4 రోజుల ర్యాలీకి బ్రేక్‌

Sensex and Nifty lose 4-day rising streak amid mixed global cues - Sakshi

అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు 

ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్‌ షేర్లలో అమ్మకాలు

11,900 పాయింట్ల దిగువకు నిఫ్టీ  

ముంబై: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మన స్టాక్‌ మార్కెట్‌కు ప్రతికూల సంకేతాలు అందాయి. ఫలితంగా సూచీల నాలుగు రోజుల వరుస ర్యాలీకి గురువారం బ్రేక్‌ పడింది. ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్, ఆర్థిక, ఇంధన రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్‌ 149 పాయింట్లు తగ్గి 40,558 వద్ద సిర్థపడింది. నిఫ్టీ 41 పాయింట్లు నష్టపోయి 11,896 వద్ద నిలిచింది. మెటల్, మీడియా, ఎఫ్‌ఎంసీజీ, రియల్టీ రంగాల షేర్లకు స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించింది.  

అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకాలు...  
కొలిక్కిరాని అమెరికా ఉద్దీపన ప్యాకేజీ అంశం, పెరుగుతున్న కోవిడ్‌–19 కేసులతో అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకాలు జరిగాయి. అలాగే అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ(ఐఎంఎఫ్‌) ఈ ఏడాది కాలానికి ఏషియన్‌–పసిఫిక్‌ ప్రాంత వృద్ధి అవుట్‌లుక్‌ను మైనస్‌ 2.2 శాతానికి డౌన్‌గ్రేడ్‌ చేయడం కూడా ప్రపంచ మార్కెట్లలో నిరాశ నెలకొంది. ఆసియా, యూరప్‌లోని ప్రధాన మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. అలాగే అమెరికా ఫ్యూచర్లు అరశాతం నష్టాల్లో కదిలాయి. అంతర్జాతీయ మార్కెట్లకు ఇది 2 వారాల కనిష్టం స్థాయి కావడం గమనార్హం.

అరబిందో ఫార్మా షేరుకు రెగ్యులేటరీ కష్టాలు...
అరబిందో ఫార్మా షేరు గురువారం బీఎస్‌ఈలో 3 శాతం నష్టపోయింది. అమెరికాలోని తన అనుబంధ సంస్థ అరోలైఫ్‌ ఫార్మాకు చెందిన న్యూజెర్సీ యూనిట్‌లో లోపాలను గుర్తించిన యూఎస్‌ఎఫ్‌డీఏ వార్నింగ్‌ లెటర్‌ను జారీ చేసింది. దీంతో ఒక దశలో షేరు 7 శాతం నష్టపోయి రూ.749.55 స్థాయికి పతనమైంది. చివరకు 3 శాతం నష్టంతో రూ.782 వద్ద ముగిసింది.  

ఈక్విటాస్‌ ఎస్‌ఎఫ్‌బీ ఐపీవోకు రెట్టింపు స్పందన
ఈక్విటాస్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు ఐపీవోకు చివరి రోజైన గురువారం ముగింపు సమయానికి రెండు రెట్లు అధికంగా బిడ్లు దాఖలయ్యాయి. ఐపీవోలో భాగంగా సంస్థ 11,58,50,001 షేర్లను ఆఫర్‌ చేయగా, 22,57,94,250 షేర్లకు బిడ్లు వచ్చాయి. క్వాలిఫైడ్‌ ఇనిస్టిట్యూషనల్‌ బయర్స్‌ (క్యూఐబీ) విభాగం 3.91 రెట్లు అధికంగా సబ్‌స్క్రయిబ్‌ అయింది. నాన్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్ల విభాగంలో కేవలం 22 శాతం అధిక స్పందన వచ్చింది. ఇక రిటైల్‌ కోటా కింద ఉంచిన షేర్లకు 2.08 రెట్లు అధికంగా బిడ్లు వచ్చాయి. ఒక్కో షేరు ధరల శ్రేణి రూ.32–33గా ఉంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top