
ముంబై: ట్రేడింగ్ ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులకు లోనైన స్టాక్ సూచీలు గురువారం (ఫిబ్రవరి 16) స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. ఇంట్రాడేలో 486 పాయింట్లు పరిధిలో కదలాడిన సెన్సెక్స్ చివరికి 44 పాయింట్ల లాభంతో 61,320 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 136 పాయింట్ల రేంజ్ కదలాడింది. ఆఖరికి 20 పాయింట్లు బలపడి 18,135 వద్ద నిలిచింది. సూచీలకిది వరుసగా మూడోరోజూ లాభాల ముగింపు. ఉదయం ఉత్సాహంగా ట్రేడింగ్‌ను ప్రారంభించిన సూచీలు ఇంట్రాడేలో భారీ ఊగిసలాటకు లోనయ్యాయి.
ఆఖరి గంటలో లార్జ్ క్యాప్ షేర్లలో తలెత్తిన అమ్మకాలు ఆరంభ లాభాలను హరించివేశాయి. వీక్లీ ఇండెక్స్ ఆప్షన్స్ ఎక్స్‌పైరీ కావడంతో బ్యాంకింగ్, ఫైనాన్స్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. విస్తృత స్థాయి మార్కెట్లో ఐటీ, మెటల్, ఫార్మా, రియల్టీ, ఇంధన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా బీఎస్‌ఈ స్మాల్, మిడ్ క్యాప్ సూచీలు ఒకశాతం చొప్పున లాభపడ్డాయి. రూపాయి విలువ ఎనిమిది పైసలు బలపడి 82.72 వద్ద స్థిరపడింది.
మార్కెట్లో మరిన్ని సంగతులు
- అంతర్జాతీయంగా దిగివచ్చిన క్రూడ్ ఆయిల్ ధరలకు అనుగుణంగా కేంద్రం విండ్‌ఫాల్ పన్నును తగ్గించింది. ఈ అంశం దేశీయ అయిల్ మార్కెటింగ్ కంపెనీల షేర్లకు కలసిసొచ్చింది. ఓఎన్‌జీసీ 5.66%, ఆయిల్ ఇండియా అయిదు శాతం చొప్పున లాభపడ్డాయి.
- నాన్ బ్యాంకింగ్ ఆర్థిక సేవల సంస్థ అక్మే ఫిన్‌ట్రేడ్ ఐపీఓకు వచ్చేందుకు సెబీకి ముసాయిదా పత్రాలు సమర్పించింది. పబ్లిక్ ఇష్యూలో భాగంగా కంపెనీ 1.1 కోట్ల తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. గ్రేటెక్స్ కార్పొరేట్ సర్వీసెస్ లిమిడ్ ఈ ఇష్యూకు బుక్ రన్నింగ్ మేనేజర్‌గా వ్యవహరించనుంది.
(ఇదీ చదవండి: వెబ్‌సైట్ల నిర్వహణ తప్పనిసరి.. సెబీ ఆదేశాలు)