పాన్‌ లింక్‌ చేయకపోతే ఎస్‌బీఐ యోనో అకౌంట్‌ బ్లాక్‌ అవుతుందా?

SBI Yono Account Blocked If Pan Is Not Linked Fake Or Real - Sakshi

పాన్‌ నంబర్‌ అప్‌డేట్ చేయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) యోనో అకౌంట్లు బ్లాక్‌ అవుతాయని, వెంటనే అప్‌డేట్‌ చేసుకోవాలంటూ లింక్‌తో కూడిన మెసేజ్‌లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే అలాంటిదేమీ లేదని ఎస్‌బీఐ ఖండించింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) కూడా ఇవి పూర్తిగా ఫేక్‌ అని తేల్చింది. ఒక వేళ అకౌంట్లను అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉన్నా ఎస్‌బీఐ అలాంటి లింక్‌లను పంపదని పేర్కొంది.

ఖాతాదారులకు బ్యాంకింగ్‌ సేవలను సులభతరం చేయడానికి ఎస్‌బీఐ అనేక సౌకర్యాలను అందిస్తోంది. ఇందులో భాగంగా యోనో మొబైల్ బ్యాంకింగ్ యాప్‌ను తీసుకొచ్చింది. ఈ యాప్‌ వినియోగం ఇటీవల బాగా పెరిగింది. దీని ద్వారా కస్టమర్లు బ్యాంకుకు వెళ్లకుండానే మొబైల్‌ ద్వారా బ్యాంకింగ్ లావాదేవీలను చేసుకోవచ్చు. అయితే సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మొబైల్ నంబర్లు, ఆధార్ నంబర్లు, పాన్ కార్డ్ నంబర్లు, క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ నంబర్లు, ఓటీపీలు వంటి వ్యక్తిగత వివరాలను ఎప్పుడూ షేర్‌ చేయకూడదని కస్టమర్లను బ్యాంక్ హెచ్చరించింది.

సైబర్ నేరాలు, వాటి వల్ల కలిగే నష్టాలు, వ్యక్తిగత సమాచార భద్రత గురించి ఎస్‌బీఐ కస్టమర్లను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తోంది. మెసేజ్‌లు లేదా ఈ-మెయిల్‌ల ద్వారా పంపిన లింక్‌లను ఎప్పుడూ క్లిక్ చేయవద్దని, తెలియని కాల్స్‌ లేదా మెసేజ్‌లకు స్పందించి ఎలాంటి వ్యక్తిగత వివరాలను షేర్ చేయకూడదని సూచించింది.  తాజాగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న మెసేజ్‌ను నమ్మొద్దని, ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా మాత్రమే ఖాతా వివరాలను అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది.

(ఇదీ చదవండి: అంబానీ సోదరి రూ.68 వేల కోట్ల కంపెనీకి అధిపతి.. ఈమె గురించి తెలుసా?)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top