వారాంతాన బుల్‌ రంకెలు

Sensex jumps 900 points, Nifty settles near 17600 - Sakshi

కలిసొచ్చిన జాతీయ, అంతర్జాతీయ సంకేతాలు 

అన్ని రంగాల షేర్లకు డిమాండ్‌ 

నాలుగువారాల్లో అతిపెద్ద లాభం 

సెన్సెక్స్‌ 900 పాయింట్లు ప్లస్‌ 

నిఫ్టీకి 272 పాయింట్ల లాభం  

ముంబై: దలాల్‌ స్ట్రీట్‌లో వారాంతాన బుల్‌ రంకెలు వేసింది. జాతీయ, అంతర్జాతీయ సానుకూల సంకేతాల అండతో  శుక్రవారం స్టాక్‌ సూచీలు లాభాల జోరు కనబరిచాయి. ముఖ్యంగా అధిక వెయిటేజీ, కీలక రంగాలైన బ్యాంకింగ్, ఫైనాన్స్‌ షేర్లలో షార్ట్‌ కవరింగ్‌ చోటు చేసుకుంది. ఇటీవల మార్కెట్‌ పతనంతో కనిష్టాలకు దిగివచ్చిన స్టాక్‌లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. ఫలితంగా సూచీలు నెలరోజుల్లో అతిపెద్ద లాభాన్ని ఆర్జించాయి. సెన్సెక్స్‌ 900 పాయింట్లు బలపడి 59,809 వద్ద స్థిరపడింది. నిఫ్టీ  272 పాయింట్లు పెరిగి 17,594 వద్ద నిలిచింది.

చిన్న, మధ్య తరహా షేర్లకు మోస్తారు స్థాయిలో రాణించడంతో మిడ్, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు అరశాతానిపైగా లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.246 కోట్లు, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2,090 కోట్ల షేర్లను కొన్నారు. దేశీయ సేవారంగం పుంజుకోవడం, ఎఫ్‌ఐఐల రెండోరోజూ కొనుగోళ్లతో డాలర్‌ మారకంలో రూపాయి విలువ 63 పైసలు బలపడి నెల గరిష్టం 81.97 వద్ద స్థిరపడింది. అమెరికా మార్కెట్లు గురువారం ఒకశాతం బలపడ్డాయి. ఆసియా, యూరప్‌ సూచీలు ఒకటిన్నర శాతం ర్యాలీ చేశాయి. యూఎస్‌ స్టాక్‌ ఫ్యూచర్లు అరశాతం లాభంతో ట్రేడయ్యాయి.  

రోజంతా లాభాలే...
ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న దేశీయ మార్కెట్‌ ఉదయం లాభంతో మొదలైంది. సెన్సెక్స్‌ 332 పాయింట్లు పెరిగి 59,241 వద్ద, నిఫ్టీ 129 పాయింట్లు బలపడి 17,451 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు రోజంతా లాభాల్లోనే కదలాడాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 1,058 పాయింట్లు దూసుకెళ్లి 59,967 వద్ద, నిఫ్టీ 323 పాయింట్లు ఎగసి 17,645 వద్ద ఇంట్రాడే గరిష్టాలను అందుకున్నాయి.  

లాభాలు ఎందుకంటే..: అంతర్జాతీయ ఇన్వెస్టర్‌ జీక్యూజీ పాట్నర్‌ అదానీ గ్రూప్‌నకు చెందిన 2 బిలియన్‌ డాలర్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేయడంతో మార్కెట్‌ వర్గాలకు కొంత ఊరట లభించింది. జీక్యూజీ ఒప్పందంతో సమకూరిన నిధులను రుణాల చెల్లింపునకు వినియోగిస్తామని అదానీ గ్రూప్‌ తెలపడంతో ఎక్స్‌పోజర్‌ ఉన్న బ్యాంకింగ్‌ భారీగా ర్యాలీ చేశాయి. ఫిబ్రవరి సేవల రంగం 12 ఏళ్లలోనే బలమైన వృద్ధిని నమోదుచేసింది. డాలర్‌ మారకంలో రూపాయి విలువ నెల గరిష్టానికి చేరుకోవడం, విదేశీ ఇన్వెస్టర్లు వరుసగా రెండోరోజూ కొనుగోళ్ల చేపట్టడం కూడా కలిసొచ్చాయి. వచ్చే ద్రవ్య పాలసీ సమావేశం నుంచి ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల పెంపు 25 బేసిస్‌ పాయింట్లు మాత్రమే ఉండొచ్చని, అలాగే ఈ ఏడాది ద్వితీయార్థం నుంచి రేట్ల పెంపు సైకిల్‌ అగిపోవచ్చంటూ అట్లాంటా ఫెడరల్‌ రిజర్వ్‌ ప్రెసిడెంట్‌ రాఫెల్‌ బోస్టిక్‌ వ్యాఖ్యలు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో
సానుకూలతలు నింపాయి.

మార్కెట్‌లో మరిన్ని విశేషాలు..
► ఇన్వెస్టర్లు, నియంత్రణ సంస్థల్లో విశ్వాసాన్ని నింపేందుకు అదానీ గ్రూప్‌ చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలనిస్తున్నాయి. తాజాగా జీక్యూజీ పార్ట్‌నర్స్‌ రూ.15,446 కోట్ల కొనుగోలు ఒప్పందంతో శుక్రవారం ఈ గ్రూప్‌లో మొత్తం పది షేర్లూ లాభపడ్డాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ అత్యధికంగా 17% దూసుకెళ్లింది. అదానీ పోర్ట్స్‌ 10%, అంబుజా సిమెంట్స్‌ 6%, ఏసీసీ, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ గ్రీన్, అదానీ టోటల్, అదానీ పవర్, అదానీ విల్మార్, ఎన్‌డీటీవీ షేర్లు 5% చొప్పున లాభపడ్డాయి. గత 3 ట్రేడింగ్‌ సెషన్లలో ఈ గ్రూప్‌లో రూ.1.42 కోట్ల సంపద సృష్టి జరిగింది.

► సెన్సెక్స్‌ ఒకటిన్నర శాతం ర్యాలీ చేయడంతో బీఎస్‌ఈలో రూ. 3.43 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ కంపెనీల మొత్తం విలువ రూ. 263 లక్షల కోట్లకు చేరింది. ఇదే సూచీలో 30 షేర్లలో టెక్‌ మహీంద్రా (2%),
అల్ట్రాటెక్‌ (1%), ఏషియన్‌ పేయింట్స్‌ (0.19%), నెస్లే లిమిటెడ్‌ (0.17%) మాత్రమే నష్టపోయాయి.  

► ఆటోమోటివ్‌ విడిభాగాల కంపెనీ డివ్‌జీ టార్క్‌ట్రాన్స్‌ఫర్‌ సిస్టమ్స్‌ పబ్లిక్‌ ఇష్యూ విజయవంతమైంది. చివరి రోజు నాటికి 5.44 రెట్లు సబ్‌స్క్రైబ్‌ అయ్యింది. ఇష్యూలో భాగంగా కంపెనీ 38.41 లక్షల షేర్లను జారీ చేయగా 2.08 కోట్ల షేర్లకు బిడ్లు ధాఖలయ్యాయి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top