SBI అలర్ట్: వరుసగా 6 రోజులు బ్యాంకులు బంద్? | SBI Holidays Alert Banks Remain Shut For Six Days, Check Out Holidays List Details Inside | Sakshi
Sakshi News home page

SBI అలర్ట్: వరుసగా 6 రోజులు బ్యాంకులు బంద్?

May 22 2026 8:50 PM | Updated on May 23 2026 10:42 AM

SBI Holidays Alert Banks remain shut for six days

మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో ఖాతా ఉందా? ఏదైనా ముఖ్యమైన పని మీద వచ్చే వారం బ్యాంకుకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వార్త ఖచ్చితంగా మీ కోసమే. మే 23 (శనివారం) నుండి దేశవ్యాప్తంగా వరుసగా ఆరు రోజుల పాటు ఎస్‌బీఐ సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉందంటూ సామాజిక మాధ్యమాల్లో, కొన్ని వార్తా సంస్థల్లో వార్తలు వస్తున్నాయి. వారాంతపు సెలవులు, సిబ్బంది సమ్మె, బక్రీద్ పండుగలు వరుసగా రావడం దీనికి కారణమని ప్రచారం జరుగుతోంది.

అయితే, నిజంగానే 6 రోజులు బ్యాంకులు పూర్తిగా మూతపడతాయా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెలవుల జాబితా, తాజా పరిస్థితుల ప్రకారం అసలు వాస్తవాలేంటో ఇప్పుడు చూద్దాం.

మే 23 నుండి మే 28 వరకు బ్యాంకుల పరిస్థితి ఇదీ..

మే 23 (నాల్గవ శనివారం):  దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు మూసివుంటాయి.
మే 24 (ఆదివారం):సాధారణ వారాంతపు సెలవు.
మే 25 & 26 (సోమ, మంగళవారాలు): సిబ్బంది సమ్మెతో ఎస్‌బీఐ శాఖల్లో అంతరాయం 
మే 27 (బుధవారం): బక్రీద్ సెలవు. హైదరాబాద్, విజయవాడ, న్యూఢిల్లీ, కోల్‌కతా, ముంబైతో పాటు దేశంలోని మెజారిటీ ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు.
మే 28 (గురువారం): బక్రీద్ సెలవు (రెండవ రోజు/కొన్ని ప్రాంతాల్లో) బెంగళూరు, చెన్నై, జైపూర్, పాట్నా వంటి కొన్ని నిర్దిష్ట నగరాల్లో మాత్రమే బ్యాంకులకు సెలవు ఉంటుంది.

అయితే బక్రీద్ సెలవు అనేది తెలుగు రాష్ట్రాల్లో (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) మే 27న ఉంటుంది. మే 28న ఇక్కడ బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయి. మే 25, 26 తేదీల్లో సిబ్బంది సమ్మె కారణంగా ఎస్‌బీఐ బ్రాంచ్‌లలో క్లెరికల్ సేవలకు అంతరాయం ఉంటుంది. ఇతర బ్యాంకులు (డిజిటల్ సేవలు, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ వంటి ప్రైవేట్ బ్యాంకులు) యథావిధిగా పనిచేస్తాయి.

సమ్మెకు కారణాలు ఏమిటి?
ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ (AISBISF) వివిధ డిమాండ్ల సాధనకై ఈ రెండు రోజులు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. సబ్-స్టాఫ్, ఆర్మ్‌డ్ గార్డుల ఖాళీలను భర్తీ చేయాలని, ఉద్యోగులపై పని ఒత్తిడిని తగ్గించాలని, అలాగే కస్టమర్లకు బీమా ఉత్పత్తులను బలవంతంగా అంటగట్టే ("మిస్-సెల్లింగ్") విధానాన్ని నిరసిస్తూ 16 డిమాండ్లతో ఎస్‌బీఐ స్టాఫ్ ఫెడరేషన్ ఈ సమ్మె నోటీసు ఇచ్చింది.

ఎస్‌బీఐ విజ్ఞప్తి

సిబ్బంది స‍మ్మె నేపథ్యంలో కస్టమర్లకు ఎస్‌బీఐ విజ్ఞప్తి చేసింది. బ్యాంకింగ్‌ సేవల కోసం ప్రత్యామ్నాయంగా కస్టమర్‌ సర్వీస్‌ పాయింట్లు, ఏంటీఎం, యోనో, యూపీఐ వంటి ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ సేవలు ఉపయోగించుకోవాలని సూచించింది. అదే సమయంలో ఖాతాదారులకు అత్యవసర సేవలకు గానూ బ్యాంక్‌ శాఖల్లో అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్‌బీఐ తన ఎక్స్‌ ఖాతాలో పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement