భారతీయ మహిళలు ఇప్పుడు స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతూ సంపద సృష్టిలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ ధోరణిని మరింత బలోపేతం చేస్తూ ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ ఎస్‌బీఐ సెక్యూరిటీస్ తన మొబైల్ అప్లికేషన్‌లో ‘ఉమెన్స్ మోడ్’ అనే సరికొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. మహిళా పెట్టుబడిదారుల ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా రూపొందించిన ఈ ప్లాట్‌ఫారమ్ ఎకానమీ మార్కెట్‌లో వారి భాగస్వామ్యాన్ని మరింత సులభతరం చేయనుంది.
6,000 మంది మహిళల అభిప్రాయాలతో..
ఏదో ఒక ఫీచర్‌ను మొక్కుబడిగా ప్రవేశపెట్టడం కాకుండా క్షేత్రస్థాయిలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లను అర్థం చేసుకోవడానికి ఎస్‌బీఐ సెక్యూరిటీస్ విస్తృతమైన కసరత్తు చేసిందని అధికారులు చెప్పారు. సుమారు 6,000 మందికి పైగా మహిళా ఇన్వెస్టర్ల నుంచి సేకరించిన అభిప్రాయాలు, వారు ఎదుర్కొంటున్న సమస్యల ఆధారంగా ఈ ‘ఉమెన్స్ మోడ్’ను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. సంక్లిష్టంగా ఉండే పెట్టుబడి ప్రక్రియను సరళతరం చేయడం ఈ ఫీచర్ ప్రధాన ఉద్దేశమని చెప్పారు.
ఈ ఫీచర్ ప్రత్యేకతలు
ఈ ఫీచర్‌తో ఈక్విటీ మార్కెట్‌లో ఎడ్యుకేషన్, పదవీ విరమణ లేదా సొంత ఇల్లు వంటి వ్యక్తిగత ఆకాంక్షలకు అనుగుణంగా ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్లను ఎంచుకోవచ్చు. మార్కెట్ జార్గన్ (క్లిష్ట పదజాలం) తగ్గించి సులభమైన రీతిలో సమాచారాన్ని అందిస్తుంది. ఇన్వెస్టర్ల అనుభవం, రిస్క్ సామర్థ్యాన్ని బట్టి వ్యక్తిగతీకరించిన పెట్టుబడి మార్గాలను సూచిస్తుంది.
ఎస్‌బీఐ సెక్యూరిటీస్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో భువనేశ్వరి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళలు ఇప్పుడు ఆర్థిక నిర్ణయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని హర్షం వ్యక్తం చేశారు. ‘మహిళల ఆర్థిక ఆకాంక్షలకు అనుగుణంగా సమస్య పరిష్కారాలను రూపొందించాల్సిన బాధ్యత ఆర్థిక సంస్థలపై ఉంది. మహిళలకు సాధికారత కల్పించి వారిలో నమ్మకాన్ని నింపే ఉమెన్స్ మోడ్‌ను ప్రారంభించాం’ అని చెప్పారు.
ఇదీ చదవండి: డాలర్ ఆధిపత్యానికి గండి!


