
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా మూడో రోజు కూడా నష్టాల్లో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు అనంతరం పుంజుకొని లాభాల్లోకి మళ్లింది. 250 పాయింట్లకుపైగా పెరిగి 58 వేల 175 వద్ద గరిష్ఠం నమోదుచేసింది. గత సెషన్ల మాదిరిగానే ఆఖరి గంటలో మళ్లీ భారీ కుదుపునకు లోనైంది. రష్యా- ఉక్రెయిన్ ఉద్రిక్త పరిస్థితులు.. ఫార్మా, రియాల్టీ, ఆయిల్ & గ్యాస్ స్టాక్స్ భారీగా పడిపోవడం చేత మూడో సెషన్లో మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి.
ముగింపులో, సెన్సెక్స్ 59.04 పాయింట్లు(0.10%) క్షీణించి 57,832.97 వద్ద స్థిరపడితే, నిఫ్టీ 28.30 పాయింట్లు (0.16%) నష్టపోయి 17,276.30 వద్ద ముగిసింది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.66 వద్ద ఉంది. నిఫ్టీలో కోల్ ఇండియా, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, బజాజ్ ఆటో, హెచ్డీఎఫ్సీ, గ్రేసిమ్, లార్సెన్ & టౌబ్రో రాణిస్తే.. సిప్లా, ఓఎన్జీసీ, దివీస్ ల్యాబ్స్, అల్ట్రాటెక్ సిమెంట్, శ్రీ సిమెంట్స్ డీలాపడ్డాయి. శుక్రవారం సెషన్లో బ్యాంకింగ్ రంగం షేర్లు మాత్రం స్వల్పంగా లాభపడితే.. ఫార్మా, రియాల్టీ, ఆయిల్ & గ్యాస్ షేర్లు 1 శాతం పతనమయ్యాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్‌క్యాప్ సూచీలు కూడా నష్టాల్లోనే ముగిశాయి.