ఇన్ఫీ షేర్లను భారీగా విక్రయించిన కో-ఫౌండర్‌

SD Shibulal family sells 85 lakh shares of Infosys - Sakshi

ఇన్ఫోసిస్ కో ఫౌండర్‌ ఎస్‌డీ షిబులాల్‌ కుటుంబం కీలక నిర్ణయం

ఇన్ఫీలో 85 లక్షల షేర్ల విక్రయం

సాక్షి,ముంబై : ప్రముఖ టెక్‌ సంస్థ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎస్‌డీ షిబులాల్ కుటుంబం కీలక నిర్ణయం తీసుకుంది.  భారీ ఎత్తున ఇన్ఫోసిస్‌  షేర్లను విక్రయించారు. జూలై 22-24 తేదీలలో కంపెనీకి చెందిన 85 లక్షల షేర్లను విక్రయించినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌  సమాచారం ద్వారా తెలుస్తోంది.  ఈ అమ్మకానికి సిటీ గ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మధ్యవర్తిత్వం వహించగా, వాటాల విక్రయం ద్వారా వచ్చే ఆదాయాన్ని దాతృత్వం, పెట్టుబడి కార్యకలాపాలకు వినియోగించనున్నామని షిబులాల్‌  కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

షిబులాల్ కుమారుడు శ్రేయాస్ 40 లక్షల షేర్లను విక్రయించారు. ఈ అమ్మకం ద్వారా ఇన్ఫోసిస్ లిమిటెడ్‌లో అతని వాటా 0.56 శాతం నుంచి 0.09 శాతానికి చేరింది. షిబూలా​ అల్లుడు గౌరవ్ మంచంద 18 లక్షల షేర్లను (0.04 శాతం) విక్రయించగా, మనవడు మిలన్ షిబులాల్ మంచంద 15 లక్షల షేర్లు (0.03 శాతం) విక్రయించారు. గౌరవ్ వాటా ఇప్పుడు 0.32 శాతంగా ఉండగా, మిలన్ వాటా 0.33 శాతంగా ఉంది. మరోవైపు షిబూలాల్‌ భార్య కుమారి ఇన్ఫోసిస్ 12 లక్షల షేర్లను (0.03 శాతం) విక్రయించడంతో ఆమె వాటా ఇప్పుడు 0.22 శాతంగా ఉంది. 

ఇన్ఫోసిస్ మరో సహ వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్ తో కలిసి స్థాపించిన ఆక్సిలర్ వెంచర్స్ ద్వారా టెక్నాలజీ స్టార్టప్ లలో షిబులాల్ పెట్టుబడులు పెట్టారు. అలాగే సరోజిని దామోదరన్, అద్వైత్ ఫౌండేషన్ ద్వారా విద్య, సాంఘిక సంక్షేమం లాంటి వివిధ సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. కాగా 1981లో 250 అమెరికా డాలర్లతో ఎస్‌డి షిబులాల్‌తో పాటు ఎన్‌ఆర్ నారాయణ మూర్తి, నందన్ నీలేకని, క్రిస్ గోపాల క్రిష్ణన్, కే దినేష్, ఎన్ఎస్ రాఘవన్ కలిసి ఇన్ఫోసిస్ సంస్థను స్థాపించారు. షిబులాల్ 2011- 2014 వరకు ఇన్ఫోసిస్ సీఎండీగా పనిచేశారు. అంతకుముందు 2007-2011 వరకు సంస్థ సీఓఓగా ఉన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top