
తదుపరి గమ్యం రూ. లక్షన్నర
ఏడాది కాలంలో చేరుకోవచ్చు...
మోతీలాల్ ఓస్వాల్ నివేదిక అంచనా
పారిశ్రామిక, పెట్టుబడులపరంగా డిమాండ్
న్యూఢిల్లీ: బంగారం మాదిరే వెండికి సైతం డిమాండ్ బలపడుతోంది. ఫలితంగా వెండి ధర కిలోకి రూ.1.5 లక్షలకు చేరుకోవచ్చని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అంచనా వేసింది. బలమైన పారిశ్రామిక డిమాండ్, డాలర్ బలహీనత, సురక్షిత సాధనంగా పెట్టుబడుల డిమాండ్ ధరలకు మద్దతునిస్తున్నట్టు పేర్కొంది. ఈ ఏడాది ఇప్పటి వరకు ఎంసీఎక్స్ మార్కెట్లో వెండి ధర 37 శాతం పెరిగినట్టు గుర్తు చేసింది.
‘‘వెండి ధరలు క్రమంగా పెరుగుతూ వచ్చే ఆరు నెలల్లో కిలోకి రూ.1,35,000కు చేరుకోవచ్చు. 12 నెలల్లో రూ.1,50,000కు చేరొచ్చు. డాలర్‌తో రూపాయి మారకం 88.5 శాతం స్థాయిలో ఉంటుందని భావిస్తూ వేసిన అంచనా ఇది’’అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ తన నివేదికలో తెలిపింది. అంతర్జాతీయంగా చూస్తే కామెక్స్ మార్కెట్లో వెండి ఫ్యూచర్స్ తొలుత ఔన్స్‌కు 45 డాలర్లు, తర్వాత 50 డాలర్లకు చేరుకోవచ్చని అంచనా వేసింది.
బలమైన డిమాండ్
2025లో వెండి మొత్తం ఉత్పత్తిలో 60 శాతం డిమాండ్ పారిశ్రామిక రంగం నుంచి వచ్చినట్టు యూఎస్‌కు చెందిన సిల్వర్ ఇన్‌స్టిట్యూట్ తెలిపింది. సోలార్ విద్యుత్, ఎలక్ట్రికల్ వాహనాలు, 5జీ ఇన్‌ఫ్రా రంగాల నుంచి వచ్చే కొన్ని త్రైమాసికాల పాటు వెండికి డిమాండ్ కొనసాగుతుందని మోతీలాల్ ఓస్వాల్ తెలిపింది. సిల్వర్ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్‌లోకి పెట్టుబడులు పెరుగుతుండడం కూడా ధరలు ఎగిసేందుకు దారితీస్తున్నట్టు పేర్కొంది.
బంగారానికి తోడు వెండిని సైతం తమ రిజర్వుల్లోకి చేర్చుకోవడానికి కొన్ని సెంట్రల్ బ్యాంక్‌లు ఆసక్తి చూపిస్తుండడం, వెండి మెరుపులకు తోడవుతోంది. వచ్చే మూడేళ్లలో 535 మిలియన్ డాలర్ల విలువైన వెండిని తమ దేశ రిజిర్వుల్లోకి చేర్చుకోనున్నట్టు రష్యా ఇటీవలే ప్రకటించింది. సౌదీ అరేబియా సెంట్రల్ బ్యాంక్ ఈ ఏడాది 40 మిలియన్ డాలర్ల మేర సిల్వర్ ఈటీఎఫ్‌లను కొనుగోలు చేయనుంది.
3,000 టన్నుల దిగుమతి
దేశీయంగానూ వెండికి డిమాండ్ బలంగా పెరుగుతోంది. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో 3,000 టన్నుల వెండి దిగుమతి అయింది. పారిశ్రామిక రంగం నుంచే కాకుండా, పెట్టుబడులకు సైతం డిమాండ్ నెలకొంది. ‘‘జాక్సన్ హోల్ సింపోజియం తర్వాత ఫెడ్ సెప్టెంబర్ సమావేశంలో పావు శాతం మేర రేట్లను తగ్గించడం తప్పనిసరి అని తెలుస్తోంది. తక్కువ రేట్లు, యూఎస్ ఈల్డ్స్ క్షీణిస్తుండడం విలువైన లోహాల ధరలకు మద్దతునిస్తోంది’’అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నివేదిక వెల్లడించింది. అయితే ఇటీవల వెండి ధరలు గణనీయంగా పెరిగిన దృష్ట్యా స్వల్పకాలంలో లాభాల స్వీకరణను కొట్టిపారేయలేమని పేర్కొంది. ప్రస్తుత స్థాయి నుంచి, రేట్లు తగ్గిస్తే రూ.1,18,000– 1,15,000 స్థాయి వరకు వెండిని కొనుగోలు చేసుకోవచ్చని సూచించింది.