం వేరబుల్స్ మార్కెట్లో వీటి వాటా 31.5 శాతం నుంచి 24.9 శాతానికి తగ్గింది. బౌల్ట్ మినహా మిగతా అన్ని బ్రాండ్ల (నాయిస్, బోట్, టైటాన్, ఫైర్ బోల్ట్) స్మార్ట్‌వాచీల అమ్మకాలు తగ్గాయి.
2022, 2023లో భారీగా వృద్ధి చెందిన స్మార్ట్‌వాచీల మార్కెట్ ప్రస్తుతం కన్సాలిడేట్ అవుతోంది.
ఇయర్‌వేర్ కేటగిరీ స్వల్పంగ్ 1.2 శాతం తగ్గి 1.99 కోట్ల యూనిట్లకు పరిమితం అయింది. ట్రూలీ వైర్‌లెస్ స్టీరియో (టీడబ్ల్యూఎస్) సెగ్మెంట్ అమ్మకాలు 1.2 శాతం తగ్గినా, 71.2 శాతం వాటాతో అగ్రస్థానంలో కొనసాగింది. నెక్‌బ్యాండ్ స్టయిల్ ఇయర్‌వేర్ మరింతగా 16.1 శాతం మేర పడిపోయింది. ఓవర్–ది–ఇయర్ సెగ్మెంట్ అమ్మకాలు 97.4 శాతం ఎగిసి 15 లక్షల యూనిట్లకు పెరిగాయి.
టీడబ్ల్యూఎస్ విభాగంలో 31.9 శాతం వాటాతో బోట్ అగ్రస్థానంలో, 14.9 శాతం వాటాతో బోల్ట్ రెండో స్థానంలో ఉన్నాయి. బోట్ అమ్మకాలు 6.9 శాతం తగ్గాయి.
స్మార్ట్ రింగ్స్ విక్రయాలు 2.8 శాతం పెరిగి 75,000కు చేరాయి. అ్రల్టాహ్యూమన్, గేబిట్, ఆబో సంస్థలు సంయుక్తంగా 65 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో కొనసాగాయి.
మెటా, లెన్స్‌కార్ట్ కొత్తగా ప్రవేశపెట్టిన మోడల్స్ దన్నుతో స్మార్ట్ గ్లాసెస్ అమ్మకాలు 4,000 నుంచి ఏకంగా 50,000 యూనిట్లకు పెరిగాయి.
స్మార్ట్ రిస్ట్‌బ్యాండ్స్ విక్రయాలు 118.5 శాతం పెరిగి 83,000 యూనిట్లకు చేరాయి. ప్రధానంగా శాంసంగ్‌కి చెందిన ఫిట్3కి గణనీయంగా డిమాండ్ నెలకొంది. క్యూ2లో రిస్ట్‌బ్యాండ్స్ కేటగిరీలో శాంసంగ్ 80.6 శాతం మార్కెట్ వాటా దక్కించుకుంది.