22,000 దిగువకు నిఫ్టీ

Sensex tanks 736 pts to Nifty slides below 22000 mark as Japan rate hike stokes inflation concerns - Sakshi

నెల కనిష్టానికి సూచీలు 

ప్రపంచ ప్రతికూలతల ప్రభావం  

ముంబై: బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌ కీలక వడ్డీ రేట్లను 17 ఏళ్ల తర్వాత పెంచడంతో ద్రవ్యోల్బణ భయాలు భారత్‌ ఈక్విటీ మార్కెట్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఫెడరల్‌ రిజర్వ్‌ ద్రవ పాలసీ నిర్ణయాల వెల్లడి(నేడు)కి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు.  బ్రెండ్‌ క్రూడాయిల్‌ బ్యారెల్‌ ఫ్యూచర్స్‌ ధర అయిదు నెలల గరిష్టం 85 డాలర్లపైకి ఎగిసింది. జపాన్‌ వడ్డీ రేట్ల పెంపుతో డాలర్‌ ఇండెక్స్‌ బలపడింది. ఈ పరిణామాలతో మంగళవారం సెన్సెక్స్‌ 736 పాయింట్లు నష్టపోయి 72,012 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 238 పాయింట్లు పతనమై 22,000 స్థాయిని కోల్పోయి 21,817 వద్ద నిలిచింది.

ముగింపు స్థాయిలు ఇరు సూచీలకు నెల కనిష్టం. ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న దేశీయ మార్కెట్‌ ఉదయం బలహీనంగా మొదలైంది. అన్ని రంగాల షేర్లూ అమ్మకాల ఒత్తిడికి లోనడంతో సూచీలు ట్రేడింగ్‌ ఆద్యంతం నష్టాల్లోనే ట్రేడయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 815 పా యింట్లు క్షీణించి 72,000 స్థాయి దిగువున 71,933 వద్ద, నిఫ్టీ 263 పాయింట్లు నష్టపోయి 21,793 వద్ద ఇంట్రాడే కనిష్టాలను చూశాయి. చిన్న, మధ్య తరహా షేర్లలో విక్రయాలు కొనసాగాయి.

జపాన్‌ ఎకానమీకి జోష్‌! 
ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ జపాన్‌ పురోగమన బాటన పడుతున్నట్లు కనిపిస్తోంది. 17 సంవత్సరాల నెగటివ్‌ రుణ రేటు వ్యవస్థకు 4.2 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీ ముగింపు పలికింది. బ్యాంకులకు బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌ ఇచ్చే ఓవర్‌నైట్‌ రుణ రేటు మైనస్‌ 0.1 శాతం నుంచి ప్లస్‌ 0–0.1 శాతం శ్రేణికి పెరిగింది.

రూ. 4.86 లక్షల కోట్లు ఆవిరి
సెన్సెక్స్‌ ఒక శాతానికి పైగా నష్టపోవడంతో బీఎస్‌ఈలో రూ.4.86 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలోని లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.373 లక్షల కోట్లకు దిగివచ్చింది. ఈ సూచీలో 30 షేర్లకు గానూ ఏడు మాత్రమే లాభపడ్డాయి.

టీసీఎస్‌ నిరాశ..
టీసీఎస్‌ షేరు రెండేళ్లలో అతిపెద్ద పతనాన్ని చవిచూసింది. ప్రమోటర్‌ సంస్థ టాటా సన్స్‌ బ్లాక్‌ డీల్‌ ద్వారా 2.3 కోట్ల ఈక్విటీ షేర్ల విక్రయంతో ఈ షేరు అమ్మకాల ఒత్తిడికి లోనైంది. ట్రేడింగ్‌లో నాలుగున్నర శాతం క్షీణించి రూ. 3,967 వద్ద రెండేళ్ల కనిష్టాన్ని తాకింది. చివరికి 4% నష్టంతో రూ.3,978 వద్ద ముగిసింది.  

పాపులర్‌ వెహికల్స్‌ పేలవం
 పాపులర్‌ వెహికల్స్‌ అండ్‌ సర్విసెస్‌ లిస్టింగ్‌ మెప్పించలేకపోయింది. ఇష్యూ ధర(రూ.295)తో పోలిస్తే బీఎస్‌ఈలో 1% డిస్కౌంట్‌తో రూ.292 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్‌లో 11% క్షీణించి రూ.263 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 6% నష్టంతో రూ.276 వద్ద ముగిసింది. మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.1,967 కోట్లుగా నమోదైంది.

Election 2024

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top